Arvind Kejriwal: త్వరలో ఢిల్లీ సీఎం అతిషి అరెస్ట్

Update: 2024-12-25 10:22 GMT

Arvind Kejriwal alleges Delhi CM Atishi will be arrested soon: త్వరలో ఢిల్లీ సీఎం అతిషిని అరెస్ట్ చేస్తారంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. అతిషి అరెస్ట్ కంటే ముందు కొందరు నేతల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తారంటూ ఆరోపించారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ దక్కడంతో అది చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని కేజ్రీవాల్ ఎక్స్ ద్వారా అభిప్రాయపడ్డారు. అందుకే అతిషిని తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆప్ ప్రభుత్వ ఎజెండాను పట్టాలు తప్పించేందుకు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయని చెప్పారు.

ఢిల్లీలో ఆఫ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీకి మింగుడు పడడంలేదని కేజ్రీవాల్ విమర్శించారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన స్కీమ్‌లు వాళ్లను కలవరపెడుతున్నాయని.. అందుకే తమపై విమర్శలు చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను దెబ్బ తీసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనేది ఈ ట్వీట్ ద్వారా కేజ్రీవాల్ చేస్తోన్న ప్రధాన ఆరోపణ.

వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళల కోసం ఆప్ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటించింది. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన లాడ్లీ బెహ్నా యోజన పథకాన్ని (Ladli Behen Yojana Scheme) సవరించి.. మహిళా సమ్మాన్ యోజన పేరుతో ఆప్ ఓ పథకాన్ని ప్రకటించింది.

ఇప్పటికే ఇలాంటి పథకం పేరుతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 అందిస్తోంది. తాము అధికారంలోకి వస్తే సమ్మాన్ యోజన పథకం కింద రూ.2100 అందిస్తామని కేజ్రీవాల్ (Mahila Samman Yojana Scheme) ప్రకటించారు. ఇక సంజీవని యోజన పథకంలో భాగంగా 60 ఏళ్లు ఆపై వయసు కలిగిన ఢిల్లీ వాసులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ఖర్చును భరించనుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లపై బీజేపీ, ఆప్‌ల మధ్య రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి.

Tags:    

Similar News