11 Murders in 18 Months: 11 మందికి లిఫ్ట్ ఇచ్చి చంపి, ఆ శవాల కాళ్లు మొక్కాడు
Serial killer Ram Swaroop Killed 11 Men in 18 Months: 11 మందికి లిఫ్ట్ ఇచ్చాడు.. వారితో స్వలింగ సంపర్క చర్యకు పాల్పడ్డాడు.. ఆ తరువాత వారి వద్ద ఉన్న డబ్బులు దోచుకుని వారిని చంపేశాడు. ఈ 11 మర్డర్స్ కూడా 18 నెలల వ్యవధిలో చేసినవే. ఇది తాజాగా వెలుగు చూసిన ఓ సీరియల్ కిల్లర్ రియల్ స్టోరీ. ఒక టోల్ ప్లాజా వద్ద ఛాయ్, వాటర్ బాటిల్స్ అమ్ముకునే ఓ 37 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యారు. ఆ కేసులో పోలీసులు మొదటిసారిగా ఈ సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి మరో 10 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అనే విషయం అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులకు కూడా తెలియదు. విచారణలో నిందితుడు చెప్పాకే అసలు విషయం తెలిసి షాక్ అవడం పోలీసుల వంతయ్యింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... పంజాబ్‌లోని రూప్ నగర్ జిల్లాలో మంగళవారం పంజాబ్ పోలీసులు ఈ సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేశారు. అతడి పేరు రామ్ స్వరూప్. వయస్సు 33 ఏళ్లు. హోషియార్‌పూర్ సమీపంలోని చౌరా గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ ఒక హోమో సెక్సువల్ వ్యక్తి.
రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ బతికే రామ్ స్వరూప్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే దారిలో వెళ్లే వారికి లిఫ్ట్ ఇస్తూ వారితోనే స్వలింగ సంపర్కానికి పాల్పడసాగాడు. ఆ తరువాత వారిని దోచుకోవడం, ఎదురు తిరిగిన వారిని చంపేయడం చేశాననని తనే అంగీకరించినట్లుగా పోలీసులు చెప్పారు. నిందితుడు చెప్పిన మిగతా 10 మర్డర్ కేసుల్లో 5 హత్యలు అతడే చేసినట్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. మరో ఐదు హత్య కేసులను దర్యాప్తు చేస్తున్నారు. రామ్ స్వరూప్ నేరచరిత్ర గురించి పోలీసులు మాట్లాడుతూ... "అతడు నేరాలకు పాల్పడిన హత్య కేసుల్లో ఎక్కువగా గొంతుకు గుడ్డ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినవేనని, లేదంటే మిగతా కేసుల్లో తలపై కొట్టి హత్య చేసినవి" అని పోలీసులు వెల్లడించారు.
హత్య చేసిన తరువాత ఆ మృతదేహాల కాళ్లు మొక్కేవాడిని...
డ్రగ్స్ మత్తులోనే ఈ నేరాలు చేశానని రామ్ స్వరూప్ అంగీకరించినట్లుగా రూప్ నగర్ పోలీసులు తెలిపారు. వారిని హత్య చేసిన తరువాత పశ్చాత్తాపంతో తనని క్షమించమని కోరుతూ వారి కాళ్లకు మొక్కేవాడినని రామ్ స్వరూప్ తెలిపాడు. ఆ తరువాత అసలు ఆ మర్డర్స్ గురించి గుర్తుంచుకునే వాడిని కానని, వెంటనే ఆ విషయం మర్చిపోయే వాడినని చెప్పుకొచ్చాడు. నిందితుడు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ అతడి హోమోసెక్సువాలిటీని అవమానంగా భావిస్తూ రెండేళ్ల క్రితమే ఆ కుటుంబం అతడిని విడిచిపెట్టింది.