హోలీ రోజు ఆ ఊర్లో మగాళ్లు ఎవ్వరూ ఉండరు... అంతా మహిళలదే రాజ్యం
Holi 2025 Traditions: హోలీ రోజు ఆ ఊర్లో మగాళ్లు ఎవ్వరూ కనిపించరు. ఆ రోజు అక్కడ లేడీస్‌దే రాజ్యం. ఆ ఊరి హోలీ పండగ ఆచారం.

Holi 2025: హోలీ రోజు ఆ ఊర్లో మగాళ్లు ఎవ్వరూ ఉండరు
Men not allowed to play Holi in this village: పండగలను ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. కొన్ని పండగల విషయంలో ఒక్కో ప్రాంతం వారికి ఒక్కో రకమైన ఆచారం కనిపిస్తుంది. పండగ చేసుకునే విధానంలోనో లేక పూజా విధానంలోనో ఏదో ఒక తేడా ఉంటుంది. హోలీ పండగ కూడా అందుకు మినహాయింపు కాదు.
హోలీ పండగ అంటేనే రంగుల పండగ. ఆడ, మగ అనే లింగభేదం లేకుండా అందరూ కలిసి రంగులు చల్లుకుని ఎంజాయ్ చేస్తుంటారు. పండగ వేళ పిండి వంటలు, స్వీట్స్, ఇష్టమైన వంటకాలు ఎలాగూ ఉండనే ఉంటాయి. ఈ విషయంలో చాలా ప్రాంతాల్లో పెద్దగా తేడాలు ఉండవు. కానీ పండగలను సెలబ్రేట్ ఆచార వ్యవహారాల్లోనే కొన్ని నియమాలు, తేడాలు ఉంటుంటాయి.
ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం హున్సా గ్రామంలో హోలీ పండగ రోజు పిడిగుద్దులు గుద్దుకునే సంప్రదాయం ఉంది. ఆరోజు గ్రామస్తులు అంతా ఊరి నడిమధ్యలో ఒక్కచోటచేరి ఒక పెద్ద తాడు కడతారు. ఆ తాడుకు ఇరువైపులా నిలబడి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఈ ఆచారంలో కొంతమంది గ్రామస్తులు తీవ్రంగా గాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే ఈసారి ఆ వేడుక జరుపడానికి వీళ్లేదని పోలీసులు గ్రామ అధికారులు, పెద్దలకు నోటీసులు జారీచేశారు. దీంతో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయాన్ని అడ్డుకోవడం ఏంటని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఇక ఈ పిడిగుద్దుల సంప్రదాయాన్ని పక్కనపెడితే.... రాజస్థాన్ టోంక్ జిల్లా నాగర్ గ్రామంలో మరో రకమైన ఆచారం ఉంది.
హోలీ పండగ రోజు ఆ ఊరిలో మగాళ్లు ఎవ్వరూ ఊరిలో ఉండరు. ఒకవేళ వయసైపోయిన పెద్దలు ఎవ్వరైనా ఊరిలో ఉన్నా... వారు ఇంట్లోంచి బయటికి రారు. ఇది ఆ గ్రామంలో 500 ఏళ్లుగా కొనసాగుతున్న నిబంధన అని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇంతకీ ఈ నిబంధన ఎందుకంటే.... ఊరిలో ఉన్న మగవాళ్లందరూ బయటికి వెళ్లగానే మహిళలు అందరూ ఏకమై హోలీ రంగుల్లో మునిగితేలుతారు. మహిళలకు హోలీ పండగ సెలబ్రేట్ చేసుకునే స్వేచ్ఛను ఇవ్వడం కోసమే ఆ గ్రామంలో ఈ నిబంధన విధించుకున్నారు.
పరదాల వ్యవస్థ నుండి వచ్చిన ఆచారం
ఈ ఆచారం పరదా వ్యవస్థ నుండి వచ్చిన ఆచారంగా గ్రామస్తులు చెబుతున్నారు. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ స్త్రీలు ఎవ్వరూ పురుషులకు తమ ముఖం కనిపించకుండా ముఖానికి చున్నీ అడ్డం పెట్టుకునే సంప్రదాయం ఉంది. కట్టుకున్న భర్త, తోబుట్టువులు, తండ్రి తప్ప స్త్రీలు మరో మగాడి ముఖం చూడొద్దు... ఇతరులకు తమ ముఖం కనిపించనివ్వొద్దు అనే పాతకాలం నాటి పరదాల సంస్కృతి అన్నమాట.
పూర్వ కాలంలో ఈ ఆచారం ఇంకా కఠినంగా అమలయ్యేది. స్త్రీ, పురుషులు కలిసి బహిరంగంగా ఏ వేడుకను జరుపుకునే వారు కాదు. అందుకే ఆనాడు స్త్రీలు హోలీ పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు వీలుగా ఈ గ్రామంలో మగాళ్లను ఊరి నుండి బయటికి పంపించేవారట. మహిళలు స్వేచ్చగా హోలీ ఆడుకోవడం కోసం ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగిస్తున్నామని ఆ గ్రామస్తులు చెబుతున్నారు.