Blood Moon: బ్లడ్ మూన్ టైమింగ్స్ ఏంటి? ఇండియాలో కనిపిస్తుందా? చంద్ర గ్రహణానికి ఆ పేరు ఎందుకొచ్చింది?

What is Blood Moon: ఈ బ్లడ్ మూన్ ఇండియాలో కనిపిస్తుందా? టైమింగ్స్ ఏంటి? అసలు బ్లడ్ మూన్ అని ఎందుకంటారు?
Blood moon 2025 Interesting Things: మార్చి 14న చంద్ర గ్రహణం పట్టనుంది. ఆకాశంలో దీనిని ఒక అద్భుతంగా ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేంటి... చంద్ర గ్రహణం అంటే ఎప్పుడూ వచ్చేదే కదా అని అనిపిస్తుండొచ్చు. అయితే, ఎప్పుడూ వచ్చే సాధారణ చంద్ర గ్రహణాల కంటే ఈ చంద్ర గ్రహణానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తున్నారు. అంటే చంద్రుడు నెత్తురు రంగులో కనిపించనున్నాడన్న మాట.
ఈ బ్లడ్ మూన్ చంద్ర గ్రహణానికి ఉన్న ఇతర ప్రత్యేకతలు ఏంటి? ఇండియాలో ఉండే వారికి ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుందా? ఏయే ప్రాంతాల వారికి వీక్షించే అవకాశం ఉంటుంది? ఈ చంద్ర గ్రహణాన్ని ఎలా వీక్షించవచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భూమి తన చుట్టూ తను తిరిగే క్రమంలో సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఫలితంగా చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడు ఎర్రగా మారడం అనేది జరగదు. కానీ ఈసారి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పుడుతోంది. ఆ సమయంలో భూ వాతావరణంలోంచి చంద్రుడిపైకి ప్రసరించే సూర్య కిరణాల ప్రభావం వల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. అంతే తప్పించి చంద్రుడు ఎర్రగా మారడం అనేది జరగదు.
సాధారణంగా చంద్ర గ్రహణం కొన్ని నిమిషాల పాటే ఉంటుంది. ఆ తరువాత చంద్ర గ్రహణం వీడుతుంది. అది కూడా కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇతర సంపూర్ణ చంద్ర గ్రహణాలతో పోల్చుకుంటే ఈసారి చాలా ఎక్కువసేపు చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు వీలు ఉంటుంది. అంతేకాకుండా భూమిపై చాలా దేశాల వారికి ఈ చంద్ర గ్రహాణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది.
బ్లడ్ మూన్ ఎంతసేపు ఉంటుంది?
బ్లడ్ మూన్‌గా పిలుస్తున్న ఈ చంద్ర గ్రహణం 5 నుండి 6 గంటల పాటు కొనసాగనుంది. కానీ అందులో చంద్రుడు ఎర్రగా కనిపించేది మాత్రం 65 నిమిషాలే. ఈ చంద్ర గ్రహణంలో ఎక్కువగా హైలైట్ అవుతున్న విషయం కూడా అదే.
బ్లడ్ మూన్‌ను నేరుగా చూడొచ్చా?
చంద్ర గ్రహణాన్ని నేరుగా చూడొచ్చు. ఇందులో ఎలాంటి ప్రమాదం, ఇబ్బందులు లేవు. అయితే, ఒకవేళ బైనాకులర్స్, టెలిస్కోప్ వంటి సాధానల ద్వారా చూస్తే చంద్ర గ్రహణం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
ఇండియాలో ఈ బ్లడ్ మూన్ కనిపిస్తుందా?
ఆసియాలోని కొన్ని దేశాలు, ఆప్రికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల వారికి ఈ బ్లడ్ మూన్ వీక్షించే అవకాశం ఉంది.
అయితే, ఇండియాలో ఉన్న వారికి ఈ చంద్ర గ్రహణం కనిపించదు. ఈ చంద్ర గ్రహణం పగటి వేళ భూమికి మరోవైపున ఏర్పడనుండటమే అందుకు కారణం. అలాగని చంద్ర గ్రహణాన్ని చూడాలని భావించే వారు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే ఏడాది సెప్టెంబర్ 7 లేదా 8వ తేదీన మరో సంపూర్ణ చంద్ర గ్రహణం రానుంది. అది దేశం మొత్తం ఎక్కడి నుండి అయినా వీక్షించే అవకాశం ఉంటుంది అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్లడ్ మూన్ చంద్ర గ్రహణం టైమింగ్స్ ఏంటి?
ఇండియన్ స్టాండర్ట్ టైమింగ్స్ ప్రకారం ఉదయం 9:27 గంటల నుండి చంద్ర గ్రహణం మొదలవుతుంది. మధ్యాహ్నం 12:28 గంటల సమయంలో చంద్ర గ్రహణం తారా స్థాయిలో ఉంటుంది. మధ్యాహ్నం తరువాత 3:30 గంటలకు చంద్ర గ్రహణం పూర్తవుతుంది. ఈసారి చంద్ర గ్రహణానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... దేశమంతా జరుపుకునే రంగుల పండగ హోళీ కూడా అదే రోజున వస్తోంది.
Jaffar Express Train hijack: జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైజాక్ వెనుక ఏం జరిగింది ?
Flight Emergency Exit: ఆకాశంలో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిస్తే ఏమవుతుందో తెలుసా?