Priyanka Gandhi: అన్న రికార్డును బ్రేక్ చేసిన చెల్లెలు

Priyanka Gandhi beats Rahul Gandhi's record in Wayanad: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు.

Update: 2024-11-23 15:15 GMT

Priyanka Gandhi

Priyanka Gandhi beats Rahul Gandhi's record in Wayanad: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదయింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. బ్యాలెట్ ఓట్లు మొదలుకుని ఆఖరి రౌండ్ వరకు తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి విజయాన్ని నమోదు చేశారు. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో తన ప్రత్యర్థులపై 4 లక్షల 4 వేల 619 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అన్న రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేశారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, యూపీలోని రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. వయనాడ్‌ ఎన్నికల్లో సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడం వల్ల ఆ తర్వాత వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగి విజయ దుందుభి మోగించారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌కు దాదాపుగా డిపాజిట్ గల్లంతు చేశారు. సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిని ఓడించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ రికార్డునే బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ప్రియాంక గాంధీ 1972 జనవరి 12న జన్మించారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రియాంక.. 1997లో రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019 జనవరి 23న ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం అదే మొదటిసారి. తొలుత తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇంఛార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌కు పూర్తి ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఆమె విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా నిరంతరం యూపీలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ వచ్చారు.

ఇప్పుడు వయనాడ్ నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ.. తొలిసారిగా పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని మూడో వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇదివరకు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ఒకేసారి ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు చట్ట సభల్లో ఉంటారు. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ లోక్ సభ సభ్యుడు. ఇప్పుడు ప్రియాంక గెలవడం వల్ల ఆ కుటుంబం నుంచి మూడో వ్యక్తిగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.

Tags:    

Similar News