Uddhav Thackeray: 4 నెలల్లోనే ఇదెలా సాధ్యం.. ఓటమిపై థాకరే సందేహాలు

Update: 2024-11-24 09:42 GMT

Maharashtra Elections 2024 Results: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ కేవలం 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలకు, ఈ అసెంబ్లీ ఫలితాలకు పొంతనే లేదన్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే అంత తేడా ఎలా వస్తుందని థాకరే ప్రశ్నిస్తున్నారు.

కొవిడ్ మహమ్మారి సమయంలో తన సూచనలను మహారాష్ట్ర మొత్తం ఒక కుటుంబపెద్దలా భావించి విన్నది. అలాంటిది తనతో ఇలా ఎలా ప్రవర్తించగలిగారు అని తన సందేహాన్ని బయటపెట్టారు. నాలుగు నెలల కిందట లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుకోలేకపోయిన అధికార కూటమి ఇప్పుడెలా అన్ని సీట్లు సొంతం చేసుకోగలిగింది అర్థం కావడం లేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్ థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో మహా వికాస్ అఘాడి కూటమి ర్యాలీలకే భారీగా జనం తరలివచ్చారు. తాము చెప్పిన మాటలన్నీ విన్నారు. అధికార కూటమి మాటలు వినం అని చెప్పారు. మరి అధికార కూటమి మాట వినకుండానే వారికి ఓటేశారా అని ఆయన ప్రశ్నించారు.

కొన్నేళ్ళ క్రితం జేపి నడ్డా మాట్లాడుతూ దేశంలో ఒక్క పార్టీ మాత్రమే ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఫలితాల సరళి చూస్తోంటే బీజేపి దేశాన్ని వన్ పార్టీ వన్ నేషన్ దిశగా తీసుకెళ్తుందేమనని అనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేశారు. ఏదేమైనా జనం ఆశను కోల్పోవద్దని సూచించారు.

ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపై ఉద్ధవ్ థాకరే స్పందించారు. బీజేపి విజయం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారు. దానిని జనం అంగీకరిస్తే తనకేం సమస్య లేదని థాకరే వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News