Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్
Gujarat Election 2022: 93 స్థానాలకు పోలింగ్, బరిలో 833 మంది అభ్యర్థులు
Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. చివరి దశ పోలింగ్‌లో ఉత్తర, మధ్య గుజరాత్ లోని 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. చివరి విడతలో 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 2.51 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఇక బీజేపీ, ఆప్ మొత్తం 93 స్థానాల్లో, కాంగ్రెస్ 90 చోట్ల, దాని మిత్రపక్షం NCP మూడు స్థానాల్లో పోటీ పడుతున్నాయి. 255 మంది స్వతంత్రులూ బరిలో ఉన్నారు.
చివరి దశలో 2.54 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 26వేల 409 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 36వేల EVMలను వినియోగిస్తోంది. చవిరిదైన రెండో దశలో కీలకమైన అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర, బనస్కాంత, పంచమహల్, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అహ్మదాబాద్‌లో ఓటు వేస్తారు. నిన్న గాంధీనగర్ వెళ్లిన ఆయన తల్లి హీరాబెన్‌తో రెండు గంటలు గడిపి.. ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇక చివరి దశలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ సీఎం అభ్యర్థి, రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నుంచి బరిలో ఉన్నారు. అలాగే.. బీజేపీ నేత హార్దిక్ పటేల్ విరామ్‌గాం నుంచి, బీజేపీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్ గాంధీనగర్ సౌత్ రీజియన్ నుంచి పోటీ చేస్తున్నారు.
దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ బనస్కాంత జిల్లాలోని వడ్గామ్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సుఖ్‌రామ్ రథ్వా ..ఛోటా ఉదయపూర్ జిల్లాలోని జెట్‌పూర్ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వడోదర జిల్లాలోని వాఘోడియా నియోజక వర్గం నుంచి బీజేపీ రెబల్ మధు శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దేవ్‌గఢ్‌బారియా నుంచి భారత్ వఖాలా, దేవదర్ నియోజక వర్గం నుంచి భీమా చౌదరి, గాంధీనగర్ సౌత్ నియోజకవర్గం నుంచి డోలత్ పటేల్, విరామ్‌గామ్ నియోజకవర్గం నుంచి కున్వర్జీ ఠాకోర్, ఘట్లోడియా నియోజకవర్గం నుంచి విజయ్ పటేల్‌లు రెండో దశలో పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో గుజరాత్‌లో మొత్తం 63.14 శాతం పోలింగ్ నమోదైంది. కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 63.31 శాతం ఓటింగ్ నమోదైంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.