China Rocket: హిందూ మహాసముద్రంలో కూలిన చైనీస్ రాకెట్ శకలం
China Rocket: హమ్మయ్యా ఎట్టకేలకు రాకెట్ శకలాలు హిందూ సముద్రంలో పడిపోయాయి.
China Rocket: హమ్మయ్యా ఎట్టకేలకు చైనా రాకెట్ 'లాంగ్ మార్చ్-5 బీ' శకలాలు హిందూ సముద్రంలో పడిపోయాయి. భూవాతావరణంలో ప్రవేశించి ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేసిన రాకెట్ శకలం ఎవరి నెత్తిన పడుతుందా అని ప్రజలకు టెన్షన్ తెప్పించిన చైనా రాకెట్... మొత్తానికి మాల్దీవుల్లో కూలినట్లు తెలిసింది. దీనికి సంబంధించి చైనా అధికారిక మీడియా పీపుల్స్ డైలీ ఓ ప్రకటన ట్వీట్ ద్వారా తెలిపింది. "చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5B శకలాలు... భూమి వాతావరణంలోకి వచ్చాయి. అవి తూర్పు రేఖాంశానికి (longitude) 72.47 డిగ్రీలు, ఉత్తర అక్షాంశానికి (latitude) 2.65 డిగ్రీల దగ్గర కూలాయి.
చైనా... రాజధాని బీజింగ్ టైమ్ ప్రకారం ఉదయం 10.24కు కూలాయి. కూలిన శకలాలలో చాలా వరకూ కాలిపోయాయి" అని చైనా మానవ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ తెలిపినట్లు ట్వీట్ చేసింది. ఇదే నిజమైతే...ఆ శకలాలు మాల్దీవుల దగ్గర హిందూ మహా సముద్రంలో కూలినట్లు భావిస్తున్నారు. భూవాతావరణంలో ఘర్షణ కారణంగా శకలం చాలాభాగం కాలిపోయిందన్న చైనా కాలిపోగా మిగిలిన శకలాలు మాత్రమే సముద్రంలో పడ్డాయని స్పష్టం చేసింది
అమెరికన్, యూరోపియన్ అంతరిక్ష పరిశోధకులు ఇది ఎక్కడ పడుతుందోనని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వచ్చారు. దీన్ని పేల్చివేసి కిందకు కూల్చాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ ఇది కక్ష్య నుంచి కింద పడకుండా చూడడంలో చైనా నిర్లక్ష్యం వహించిందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. మొత్తానికి చైనా చెప్పినట్లు 'లాంగ్ మార్చ్-5 బీ' కధ ముగిసింది.