Covid Vaccine Price: కోవిడ్ వ్యాక్సిన్ల ధరలను తగ్గించిన కేంద్రం

Covid Vaccine Price: కేంద్ర ప్రభుత్వం సేకరించే కరోనా వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని కేంద్రం ప్రకటించింది.

Update: 2021-04-24 07:19 GMT

Covid-19 vaccines:(File Image)

Covid-19 vaccines: ఎట్టకేలకు కేంద్రం కరోనా వ్యాక్సిన్ల విషయంలో దిగి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సేకరించే కరోనా వ్యాక్సిన్లను అన్ని రష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని కేంద్రం నేడు ప్రకటించింది. అంతే కాకుండా ''భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాలను రూ.150 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. అలా సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నాం. ఇకపై కూడా అది కొనసాగుతుంది'' అని కేంద్ర ఆరోగ్యశాఖ నేడు ట్వీట్‌ చేసింది.

మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేగాన, వ్యాక్సిన్ల కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించింది. రాష్ట్రాలు, ప్రయివేటు కేంద్రాలు అదనపు డోసుల కోసం నేరుగా ఉత్పత్తిదారులను సంప్రదించొచ్చని తెలిపింది. టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించొచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల కొవిషీల్డ్‌ కొత్త ధరలకు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ. 400, ప్రయివేటు ఆసుపత్రులకు డోసుకు రూ. 600 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకే దేశం ఒకే పన్ను అని చెబుతూ ఒకే దేశం రెండు వ్యాక్సిన్ల ధరలా అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

కరోనా టీకా ధరలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. తాజా కొనుగోలు ఒప్పందం ప్రకారం.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకా ఒక్కో డోసును కేంద్రం రూ.400 కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్న ఓ పత్రిక కథనాన్ని జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా చెల్లిస్తున్న ధర కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. భారత్‌లో తయారైన టీకాకు భారత్‌లోనే అత్యధిక ధర చెల్లించడం ఏంటని ప్రశ్నించారు. టీకా ఒక్కో డోసును రూ.150 చొప్పున విక్రయించినా తమకు లాభమే అని గతంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే ధరల్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ ట్వీట్‌కు కేంద్రం తాజాగా బదులిచ్చింది. తాము సేకరించే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగానే ఇస్తామని తెలిపింది.

Tags:    

Similar News