Nani: అసలా సినిమాను థియేటర్లలో ఎవరు చూస్తారన్నారు? నాని ఆసక్తికర వ్యాఖ్యలు
Nani: ఒక వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు హీరో నాని.
Nani: ఒక వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు హీరో నాని. ప్రస్తుతం ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన, ఇటీవల ‘కోర్ట్’ (Court) సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు, తన ఎంపికల గురించి ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నా నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రం ‘కోర్ట్’ ఓటీటీ మూవీగా అనుకున్నప్పటికీ, అది థియేటర్లలో చూసే సినిమా అని నమ్మకం ఉంది. ‘ఇలాంటి చిన్న సినిమాలు థియేటర్లలో ఎవరు చూస్తారు?’ అనే సందేహాలు నా టీమ్‌లో కూడా ఉన్నాయ్. కానీ, ఎడిట్ రూమ్‌లో చూసిన వెంటనే ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పా,’’ అని నాని వెల్లడించారు.
ఇక వరుస విజయాలు అందుకున్న తరువాత విజయవంతమైన దర్శకులతో పని చేయొచ్చు. కానీ, పరాజయాన్ని ఎదుర్కొన్న డైరెక్టర్ల కథలు నచ్చితే కూడా నటించానని, ఎందుకంటే తనకు కథ ముఖ్యమని నాని చెప్పుకొచ్చాడు. స్టోరీ సెలక్షన్‌కి ప్రత్యేకమైన ఫార్మూలా ఏదీ లేదని, ప్రేక్షకుడి కోణంలో కథనాన్ని చూస్తానని నాని చెప్పుకొచ్చాడు.
ఇక మొదట ‘హిట్’ ఒకే ఒక్క సినిమాగా తీశారని, ఫ్రాంచైజీగా తీసుకురావాలని తొలుత అనుకోలేదని తెలిపారు. అయితే దర్శకుడు శైలేష్ కథ చెప్పిన తర్వాత, అదే యూనివర్స్‌లో మరిన్ని కథలు చెప్పొచ్చనే ఆలోచన వచ్చిందన్నారు. ఇక ‘హిట్ 3’లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందన్న నాని, హిట్ ఫ్రాంచైజీలోనే ఇది మాస్ సినిమాగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.