RGV: మరో ప్రభాస్‌ సినిమాలో రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈ వార్తల్లో నిజమెంత.?

RGV: సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ.

Update: 2025-04-05 07:06 GMT

RGV: సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. తన మాటలతో సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ తాజాగా శారీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న సనిమాల్లో స్పిరిట్‌ ఒకటి. 'అర్జున్ రెడ్డి', యానిమల్‌ వంటి బ్లాక్‌బస్టర్‌లతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ పవర్‌ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 'స్పిరిట్' సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నట్లు తెలిసింది.

అయితే తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారన్న వార్తలు సోషల మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన తాజా చిత్రం 'శారీ' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన, స్పిరిట్ సినిమాలో తాను నటిస్తున్నానన్న వార్తలపై స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. 'ఈ వార్తలో నిజం లేదు. స్పిరిట్ సినిమా గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నన్ను అసలు సంప్రదించలేదు. ఆ ప్రాజెక్ట్ గురించి నాకు స్పష్టత కూడా లేదు” అని చెప్పారు.

ఇదిలా ఉంటే ఇటీవల ప్రభాస్‌ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో ఆర్జీవీ నటించిన విషయం తెలిసిందే. దీని గురించి ప్రస్తావిస్తూ.. 'కల్కి సినిమా టీమ్‌లో చాలామంది నాకు సన్నిహితులు. వాళ్ల కోరిక మేరకే నేను ఓ కేమియో చేశాను. ప్రేక్షకులు నా పాత్రను ఆశించలేదు కాబట్టి వాళ్లకు సర్‌ప్రైజ్‌గా అనిపించింది. నా పాత్రకు మంచి స్పందన వచ్చింది' అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News