N Convention Centre Demolition: N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. అసలేం జరిగింది ? ఎవరేమన్నారు ?

ఏం జరిగింది ? ఎలా మొదలైంది ? ఊరుకోను... లీగల్ ఫైట్ చేస్తా అంటున్న నాగ్.. స్పందించిన హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్..

Update: 2024-08-24 18:00 GMT

ఏం జరిగింది ? ఎలా మొదలైంది ?

ఆగస్టు 24, 2024 శనివారం ఉదయం.. నిత్యం మామూలుగానే రద్దీతో ఉండే మాదాపూర్‌లోని ఖానామెట్‌ని ఆనుకుని ఉన్న తుమ్మిడికుంట ప్రాంతం. అక్కడే హీరో నాగార్జున యజమానిగా ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది.

హైడ్రా అధికారులు భారీ సంఖ్యలో పోలీసు బలగాలతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్దకి చేరుకున్నారు. వారితో పాటే నీటి పారుదల శాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూడా ఉన్నారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని ఆ వెనుకే ఉన్న తుమ్మిడికుంట చెరువులో కొంత భాగాన్ని కబ్జా చేసి నిర్మించారని అక్కడే ఉన్న సిబ్బందికి ఆధారాలు చూపిస్తూ అధికారులు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. వారి వెనుకాలే హైడ్రా బుల్డోజర్స్, క్రేన్స్ లోపలికి ఎంట్రీ ఇచ్చాయి. అక్కడే నిర్మితమై ఉన్న రెండు పెద్ద హాల్స్‌ని, ఇతర నిర్మాణాలను చూస్తుండగానే నేలమట్టం చేశారు.

హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిన నాటి నుండి బుల్డోజర్స్ ఎంట్రీ ఇచ్చిన హై ప్రొఫైల్ కేసు ఇదే కావడంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మీడియాలో బ్రేకింగ్ న్యూస్ పేరుతో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో హైడ్రా భయం పట్టుకున్న వాళ్లందరి నుండి సాధారణ పౌరుల వరకు అందరి చూపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపైనే పడింది. క్షణాల్లోనే ఇదొక హాట్ టాపిక్ అయింది. నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు కావడంతో నేషనల్ మీడియా సైతం ఈ వార్తను అత్యంత పాపులర్ న్యూస్‌గా చూపెట్టింది.


ఊరుకోను అంటున్న నాగార్జున 

హైడ్రా చేపట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై నాగ్ ఎక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే భవనాలు కూల్చేశారని.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు. కోర్టు స్టే ఆర్డర్స్‌కు విరుద్ధంగా హైడ్రా వ్యవహరించిందని అసహనం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంపై తాను న్యాయ పోరాటం చేస్తానని, కోర్టులపై తనకు నమ్మకం ఉందని అన్నారు. తనపై జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లుగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అన్నట్లుగానే హై కోర్టుకు వెళ్లి మధ్యాహ్నం సమయానికల్లా కూల్చివేతలపై మధ్యంతర స్టే తీసుకున్నారు. కానీ అప్పటికే ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టమైంది. 

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ కౌంటర్..

నాగార్జున ప్రకటన విడుదలయిన ఒకట్రెండు గంటల వ్యవధిలోనే హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. 

తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించిన ఎన్నో అక్రమ కట్టడాలు కూల్చేయడం జరిగిందని.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత కూడా అందులో ఒకటని స్పష్టంచేశారు. ఎఫ్‌టీఎల్ లెవెల్లో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లెవెల్లో 2 ఎకరాల 18 గుంటల స్థలంలో అక్రమ నిర్మాణాలు జరిగాయి అని తన ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ నిర్మించిన భవనాలకు GHMC అనుమతి కూడా లేదన్నారు. 

సౌత్ టూ నార్త్... టాప్ హెడ్‌లైన్స్‌లో నాగ్..

ఇవాళ సౌత్ టూ నార్త్... టాప్ హెడ్ లైన్స్ నాగార్జున పేరు పతాక శీర్షికలకెక్కింది. టాలీవుడ్ స్టార్ హీరో అవ్వడం, ఇటీవలే కొడుకు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగి వార్తల్లో నిలవడం, అంతకంటే ముందే నాగ్ ఫ్యామిలీకి డైవర్స్ రూపంలో సమంత దూరం అవ్వడం, రీసెంట్‌గా రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన బాలీవుడ్ మూవీ 'బ్రహ్మస్త్ర'లో ( చాలా గ్యాప్ తరువాత నాగ్ నటించిన హిందీ మూవీ) నాగ్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషించడం వంటి ఎన్నో అంశాలు నాగార్జునను ఎప్పుడూ అందరి నోట్లో నానేలా చేస్తున్నాయి. దానికితోడు ఇప్పుడు ఇలా జరగడంతో నాగ్ మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. 

Tags:    

Similar News