'మహర్షి' మూవీ రివ్యూ

Update: 2019-05-09 05:50 GMT

నటీనటులు: మహేష్ బాబు, పూజ హెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, మీనాక్షి దీక్షిత్, వెన్నెల కిషోర్, అనన్య, ముకేశ్ రిషి తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం: కె. యూ. మోహనన్

ఎడిటింగ్‌: కె. ఎల్. ప్రవీణ్

నిర్మాతలు: దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీ

దర్శకత్వం: వంశీ పైడిపల్లి

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా

విడుదల తేదీ: 09/05/2019

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'మహర్షి'. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్యపాత్ర పోషించారు. మహేష్ బాబు మైలురాయి చిత్రం కాబట్టి ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య 'మహర్షి' సినిమా ఇవాళ అనగా మే 9న విడుదలైంది. మరీ ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

రిషి కుమార్ (మ‌హేష్ బాబు) ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓ గా పనిచేస్తూ ఉంటాడు. ఓటమి అంటే ఏమిటో తెలియని ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నేప‌థ్యం నుంచి వ‌చ్చినప్పటికీ, అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మనిషి. కానీ త‌న జీవితం, త‌న విజ‌యాలలో మాత్రమే కాక తన కష్టాల్లో కూడా తన వెనుక ఉంది సపోర్ట్ చేసింది ఇద్ద‌రి స్నేహితులు పూజ (పూజా హెగ్డే), రవి (అల్ల‌రి న‌రేష్‌). మ‌రి ఆ స్నేహితుల కోసం రిషి ఏం చేశాడు? అసలు రిషి ఇండియా ఎందుకు వచ్చాడు? జగపతి బాబు పాత్ర రిషి ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? రిషి 'మ‌హ‌ర్షి' గా ఎలా మారాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

మహేష్ బాబు అద్భుతమైన నటన ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మహేష్ ఈ సినిమాకి ఒక అసెట్ లాంటివాడు. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ స్టూడెంట్ గా కూడా మహేష్ బాబు చాలా చక్కగా సరిపోయాడు. అంతేకాక తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ అందరినీ ఆకట్టుకుంటాయి. పూజ హెగ్డే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. గ్లామర్తో మాత్రమే కాక నటనతో కూడా మెప్పించిన పూజ హెగ్డే మహేష్ తో మంచి కెమిస్ట్రీ మెయింటెయిన్ చేసింది. అల్లరి నరేష్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించాడు. తన పర్ఫార్మెన్స్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తాడు. జగపతిబాబు నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. చాలా కాలం తర్వాత ప్రకాష్ రాజ్, జయసుధ మహేష్ బాబు తల్లిదండ్రుల పాత్రల్లో కనిపించి మెప్పించారు. రావు రమేష్ తన పాత్రకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు కచ్చితంగా నవ్వు తెప్పిస్తుంది. అనన్య, మీనాక్షి దీక్షిత్ కూడా వారికున్న పరిధిలో బాగానే నటించారు. మిర్చి హేమంత్, ముఖేష్ రిషి, ఝాన్సీ, సమీర్ తదితరులు కూడా బాగా నటించారు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను ప్రిపేర్ చేశారు. ఒకవైపు కామెడీ, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే కాక మరొకవైపు మనసుకు హత్తుకునేలా ఎమోషన్స్ కూడా బాలన్స్ చేసి సినిమాను చాలా అందంగా తెరకెక్కించారు. వంశీ పైడిపల్లి నరేషన్ ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. ముగ్గురు నిర్మాతలు సంయుక్తంగా నిర్మించడంతో ఈ సినిమా నిర్మాణ విలువల కు ఏ మాత్రం కొదవలేదు బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీపడకుండా మంచి క్వాలిటీ ఔట్పుట్ ని ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పరవాలేదనిపించింది. ఒకటి, రెండు సాంగ్స్ మాత్రమే ప్రేక్షకులను అలరించాయి. అయినప్పటికీ దేవి శ్రీ నేపధ్య సంగీతం సినిమాకి బాగా సెట్ అయింది. కే.యూ. మోహనన్ సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనుల విందు చేస్తుంది. ఆయన కెమెరా యాంగిల్స్ కూడా బాగున్నాయి. కె.ఎల్. ప్రవీణ్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

నటీనటులు

నేపధ్య సంగీతం

ప్రెస్ సీన్

క్లైమాక్స్

బలహీనతలు:

ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ అవ్వడం

పాటలు

చివరి మాట:

'మహర్షి' సినిమా అంచనాలను దాటే విధంగా ఉంటుంది. చాలా ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి భాగం మొత్తం కామెడీ, రొమాన్స్ తో నిండి ఉంటుంది. ముఖ్యంగా కాలేజ్ సన్నివేశాల్లో కామెడీ ఈ సినిమాకి ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు. రెండవ భాగానికి వచ్చేసరికి సినిమా కొంచెం సీరియస్ గా మారుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రెస్ మీట్ సీన్లు రైతులతో మహేష్ బాబు సీన్లు సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమా అంతా చక్కగా సాగిపోతూ ఉంటుంది. అక్కర్లేని సన్నివేశాలను ఎక్కువ చూపించకుండా కేవలం కథకి ఏమి కావాలో అవి మాత్రమే చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు అని చెప్పుకోవచ్చు. మొదటి భాగంలో విద్యా వ్యవస్థ ను ప్రశ్నించిన రిషి పాత్ర రెండవ భాగంలో రైతుల కష్టాలకు చేయూత నివ్వడం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. చివరిగా 'మహర్షి' కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాక అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమా.

బాటమ్ లైన్:

'మహర్షి' అందరికి నచ్చే 'రిషి' జర్నీ.

Similar News