Devara Review: ఏం సినిమారా అయ్యా ఇది? hmtv హానెస్ట్ రివ్యూ

Devara Movie Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం దేవర.

Update: 2024-09-27 03:55 GMT

Devara Review

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం దేవర. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో అసలు సినిమా ఎలా ఉండబోతుందా అని నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ప్రత్యేకంగా షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? లాంటి వివరాలు ఇప్పుడు రివ్యూలో చూద్దాం

దేవర కథ:

నాలుగు ఊళ్ళు కలిసి ఉండే రత్నగిరి దగ్గరలోని ఎర్రసముద్రంలో దేవర (జూనియర్ ఎన్టీఆర్) మాట శాసనం. తమ పూర్వీకుల వృత్తినే నమ్ముకున్న ఆ జనానికి సముద్రమే అన్నీ. నాలుగు ఊళ్ళలో ఒక్కొక్క ఊరి వారికి ఒక్కొక్క స్పెషాలిటీ.. ఒక ఊరి వారు పడవలు నడపడంలో ఆరితేరిన వారైతే మరొకరు ఎక్కువసేపు నీటి లోపల ఉండడంలో ఆరితేరిన వారు. వీరందరూ ఒక జట్టుగా ఏర్పడి సముద్రం మీద షిప్స్ వెళుతూ వుండగానే దొంగతనంగా దించుతుంటారు. ఇక దేవర పక్క ఊరికి చెందిన భైర (సైఫ్ అలీ ఖాన్) ఉంటారు. దేవర అస్సలు నచ్చడు. తాను కూడా ఒక ఊరికి పెద్ద అయినా అందరూ దేవర మాట వింటారు అని భావిస్తూ ఉంటాడు.

అయితే దేవర సాయం లేకుండా ఏం చేయలేం అని తెలిసి సరైన అదును కోసం చూస్తుంటాడు. ఒకసారి దొంగతనానికి వెళ్లి కోస్ట్ గార్డులకు పట్టుబడిన నేపథ్యంలో తాము చేసేది తప్పు అని తెలుసుకున్న దేవర ఇక ఎప్పుడూ తన వాళ్లను సముద్రం పైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్లు భైరాకు తోడుగా వెళ్దామని చూస్తే అలా వెళ్లిన వాళ్లకు దేవర తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలా సముద్రం మీదకు వెళ్లే వాళ్లందరికీ భయం కల్పించేందుకు ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవర.

నాలుగు ఊళ్లకు ధైర్యంగా నిలబడిన దేవరకు వర (ఎన్టీఆర్) అనే ఒక పిరికివాడు కొడుకవుతాడు. అయితే నాలుగు ఊళ్ళలో ఒక ఊరి పెద్ద అయిన రాయప్ప (శ్రీకాంత్) కూతురు తంగం (జాన్వీ కపూర్) వరను ఇష్టపడుతుంటుంది. కానీ పిరికివాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే మీమాంసలో ఉంటుంది. అసలు దేవర కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత పిరికివాడయ్యాడు..? ఈ మొత్తం వ్యవహారంలో సంగప్ప (ప్రకాష్ రాజ్), డీఎస్పీ తులసి (అభిమన్యు సింగ్), మురుగ ( మురళి శర్మ)పాత్ర ఏమిటి? ఊరికి దూరంగా ఉండే దేవర భయాన్ని కంటిన్యూ చేశాడా..? భైర తన ప్రైవేటు సైన్యంతో ఏం చేశాడు? అనేది కథ..

Also Read: Jr NTR: నట దేవరకు ఈ ఐడెంటిటీ మామూలుగా రాలేదు...

విశ్లేషణ: పైన కథ చదువుతున్నప్పుడే ఇదేంట్రా ఇంత ఉంది అని మీకు అనిపించొచ్చు. కొరటాల శివ ట్రైలర్ లో చెప్పినట్టుగానే ఇది చిన్న కథ కాదు స్వామి, చానా పెద్ద కథ.. అయితే కథ మెయిన్ ధీం మొత్తం భయం, ధైర్యం అనే రెండు పదాల చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా కొరటాల శివ సినిమా అంటేనే ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే ప్రతి మనిషికి భయం కావాలి దాంతోపాటు ధైర్యం కావాలి అని చెబుతూ సాగుతుంది.

ఒక మనిషికి బతికేంత ధైర్యం కావాలి. కానీ, మరో మనిషిని చంపేంత ధైర్యం అక్కర్లేదు అని తెలుసుకున్న హీరో మృగాల్లా మారిపోయిన తన వారిని భయపెట్టి ఎందుకు ఏం చేశాడు? ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడు? లాంటి విషయాలను ఆసక్తికరంగా తెరమీదకు తీసుకురావడంలో కొరటాల శివ సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్ మొదలైనప్పటి నుంచి సినిమా ఒక సీరియస్ మోడ్ లో  సాగుతూ ఉంటుంది. దేవర నేపథ్యం, దేవర పూర్వీకుల నేపథ్యం, ఎర్ర సముద్రం నేపథ్యం లాంటి విషయాలను ఆసక్తికరంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు కొరటాల శివ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఫ్రీ ఇంటర్వెల్ బ్లాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎందుకో బాగా సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన రెండవ ఎన్టీఆర్ జాన్వి కపూర్ ఎపిసోడ్ లో కాస్త నిరాశ తెప్పించాయి. శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందంటే అదిరిపోయే బ్లాక్స్ రాసుకున్నారు ఏమో అనుకుంటే రొటీన్ సీనులతో ఇదేంట్రా అనిపించారు. అయితే దర్శకుడిగా కంటే రచయిత గానే కొరటాల శివ ఎక్కువ మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. రైటింగ్ లో తన డెప్త్ చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది.

అయితే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్న కొరటాల శివ ఆ ప్రపంచంలో పేర్లను కూడా అంతే కొత్తగా పెట్టాడు.. దేవర ,భైర, మురుగ, కుంజప్ప, కోరా అంటూ గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉండే పేర్లను పెట్టాడు అలా కాకుండా కాస్త సాధారణమైన పేర్లను పెట్టి ఉంటే సినిమాలో సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమై ఉండేది. ఫస్టాఫ్ వరకు అటు రచయితగా ఇటు దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న కొరటాల శివ సెకండ్ హాఫ్ విషయంలో తేలిపోయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ చివరిలో సినిమా రెండో భాగానికి ఇచ్చిన క్లిఫ్ హాంగర్ కూడా బాహుబలి సినిమాను పోలినట్టు ఉండటం కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: ‘దేవర’కు జోడిగా నటించిన శృతి మరాఠి ఎవరో తెలుసా.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

ఇక నటీనటుల విషయానికి వస్తే దేవర, వర అనే రెండు పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. రెండు పాత్రలకు భిన్నమైన నటన చూపిస్తూ రెచ్చిపోయారు. అయితే దేవరపాత్ర పేలినంతగా వర పాత్ర పేల లేదు. కానీ సెకండ్ పార్ట్ కి అదే మెయిన్ లీడ్ అవ్వడంతో ప్రేక్షకులందరి ఫోకస్ ఆపాత్ర మీదే పడింది. జాన్వి కపూర్ కి హీరోయిన్ గా ఇది సాలిడ్ ఎంట్రీ అనుకుంటే అది పొరపాటే. బహుశా సెకండ్ పార్ట్ లో ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందేమో చూడాలి. ఉన్నంతలో అందాలు ఆరబోస్తూనే నటించే ప్రయత్నం చేసింది. ఇక శ్రీకాంత్, ప్రకాష్ రాజు సహా నటించిన తమిళ,మలయాళ నటులు తమదైన శైలిలో నటించారు. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా ఎన్టీఆర్ ను ఢీకొట్టే పాత్రలో ఒక రేంజ్ లో రెచ్చిపోయి నటించారు. ఆయనకు మంచి పాత్ర పడింది.

టెక్నికల్ టీం విషయానికి వచ్చేసరికి ఈ సినిమాకి అదే పెద్ద కొండంత బలంలా అనిపించింది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రత్నవేలు అండర్ వాటర్ సీన్స్ తో పాటు కొన్ని ఫైట్ సీన్స్ షూట్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే సినిమా మొత్తాన్ని కలర్ ఫుల్ గా చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక యాక్షన్, కొరియోగ్రాఫర్లు తమదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫైట్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. అదే సమయంలో అప్పటి పీరియడ్ని బట్టి కత్తులతోనే సమరం డిజైన్ చేసిన తీరు బావుంది. ఇక సినిమా టెక్నికల్ టీం మొత్తంలో హీరో ఎవరంటే అనిరుద్. ఆయన అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్స్కోర్ ఎలా కొడతాడా? అని ఎదురుచూస్తూ థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టారు. ఒక్కొక్క సీన్ ని ఎలివేట్ చేస్తూ కొట్టిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది.

ప్లస్ పాయింట్లు:

ఎన్టీఆర్ నటన,

బ్యాక్ గ్రౌండ్ స్కోర్,

దేవర వరల్డ్,

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

ఆసక్తి రేపని క్లిఫ్ హ్యంగర్,

సెకండ్ హాఫ్

హెచ్ఎం టీవీ వర్డిక్ట్: దేవర.. అభిమానులకు విందు.. కామన్ ఆడియన్స్ కు షరతులు వర్తిస్తాయి.

రేటింగ్: 2.5/5

Also Read: Devara Public Talk: దేవర ఎలా ఉంది.? అసలు పబ్లిక్‌ ఏమంటున్నారంటే..?

Tags:    

Similar News