Veekshanam Review: 'చనిపోయిన అమ్మాయి హత్యాలెలా చేస్తోంది'.. ఆద్యంతం ఆసక్తికరంగా వీక్షణం మూవీ..

Veekshanam Movie Review: రామ్ కార్తీక్, క‌శ్వి జంటగా నటించిన సినిమా "వీక్షణం".

Update: 2024-10-18 06:40 GMT

Veekshanam Movie Review

Veekshanam Movie Review: రామ్ కార్తీక్, క‌శ్వి జంటగా నటించిన సినిమా "వీక్షణం". టీజర్‌, ట్రైలర్‌తోనే మంచి బజ్‌ను సొంతం చేసుకుందీ మూవీ. మనోజ్‌ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్‌ మూవీ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చిత్ర యూనిట్ 17వ తేదీన వీక్షణం స్పెషల్‌ ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు. ఇంతకీ వీక్షణం మూవీ ఎలా ఉంది.? ప్రేక్షకులను ఏమేర మెప్పించింది.? రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే..

అర్విన్‌ (రామ్‌ కార్తిక్‌) హైదరాబాద్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటాడు. టైం పాస్‌ కోసం తన ఇంటిలో నుంచి బైనాకులర్‌ సహాయంతో చుట్టు పక్కల వాళ్లు ఏం చేస్తుంటారో నిత్యం గమనిస్తుంటాడు. ఈ సమయంలో అర్విన్‌కు.. నేహ (కశ్వి) అనే అమ్మాయి కనిపిస్తుంది. తొలి చూపులోనే ప్రేమలో పడ్డ హీరో.. ఎలాగైనా నేహను ప్రేమలో పడేయాలని ఫిక్స్‌ అవుతాడు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేసి చివరికి అనుకున్నది సాధిస్తాడు. అయితే ఇదే సమయంలో ఒక రోజు నేహతో గొడవ జరుగుతుంది. దీంతో ఎప్పటిలాగే బైనాకులర్‌తో మరో ఇంటిని చూస్తుంటాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది.

ఒక అమ్మాయి రోజుకో వ్యక్తిని తన ఇంటికి తీసుకురావడం గమనిస్తాడు. దీంతో ఆ అమ్మాయి అసలు ఏం చేస్తుందన్న ఆసక్తితో గమనించడం మొదలుపెడుతాయి. అయితే ఆ అమ్మాయి ఇంటికి తీసుకొచ్చిన వాళ్లందరినీ హత్య చేస్తున్నట్లు తెలుసుకుంటాడు. ఇంతకీ ఎందుకలా చేస్తుందన్న విషయాన్ని తెలుసుకునే క్రమంలో ఆ అమ్మాయి అప్పటికే మరణించి ఎనిమిది నెలలు అయిందని తెలుస్తోంది. ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎలా హత్యలు చేస్తోంది? అసలు ఆ హత్యలు చేస్తోంది ఎవరు.? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

'మన పని మనం చూసుకోవడమే ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని'.. ఇదిగో ఈ పాయింట్‌ ఆధారంగానే దర్శకుడు మనోజ్‌ సినిమా కథను రాసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగానే ప్రతీ సన్నివేశాన్ని రాసుకున్నాడు. పక్కవాడి జీవితంలో ఏం జరుగుతోందని తెలుసుకోవాలనునుకునే హీరో ఆతృత ఎలాంటి సమస్యలకు దారి తీసిందన్న అంశాలకు కామెడీ, థ్రిల్లర్‌ను జోడించి దర్శకుడు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీని సినిమా చివరి వరకు కొనసాగించడంలో సక్సెస్‌ అయ్యాడని చెప్పాలి. ఆసక్తికరమైన ఇంటర్వెల్‌తో సినిమాపై మరింత ఇంట్రెస్టింగ్ పెంచిన దర్శకుడు సెకండాఫ్‌ను మరింత ఆకట్టుకునేలో తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా తన దర్శకత్వంలో ఫిదా చేశాడనే చెప్పాలి.

ఎవరెలా చేశారంటే..

ఇక నటీనటుల విషయానికొస్తే.. హీరో రామ్‌ కార్తీక్‌ సినిమాకు కీలకమని చెప్పాలి. పక్క వాళ్ల ఇంట్లో ఏం జరుగుందో తెలుసుకోవాలనే ఆలోచన ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అలాంటి నేచురల్ పాత్రలో కార్తీక్‌ ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్‌ కశ్వి.. తనదైన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన బిందు నూతక్కి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చనిపోయిన అమ్మాయి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంది.

ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ సమర్ధ్‌ది కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా థ్రిల్లర్‌ మూవీస్‌కు ఎంతో ముఖ్యమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు. సమర్ధ్‌ తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాడని చెప్పాలి. థ్రిల్లర్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేయడంలో, ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా సమర్ధ్‌ గొల్లపూడి మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేసింది. పాటలు కూడా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ఎన్నెన్నెన్నో సాంగ్ తో పాటు వీక్షణ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రెండవ సినిమానే అయినా సమర్థ్‌ మ్యూజిక్‌ చాలా మెచ్యూరిటీగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకు హీరో రామ్‌ కార్తిక్‌ అయితే.. టెక్నికల్‌ పరంగా సమర్థ్‌ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

చివరిగా..

మొత్తం మీద థ్రిల్లింగ్‌ మూవీస్‌ను ఇష్టపడే వారికి వీక్షణం ఫుల్‌ మీల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

రేటింగ్‌: 2.75/5

Full View


Tags:    

Similar News