Laggam Movie Review: పెళ్లి కాని వారికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా..
Laggam Movie Review: రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లగ్గం.
Laggam Movie Review: రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లగ్గం. సాయి రోనాక్, ప్రగ్యా నగర హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని మీ శ్రేయోభిలాషి, బేవర్స్ సినిమాలో ఫేమ్ డైరెక్టర్ రమేష్ చెప్పాల డైరెక్ట్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడేలా చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే సదానందం(రాజేంద్ర ప్రసాద్) ఒక చిన్న పని పడి హైదరాబాద్ వస్తాడు. తన చెల్లెలి కొడుకు(సాయి రొనక్) అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి అతని ఇంటికి వెళ్లి ఒకసారి చూసి వద్దామని అనుకుంటాడు. అక్కడికి వెళ్ళాక సాఫ్ట్వేర్ లైఫ్ మొత్తాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు అల్లుడు చైతన్య. ఆ దెబ్బతో చేస్తే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని భావించి తన కుమార్తె మానస(ప్రగ్యా)ను చైతన్యకు ఇచ్చి చేయాలని చెల్లెలు సుగుణ(రోహిణి)కు ప్రపోజల్ పెడతాడు. ఆమెకు కూడా నచ్చడంతో ఈ పెళ్లి పనులు మొదలవుతాయి. అయితే చిన్నప్పటినుంచి తల్లి లేని పిల్ల అని అందరూ జాలి చూపిస్తున్నారనే భావనలో ఉంటుంది మానస. ఈ పెళ్లి కూడా అందుకే చేసుకుంటున్నారని ఆమె ఫీలింగ్.
అయితే సరిగ్గా పెళ్లిరోజు లండన్ వెళ్లాలని తన బాస్ చెప్పడంతో తనకు ఉద్యోగం కంటే తన వాళ్ళ సంతోషమే ముఖ్యమని ఉద్యోగం వదిలేసి వస్తాడు చైతన్య. అయితే ఉద్యోగం పోయిందని అయినా నీకు చెప్పకుండా పెళ్లి చేస్తున్నారని చైతన్య అంటే గిట్టని వాళ్లు సదానందానికి నూరిపోస్తారు. దీంతో పెళ్లి ఆపేందుకు ఒక స్కెచ్ వేస్తాడు సదానందం. అయితే చైతన్య కూడా సదానందం కంటే ముందే పెళ్లి ఆపేందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే అసలు చైతన్య పెళ్లి ఎందుకు ఆపాలనుకున్నాడు? ఆగిపోయిన పెళ్లి మళ్లీ జరిగిందా? మానస ముందు పెళ్లి చేసుకోవద్దు అనుకుని తర్వాత చేసుకుంటే తన బావనే చేసుకోవాలని ఎందుకు అనుకుంది? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే
విశ్లేషణ:
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తే చాలు అతను మనిషైనా కాకపోయినా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకునే తండ్రులు అందరికీ ఒక గుణపాఠంగా ఈ సినిమా డైరెక్ట్ చేశారు రమేష్ చెప్పాల. సినిమా ఓపెనింగ్ లోనే సాఫ్ట్ వేర్ లైఫ్ ఎంత కలర్ ఫుల్ గా ఉంటుందో చూపిస్తూ దానివల్ల యువత ఎలాంటి పెడదారులు పడుతున్నారో కూడా చూపించాడు. అయితే పెళ్లికూతుళ్ళ తండ్రులు ఎలా అయితే పాజిటివ్ వైపు మాత్రమే చూస్తారో ఈ సినిమాలో కూడా సాఫ్ట్ వేర్ అనగానే జిలుగు బెలుగుల జీవితాన్ని ఎక్కువగా ఫోకస్ చేశారు. తర్వాత పెళ్లి కుదరడం, పెళ్లి పనులు మొదలవడం లాంటి విషయాలు సాదాసీదా గానే సాగిపోతాయి.
కానీ పెళ్లి పనులు మొదలైన తర్వాత తెలంగాణ సంప్రదాయంలో ఎలాంటి ఆచారాలు పాటిస్తారు. వర పూజ, పసుపు దంచడం వంటి కార్యక్రమాలను చాలా హృద్యంగా తరికెక్కించారు డైరెక్టర్. తర్వాత ఇంటర్వెల్ సమయానికి అసలు పెళ్లి జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలిగిస్తూ కట్ చేశారు. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత చైతన్య ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడు? మానస ఎందుకు మనసు మార్చుకుంది ? లాంటి విషయాలను కన్విసింగ్ గా తెరకెక్కించారు. కానీ ఎక్కడో కాస్త కనెక్టివిటీ తగ్గుతుంది. ఇక క్లైమాక్స్ లో చూపించిన అప్పగింతల సాంగ్ అయితే పెళ్లి చేసుకుని అత్తారిల్లకు వెళ్లిన ఎంతోమంది ఆడపడుచులకు కనెక్ట్ అయిపోతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోగా సాయి రోనాక్, హీరోయిన్ గా ప్రగ్యా నగారా ఇద్దరూ పోటీ పడి నటించారు. అయితే రాజేంద్ర ప్రసాద్, రోహిణి, వడ్లమాని శ్రీనివాస్ వంటి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే రఘుబాబు కృష్ణుడు ఎల్బీ శ్రీరామ్ కిరీటి వంటి వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. చాలా సన్నివేశాలను ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మరొక అదనపు ఆకర్షణ. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటింగ్ సినిమాకి కరెక్ట్ గా సెట్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
హెచ్ఎంటీవీ వర్డిక్ట్: పెళ్లి కాని వారికి బాగా కనెక్ట్ అయ్యే లగ్గం.
రేటింగ్: 3/5