Pottel Movie Review: పొట్టేల్ సినిమా రివ్యూ: రొటీన్ కమర్షియల్ డ్రామా కాదు…
Pottel Movie Review in Telugu: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా మొదలై ప్రేక్షకులందరిలో ఒక్కసారిగా అంచనాలు ఏర్పడేలా చేసిన సినిమా పొట్టేల్.
Pottel Movie Review in Telugu: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా మొదలై ప్రేక్షకులందరిలో ఒక్కసారిగా అంచనాలు ఏర్పడేలా చేసిన సినిమా పొట్టేల్. గతంలో సవారీ సినిమా డైరెక్ట్ చేసిన సాహిత్ మోత్కూరి ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేశారు. అమెరికా నుంచి ఉద్యోగం వదిలేసి వచ్చిన నిశాంక్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో యువచంద్ర, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్లుగా నటించారు. అజయ్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులందరిలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని మరింత పెంచేలా ప్రమోషన్స్ చేసింది సినిమా యూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
80 లలో పటేల్ -పట్వారి వ్యవస్థ తెలంగాణ మొత్తాన్ని శాసిస్తున్న రోజుల్లో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గుర్రం గట్టు అనే గ్రామంలో ఈ కథ జరుగుతూ ఉంటుంది. ఆ ఊరు సుభిక్షంగా ఉండాలంటే గ్రామదేవత బాలమ్మకు 12 ఏళ్లకు ఒకసారి ఉత్సవాలు జరిపి ఒక పొట్టేలును బలి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ పొట్టేలును పెంచే బాధ్యత ఆ ఊరి గొల్లల కుర్రాడైన పెద్ద గంగాధరి(యువచంద్ర) మీద పడుతుంది. అయితే తన భార్య బుజ్జమ్మ(అనన్య) కుమార్తె సరస్వతి లోకంగా బతికే గంగాధరి ఎలా అయినా కుమార్తెకు చదువు చెప్పించాలని భావిస్తాడు. అయితే ఆ ఊరు మొత్తాన్ని శాసిస్తూ తనకు అమ్మవారు పూనిందంటూ నాటకం ఆడే పటేల్ (అజయ్) కు గంగాధరి కూతురు(తనస్వి) చదువుకోవడం ఇష్టం ఉండదు.
ఈ నేపథ్యంలో గంగాధరీ మీద పగ పెంచుకొని అతని సంరక్షణలో ఉన్న పొట్టేలును మాయం చేస్తాడు. బాలమ్మ పూనిందంటూ ఊరు మొత్తం నాశనం అయిపోతుందని ఊరివారికి గంగాధరి మీద కోపం తెచ్చేలా చేస్తాడు. ఈ నేపథ్యంలో తప్పిపోయిన పొట్టేలును మళ్ళీ గంగాధరి తీసుకురాగలిగాడా? అజయ్ నిజస్వరూపం గ్రామస్తులకు తెలిసిందా? తెలిస్తే ఎవరి ద్వారా తెలిసింది? చివరికి సరస్వతి చదువుకున్నదా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పుడంటే అంతా ఆన్లైన్. చదువు కూడా స్కూలుకు వెళ్లకుండా ఆన్లైన్లో నేర్చుకునే సదుపాయం వచ్చేసింది. కానీ సరిగ్గా 40 ఏళ్ల క్రితం తెలంగాణలోని ఒక మారుమూల పల్లెలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి? చదువుకోవాలంటే ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని రాసుకున్న కథతో ఒకపక్క చదువు గొప్పతనాన్ని చెబుతూనే మరొకపక్క ప్రజల్లో అప్పట్లో వేళ్ళునుకుపోయిన మూఢనమ్మకాలను ఎత్తిచూపుతూ గుండెల మీద బలంగా తన్నేలా ప్రేక్షకులకు చెప్పిన సినిమా ఇది. రచయితగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని అద్భుతంగా రాసుకున్న సాహిత్ ఎందుకో దర్శకుడిగా దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇలాంటి సినిమాకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అక్కర్లేదు కానీ సాహిత్ ఎందుకో మరి ఏం చెప్పాలనుకున్నాడో తెలియదు కానీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎంచుకొని ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.
అయితే చెప్పాలనుకున్న పాయింట్ని నిజాయితీగా చెప్పిన సాహిత్ ను ఆ విషయంలో అభినందించాల్సిందే. నిజానికి ఇలాంటి ఒక కథ తమిళంలో నా మలయాళంలోనో వస్తే మన ప్రేక్షకులు సినిమా చేశారే అని అభినందిస్తారు కానీ మన దగ్గర చేసినప్పుడు మాత్రం పెదవి విరుపులు సహజమే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మొత్తం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే లాగానే నడిపించాడు డైరెక్టర్. కానీ కాస్త ఎమోషనల్ కనెక్ట్ విషయంలో మాత్రం ఎందుకో తడబడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే చదువు చాలా సులభంగా దొరికేస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం అంత కష్టపడే సన్నివేశాలు ఎందుకో అంత కనెక్ట్ అయ్యేలా అనిపించలేదు. దానికి తోడు తెలంగాణ నేపథ్యం ఉన్న కథ కావడం పటేల్- పట్వారీ వ్యవస్థ తెలంగాణకే పరిమితమై ఉండడంతో ఆంధ్రవారికి ఇది కాస్త కనెక్ట్ కాక పోవచ్చు. కానీ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు ముందు వరకు తెలంగాణ ఎన్ని బాధలు పడిందో చూస్తే మాత్రం ఆ రోజుల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పుట్టి ఉంటే ఇంత భయంకరంగా ఉంటుందా? అనిపించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయి.
అలాగే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఆసక్తికరంగా రాసుకున్నాడు డైరెక్టర్. ఇక అజయ్ క్యారెక్టర్ ను చాలా బలంగా రాసుకున్న ఆయన యువచంద్ర క్యారెక్టర్ ను చాలా బలహీనంగా రాసుకున్నాడు. బహుశా కథకు అదే ప్లస్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ సగటు తెలుగు ప్రేక్షకుడు హీరో ఏంటి ఇంకా తిరగబడడు? హీరో విలన్ ని ఎందుకు కొట్టడు? లాంటి రొటీన్ ఆలోచనల్లో పడిపోతారు. కానీ హీరో విలన్ ని కొట్టడం కాదు విలన్ ఆలోచనను పడగొట్టడం అనే సరికొత్త పాయింట్ని దర్శకుడు సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అలాగే సినిమాలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. చాలా డీటైలింగ్ ఉంది వాటిని పరిశీలనగా చూసినప్పుడే దర్శకుడు ప్రతి చాలా ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది. అయితే టెక్నికల్ విషయాల గురించి ఎన్ని చెప్పుకున్నా దర్శకుడు ప్రతిభ గురించి ఎంత మాట్లాడుకున్నా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయినప్పుడే అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఈ విషయం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయంలో కాస్త వెనకబడింది అని చెప్పొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో యువచంద్ర ఒక సర్ప్రైజ్. అనన్య నాగళ్ళ అజయ్ నటన కోసం థియేటర్లకు వచ్చిన వాళ్ళకి యువచంద్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. అజయ్ కి చాలాకాలం తర్వాత ఒక బలమైన పాత్ర పడింది. ఆ పాత్రలో అజయ్ ను తప్ప మరెవరిని ఊహించుకోలేము అన్నంతగా అజయ్ ఆ పాత్రలో జీవించాడు. అనన్య నాగళ్ళ ఒక బలమైన మహిళ పాత్రలో కనిపించింది. అనన్య యువచంద్ర కుమార్తె పాత్రలో నటించిన పాప చాలా బాగా నటించింది. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్ వంటి వాళ్లకు మంచి పాత్రలు పడ్డాయి. మిగతారా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వచ్చేసరికి సినిమాకి మ్యూజిక్, ముఖ్యంగా ఆర్‌ఆర్ ప్రధాన బలం. చాలా చోట్ల బీజీఎం ఆకట్టుకుంది. కొన్ని పాటలు కూడా బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ చాల బాగుంది. 80ఆ ఫీల్‌ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది.
హెచ్ఎంటీవీ వర్డిక్ట్: ఈ పొట్టేల్ రొటీన్ కమర్షియల్ డ్రామా కాదు.. ఒక పోరాట గాథ.. అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు..
రేటింగ్: 3/5