Nayanthara Documentary on Netflix: Beyond the Fairy Tale ఎలా ఉందంటే?
Nayanthara –Beyond the Fairy Tale Review: దక్షిణాది చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో నయనతార ఒకరు. ఆమె అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
Nayanthara –Beyond the Fairy Tale Review: దక్షిణాది చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో నయనతార ఒకరు. ఆమె అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రజనీకాంత్, మమ్ముట్టి లాంటి మరెన్నో దిగ్గజ నటుల సరసన చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. నయన్ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ కొనసాగిస్తున్నారు. నయనతార ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. అయితే, ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి చాలా అరుదుగా ఓపెన్ చేస్తుంది. కొత్త డాక్యుమెంటరీతో తన అభిమానులను ఆనందపరిచే బాధ్యతను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. నయనతార గురించిన మొత్తం బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంట్ ద్వారా ఆవిష్కృతం అయింది.
ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన అంశం సినీ నటుడు ధనుష్‌ను విమర్శిస్తూ కథానాయిక నయనతార రాసిన లేఖ. నయన్ జీవితాన్ని ఆధారం చేసుకొని, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. ఈ డాక్యుమెంటరీ కోసం నయన్ - విఘ్నేశ్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’ లోని సన్నివేశాలను చూపించాలనుకున్నారు. కాకపోతే చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి ఒప్పుకోకపోవడంతో నయన్ సోషల్‌మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది? ‘నానుమ్ రౌడీదాన్’ సన్నివేశాలను కూడా చూపించారా? లేదా అనేది చూద్దాం.
లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ జీవితాన్ని ఒక అందమైన కథలా చెప్పే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్ టీమ్. ఎలాంటి గందరగోళం లేకుండా నయనతార ఫ్యామిలీని, ఆమె చిన్నప్పటి ఫొటోలను చదువు ఇతర విషయాలను చెబుతూ డాక్యుమెంట్ మొదలైంది. చిన్నప్పుడు అస్సలు సినిమాలు చూసేదానిని కాదని, ఎప్పుడైనా బంధువులు వస్తే వెళ్లేదానినని ఈ సందర్భంగా నయనతార చెప్పారు. నగల దుకాణం వ్యాపార ప్రకటన చూసి, సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? మలయాళం నుంచి తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎలా ప్రవేశించింది వంటి విషయాలను కొందరు దర్శకులతో చెప్పించారు.
కెరీర్ తొలినాళ్లలో ఆమె ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను చెప్పుకొచ్చింది నయనతార. ముఖ్యంగా ‘గజినీ’ మూవీ సమయంలో ఎందుకు విమర్శలు వచ్చాయి? పత్రికలు, ఇండస్ట్రీలోని వాళ్లు తనని ఎలా బాడీ షేమింగ్ చేశారో చెబుతూ బాధపడిన సందర్భాలను వివరించేందుకు ప్రయత్నించారు. అప్పుడు ధైర్యం చేసి ‘బిల్లా’ కోసం బికినీ వేసుకుని నటించడం వంటి సాహసాలు చేసినట్లు తెలిపారు. ఇండస్ట్రీ, జనాలు చేసిన విమర్శలే తాను రాటు దేలడానికి ఎలా కారణమయ్యాయో వివరించారు. తెరపై కనిపించినట్లే తారల నిజ జీవితంలోనూ బంధాలు, భావోద్వేగాలు మారిపోతుంటాయి. కానీ, అవి వాళ్ల వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఎంతటి నిరాశ నిస్పృహలకు గురవుతారు. నటీనటుల మధ్య కొనసాగే బంధాలపై వచ్చే వార్తలు చూస్తే ఎలాంటి మనోవేదనకు గురవుతారన్న విషయాలను నయనతార వివరించిన తీరు నాడు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను కళ్లకు కట్టారు.
అటు వ్యక్తిగత జీవితం.. ఇటు సినిమాల్లో విమర్శలతో అవకాశాలు కోల్పోయిన నయనతార తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారన్న సంగతులను డాక్యుమెంటరీలో ఆసక్తికరంగా తెలియజేశారు. అవకాశాలు తగ్గిన సమయంలో నాగార్జున ఫోన్ చేసి ‘బాస్’ కోసం అడగడం, రిలేషన్‌షిప్ దెబ్బతిని బాధపడుతున్న సమయంలో ‘శ్రీరామరాజ్యం’లో నటించే ఛాన్స్ రావడం అందరూ ఆ చిత్ర బృందం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాసినప్పుడు నయన్ పడిన మానసిక క్షోభ తదితర వివరాలను పలువురితో చెప్పించారు. మరీ ముఖ్యంగా ‘సీత’ పాత్ర చేసినన్ని రోజులు నయనతార ఎంతో నిష్ఠగా ఉండేదని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి ‘లేడీ సూపర్‌స్టార్’ ఎలా అయ్యారో.. ఆమె పేరుతో సినిమాలు ఎన్నెన్ని కోట్లు మార్కెటింగ్ చేస్తాయో వంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు.
ఫస్ట్ పార్టులో ఆమె కెరీర్‌ను ప్రస్తావించగా, సెకండ్ ఆఫ్ నుంచి విఘ్నేశ్ శివన్ ఫ్యామిలీ, కెరీర్‌ను కాస్త టచ్ చేస్తే ‘నానుమ్ రౌడీ దాన్’ కోసం నయన్‌తో కలిసి పనిచేయడాన్ని చెబుతూ కొనసాగించారు. తొలిరోజు నయన్ సెట్‌లో ఎలా ఉన్నారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? దర్శకుడిగా కెరీర్ అప్పుడే స్టార్ట్ చేస్తున్న విఘ్నేశ్‌కు నయనతార ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది విషయాలను చెప్పారు. అదే సెట్‌లో అతడిని చూసి నయన్ మనసు పారేసుకున్న తీరు వివరించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం ధనుష్, నయన్‌ల మధ్య చర్చకు కారణమైన ఆ మూవీ సెట్‌లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలను కూడా చూపించారు. నయనతార, విఘ్నేశ్ శివన్ ప్రేమించుకుంటున్నారన్న విషయం అటు ఇండస్ట్రీ, ఇటు జనాలకు తెలిసిన తర్వాత వచ్చిన మీమ్స్ పైనా కొందరితో మాట్లాడించారు. పెళ్లికి ముందు వారిద్దరి రిలేషన్‌షిప్ ఎలా కొనసాగిందో ఇద్దరూ పంచుకున్నారు. ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? వస్తే ఏం చేస్తారు? వంటి ఆసక్తికర విషయాలను సరదాగా పంచుకున్నారు. చివరిలో వారి పిల్లలైన ‘ఉలగం, ఉయిరే’లను చూపిస్తూ డాక్యుమెంటరీకి శుభం కార్డు వేశారు.