'KA' Movie Review: ఇంతకీ ఈ సినిమాలో పాయింట్ కొత్తగా ఉందా లేదా?

KA Movie Review: "క" సినిమాలో మేం చెప్పిన పాయింట్ కొత్తగా లేకపోతే అది కొత్తగా లేదని జనాలు అంటే నేను ఇక సినిమాలు చేయడం ఆపేస్తా అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక్కసారిగా హైలైట్ అయ్యాడు కిరణ్ అబ్బవరం.

Update: 2024-10-31 07:36 GMT

'KA' Movie Review: ఇంతకీ ఈ సినిమాలో పాయింట్ కొత్తగా ఉందా లేదా?

KA Movie Review: "క" సినిమాలో మేం చెప్పిన పాయింట్ కొత్తగా లేకపోతే అది కొత్తగా లేదని జనాలు అంటే నేను ఇక సినిమాలు చేయడం ఆపేస్తా అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక్కసారిగా హైలైట్ అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ఆ సినిమా ఎట్టకేలకు దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకులలో కాస్త ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలను మరింత పెంచేసుకుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.

'క' కథ

ఓ హత్య కేసు కారణంగా పోస్టు మాన్ అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం)ను ప్రశ్నించడానికి ముసుగు వేసుకున్న కొందరు అతన్ని ఒక చీకటి ప్రాంతానికి తీసుకువెళ్తారు. అక్కడ వాసుదేవ్ ను ప్రశ్నిస్తుండగా, పక్క బ్లాక్ లోనే రాధ (తన్వి రామ్) ను బంధించినట్లు తెలుసుకుంటాడు హీరో. వాసుదేవ్. వాసుదేవ్, రాధ మాటలలో ఇద్దరు కృష్ణగిరి అనే గ్రామానికి చెందిన వారేనని ఆ గ్రామంలోని ఆడపిల్లలు తరచుగా మిస్ అవుతున్నారని తెలుస్తోంది.

అయితే అసలు వాసుదేవ్ ను అదుపులోకి తీసుకున్నది ప్రశ్నిస్తున్నది ఎవరు? హిప్నాటిజం చేసి ప్రశ్నించడానికి ఎవరు ప్రయత్నం చేశారు? ఏమిటి? కృష్ణగిరిలో మాయమవుతున్న ఆడపిల్లలకు వాసుదేవ్ కు లింక్ ఏమిటి? అసలు కృష్ణగిరిలో 3 గంటలకే ఎందుకు చీకటి పడుతుంది? చివరికి వాసుదేవ్ ఆ చీకటి గదిలో నుంచి బయటపడ్డాడా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “క” మూవీ.

విశ్లేషణ

నిజానికి సినిమా మొదలైనప్పటి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ప్రేక్షకులకు ఇది ఒక రొటీన్ మిస్టరీ థ్రిల్లర్ అనిపించవచ్చు . కానీ ఎప్పుడైతే క్లైమాక్స్ లో చూపించిన సన్నివేశాలు సినిమాకు టర్నింగ్ పాయింట్. దర్శక ద్వయం సందీప్ సుజిత్ తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. అయితే దాన్ని చెప్పేందుకు క్లైమాక్స్ వరకు నడిపించిన తీరు కొంతమందికి బోర్ కొట్టించవచ్చు. అయితే సినిమా మొదలైనప్పటి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు రాసుకున్న అన్ని సన్నివేశాలకు క్లైమాక్స్ లో ఇచ్చిన క్లారిటీ మాత్రం బలం చేకూరుస్తుంది.

నిజానికి ఈ సినిమా మొత్తానికి క్లైమాక్స్ మాత్రమే ఆయువు పట్టు. ఆ క్లైమాక్స్ తో కనెక్ట్ చేయడానికి మొదటి సీన్ నుంచి తీసుకున్న డీటెయిల్స్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఒక అనాథ తనకు ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో వరుస మిస్సింగ్ మిస్టరీలను చేదించే ప్రయత్నంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆసక్తికరంగా చూపారు. క్లైమాక్స్ మినహా మిగతా సన్నివేశాలు పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు. ఫ్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉన్న అవి ఊహకు తగ్గట్టుగానే ఉంది. అసలు ఎవరూ ఊహించలేని క్లైమాక్స్ తో ప్రేక్షకులందరినీ అబ్బురపరిచి థియేటర్ లో నుంచి బయటకు పంపారు సందీప్ సుజిత్.

ఇక హీరో కిరణ్ అబ్బవరానికి ఇది ఒక మంచి పాత్ర అని చెప్పొచ్చు. ఆయన గత సినిమాలతో పోలిస్తే నటనలో చాలా పరిణితి కనిపించింది. యాస విషయంలో వాచకం విషయంలో చాలా కేర్ తీసుకొని చేసిన సినిమాగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా నటించిన నయన్ సారిక ది కీలకమైన పాత్ర. తన్విరామ్ ఉన్నంతలో ఆకట్టుకుంది. కమెడియన్ పాత్రధారులు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగతా క్యారెక్టర్స్ లో అందరికంటే ఎక్కువగా అలరించిన నటి బిందు చంద్రమౌళి.

ఇప్పటివరకు చిన్నపాటి పాత్రలతో పరిచయమైన ఆమె, ఈ సినిమాలో పోషించిన పాత్రతో తన స్థాయిని పెంచుకుందనే చెప్పాలి. మిగతా పాత్రధారులు పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం అయితే టెక్నికల్ టీం విషయంలో మాత్రం హీరో సామ్ సీఎస్. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా పెద్ద ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి అసెట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఇక ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మొత్తం గ్రామాన్నే 80 ఏళ్ల కాలంలోకి తీసుకువెళ్లి ప్రేక్షకులను అప్పటి ఫీల్ కలిగించేలా చేశారు. నిర్మాణ విలువలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. 

హెచ్ ఎం టీవీ వర్డిక్ట్: కే'క' కాకున్నా.. కంటెంట్ మాత్రం కచ్చితంగా చూడద్దగ్గదే.

రేటింగ్‌: 3/5

Full View


Tags:    

Similar News