Swag Movie Review: స్వాగ్ రివ్యూ..కామెడీ సినిమా అనుకుని వచ్చిన వాళ్ళకు సర్‌ప్రైజ్ ప్యాకేజ్

Swag Movie Review and Rating: ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న సినిమా స్వాగ్ (Swag).

Update: 2024-10-04 08:38 GMT

Swag Movie Review

Swag Review: ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న సినిమా స్వాగ్. శ్రీ విష్ణు ఈ మధ్య వరుస హిట్లు కొడుతూ ఉండడం గతంలో రాజరాజ చోరా చేసిన డైరెక్టర్ తోనే ఈ స్వాగ్ అనే సినిమా చేయడంతో సినిమా ఎలా ఉంటుందని ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది దానికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ మీద కూడా ఫోకస్ పెట్టిన టీం సినిమాని జనాల్లోకి బానే తీసుకు వెళ్ళింది.

దీనికి తోడు మాతృస్వామ్యం పితృస్వామ్యం మధ్య జరిగిన యుద్ధం అంటూ కూడా ప్రచారం జరగడంతో సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అలా ఎదురుచూస్తున్న క్రమంలో ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.

కథ:

దివాకర్ పేట ఎస్సై భవభూతి(శ్రీవిష్ణు) భార్య రేవతి(మీరా జాస్మిన్) వదిలి వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలిపోతాడు. రిటైర్మెంట్ సమయంలో అతనిది శ్వాగణిక వంశం అని, అతని వారసత్వ సంపద ఓ చోట భద్రంగా ఉందని లెటర్ వస్తుంది. మరోపక్క సింగ(శ్రీవిష్ణు) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, తాను ప్రేమించిన అమ్మాయి(దక్ష నగర్కర్)ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇతని తండ్రి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది.

అయితే, ఇతనికి కూడా శ్వాగణిక వంశం, వారసత్వ సంపద గురించి లెటర్ వస్తుంది. అయితే ఆ సంపదని దక్కించుకోవాలంటే ఆ వంశం గుర్తు ఉన్న పలక ఉండాలి. అయితే అనూహ్యంగా అది మగాళ్లని అసహ్యంచుకునే అనుభూతి(రీతూ వర్మ) దగ్గర ఉంటుంది. మరో వైపు ఆ సంపదను కాపలా కాచే వంశం దాని శ్వాగణిక వారసుడు రాకపోతే సంపదని కైవసం చేసుకుందామని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏం జరిగింది? అసలు భవభూతికి, సింగాకి లేఖలు రాసింది ఎవరు? చివరికి ఆ వంశ సంపద ఎవరికి దక్కింది. ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కథ పరంగా చెప్పాలంటే ఎప్పుడూ 1500 సంవత్సరంలో మొదలై ఇప్పుడు 2024లో ముగించినట్లు చూపించారు. ఒకప్పుడు సమాజంలో మాతృస్వామ్యం ఎలా వర్ధిల్లింది. తర్వాత పితృస్వామ్యంగా ఎలా మారింది లాంటి విషయాలను సిల్లీగా చూపిస్తూనే అప్పట్లో ఆ విషయం కోసం ఎంత ఇబ్బంది పడ్డారో కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. ఆ తరువాత తరాల వాళ్ళు రాచరికపు సొమ్ములు ఉన్నా అనుభవించలేక ఎలా తిప్పలు పడిందో కూడా ఆసక్తికరంగా చిత్రీకరించారు.

ఒక రకంగా ఇది కొత్త కథ ఏమీ కాదు. గతంలో ఇలా ఒక నిధి చుట్టూ అల్లుకున్న చాలా కథలు సినిమాలు గా తెరకెక్కి సూపర్హిట్ లు అయ్యాయి. అయితే ఇక్కడ దానికి కాస్త కామెడీతో పాటు సోషల్ మెసేజ్ కూడా జోడించారు. నిజానికి ఏ సినిమాకి అయినా స్క్రీన్ ప్లే నే బలం. ఈ సినిమా విషయంలో కూడా ఆ స్క్రీన్ ప్లే చాలా మందికి అర్థం కాక ఇదేంట్రా ఎలా ఉంది అనిపిస్తుంది. కానీ అర్థమైన వారికి భలే రాసుకున్నాడ్రా స్క్రీన్ ప్లే అనిపించేలా ఉంది.

సినిమా మొదటి భాగం అంతా భవభూతి, సింగ కథలతో కాస్త కామెడీ పుట్టేలా నడిపించి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి కట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో ఓపెన్ చేసి యయాతి కథ, శ్వాగణిక వంశం ఆరంభం భవభూతి రాజు కథ చూపించి ప్రీ క్లైమాక్స్ నుంచి ట్విస్టులు రివీల్ చేస్తూ సంపద కోసం అందరూ వచ్చాక మంచి ఎమోషన్ ని రన్ చేయడం బావుంది. అయితే సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టొచ్చు. కానీ ఇన్నేసి కథలను కలిపి స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం నిజంగా కష్టమైన పనే, ఈ విషయంలో డైరెక్టర్ ని అభినందించక తప్పదు. అయితే ప్రమోషన్స్ లో పూర్తిస్థాయి కామెడీ సినిమాగా ప్రమోట్ చేయడంతో ప్రేక్షకులు దానికే ప్రిపేర్ అయి వెళ్తారు. కానీ ఎమోషనల్ కంటెంట్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాని శ్రీవిష్ణు తన భుజాల మీద మోశాడు అని చెప్పొచ్చు. ఐదు పాత్రలు 6 నుంచి 7 భిన్నమైన గెటప్స్ ధరించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ అలరించాడు. ఇప్పటివరకు మనం చూడని శ్రీవిష్ణుని ఈ సినిమా తర్వాత చూడొచ్చు. రివీల్ చేయలేని ఒక క్యారెక్టర్ లో శ్రీ విష్ణు నటనతో మరో మెట్టు ఎక్కేశాడు అని చెప్పొచ్చు. రీతు వర్మ ఉన్నంతలో పర్వాలేదు. కానీ, ఆమె కంటే మంచి పాత్ర మీరాజాస్మిన్ కి పడింది. ఇక గోపరాజు రమణ రవిబాబు కాదంబరి కిరణ్ కాంబినేషన్ సీన్స్ అదిరిపోయాయి. సునీల్ ఉన్న పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర అయితే కాదు.

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. వివేక్ సాగర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. BGM సినిమాని చాలా చోట్ల ఎలివేట్ చేసింది. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి మూడు కాలాలలకు పాటలు డిజైన్ చేయడం ఆసక్తి కరం. విజువల్స్ అద్భుతంగా తీసుకురావడంలో కెమెరా డిపార్ట్మెంట్ పనితనం కనిపించింది.

ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా రాజుల కాలం సెటప్, సంపద సెటప్, వంశ వృక్షాల సెటప్ కోసం బాగా పడిన కష్టం చాలా ఫ్రేమ్స్ లో కనబడింది. మేకప్ డిపార్ట్మెంట్ ని కూడా మెచ్చుకోవాలి. శ్రీవిష్ణుని అన్ని పాత్రల్లో వెరియేషన్ పర్ఫెక్ట్ గా చూపించారు. ఇక ఈ సినిమాలో హాసిత్ డైరెక్టర్ కంటే ఎక్కువగా రచయితగా మార్కులు కొట్టేశాడు. డైరెక్టర్ గా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించే ప్రయత్నం చేశాడు. ఇక నిర్మాణ విలువలు గురించి చెప్పాలంటే టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్రాండియర్ సినిమా మొత్తం కనిపించింది.

హెచ్ఎంటీవీ వర్డిక్ట్: స్వాగ్ .. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

Tags:    

Similar News