Saripodhaa Sanivaaram Movie Review: 'శనివారం' సీక్రెట్ ఏంటి.? నాని ఖాతాలో హిట్‌ పడ్డట్లేనా..?

Saripodhaa Sanivaaram Review: నాని, ప్రియాంక మోహన్‌ జంటగా తెరకెక్కిన సినిమా 'సరిపోదా శనివారం'. టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-08-29 09:32 GMT

Saripodhaa Sanivaaram Movie Review: 'శనివారం' సీక్రెట్ ఏంటి.? నాని ఖాతాలో హిట్‌ పడ్డట్లేనా..?

చిత్రం: సరిపోదా శనివారం

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులు

నిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్

నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

సంగీతం: జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ: మురళి జి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

విడుదల తేది: ఆగస్ట్‌ 29, 2024

Saripodhaa Sanivaaram Review: నాని, ప్రియాంక మోహన్‌ జంటగా తెరకెక్కిన సినిమా 'సరిపోదా శనివారం'. టైటిల్‌తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న వీరు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకీ 'సరిపోదా శనివారం' సినిమా ఎలా ఉంది.? అసలు ఈ సినిమా టైటిల్‌ సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సూర్య (నాని) చిన్నప్పుడే తల్లి(అభిరామి)ని క్యాన్సర్ కారణంగా కోల్పోతాడు. చిన్ననాటి నుంచి సూర్యకు తీవ్రమైన కోపం ఉంటుంది. ఈ కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకోవాలో వివరిస్తూ తల్లి ఓ విషయాన్ని చెబుతుంది. వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించాలని ఒట్టు వేయించుకుంటుంది. దీంతో నాని వారంలో తన కోపాన్ని కేవలం శనివారం మాత్రమే చూపిస్తాడు. వారం మొత్తం జరిగిన సంఘటనలను శనివారం గుర్తుచేసుకొని.. ఏ సంఘటనకు కోపం తెచ్చుకోవాలి అనే అంశాలను బేరీజు వేసుకుంటాడు. అయితే ఇదే సమయంలో ఓ శనివారం గొడవ జరుగుతోన్న సమయంలో చారులత(ప్రియాంక మోహన్) పరిచయమవుతుంది. తొలి చూపులోనే చారులతో ప్రేమలలో పడిపోతాడు. అయితే తన శనివారం సీక్రెట్‌ గురించి చారులత చెప్పే సమయంలోనే సూర్య జీవితంలో ఓ అనకోని సంఘటన ఎదురవుతుంది. చారులత పోలీస్‌గా పనిచేసే స్టేషన్ సీఐ దయానంద్‌ను నాని కొట్టే పరిస్థితి వస్తుంది. అయితే సీఐ కొట్టకుండా ఉండేందుకు చారులత ఒక ప్లాన్‌ చెబుతుంది. ఇంతకీ వీరు వేసిన ప్లాన్‌ ఏంటి.? సొకుల పాలెం గ్రామంతో ఉన్న సంబంధం ఏంటి.? అసలు సూర్యకు, చారులతకు ముందుగానే ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఇక సినిమా విశ్లేషణ విషయానికొస్తే.. చిత్ర యూనిట్ సినిమా విడుదలకు ముందే మొత్తం కథను చెప్పేసింది. ముందే చెప్పిన కథను స్క్రీన్‌పై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యారని చెప్పాలి. కోపాన్ని శనివారం మాత్రమే ప్రదర్శించడం వెనకాల కారణాన్ని దర్శకుడు సమర్థవంతంగా చూపించాడు. సీఐ దయ (ఎస్జే సూర్య) పాత్ర కూడా బాగుంది. సూర్య, దయల మధ్య వచ్చే సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. ఫస్టాఫ్‌ వరకు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో కథ ఊహకు అందేలా ఉంటుంది. తర్వాత ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. దీంతో సెకండాఫ్‌ కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు కాస్త మైనస్‌గా చెప్పొచ్చు. అయితే దర్శకుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. మల్లాది నవల లో ఒక పాయింట్ తీసుకున్నట్లు మాత్రం ఆ నవల చదివిన వారికి అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నాని హీరోగా వచ్చిన అన్ని చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో కాస్త హింస ఎక్కువగా ఉందని చెప్పాలి.


నటీనటుల విషయానికొస్తే.. నాని తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడని చెప్పాలి. ముఖ్యంగా ఎస్‌జే సూర్య, నానిల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడీ మరీ నటించారు. హీరోయిన్‌ ప్రియాంక పాత్ర స్కోప్ తక్కువే ఆమెకు నటించే అవకాశం కూడా తక్కువగానే దొరికింది. అయితే ఉన్నంతలో ఆకట్టుకుంది. హర్షవర్ధన్, మురళీ శర్మ, సాయికుమార్, విష్ణు ఓయ్, అభిరామి వంటి వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌ ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే మొత్తం మీద ఒక మంచి ఎంటర్‌టైన్‌ మూవీ చూడాలనుకునే వారికి సరిపోదా శనివారం మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

Full View


Tags:    

Similar News