Allu Arjun's new look: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. కొత్త లుక్‌లో బన్నీ ఫొటోలు వైరల్
Allu Arjun's new look at Nampally Court: హీరో అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు హాజరైన బన్నీ.. బెయిల్ పూచీకత్తు పత్రాలను న్యాయమూర్తికి సమర్పించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు బన్నీకి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది.
రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌ను ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో శనివారం నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ పూచీకత్తు పత్రాలు సమర్పించారు.
అయితే బెయిల్ పత్రాలు సమర్పించడానికి వచ్చిన అల్లు అర్జున్ కొత్త లుక్‌తో దర్శనమిచ్చారు. గత నాలుగేళ్లుగా పుష్ప2 సినిమా కోసం గడ్డంతో పాటు జుట్టు పెంచిన అల్లు అర్జున్ తాజాగా అవి తీసేసి న్యూ లుక్‌లో కనిపించారు. చాలా రోజులకు బన్నీ సాధారణ హెయిర్ స్టైల్‌తో కనిపించడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ టాక్ వినిపించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.