చిత్రం: సీత
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్, తనికెళ్ళ భరణి, అభిమన్యు సింగ్, అభినవ్ గోమాటం తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: శీర్షా రే
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: తేజ
బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ: 24/05/2019
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్క హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా 'కవచం' సినిమా తో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ తో కలిసి 'సీత' అనే సినిమాతో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే మంచి అంచనాలను అందుకున్న ఈ సినిమా ఇవాళ అనగా మే 24 న విడుదలైంది. మరి ఈ సినిమా అయినా బెల్లంకొండ కు హిట్ అందిస్తుందో లేదో చూసేద్దామా..
కథ:
సీత (కాజల్ అగర్వాల్) ఒక పొగరుబోతు అమ్మాయి. అనుకోకుండా ఆమె బసవరాజు (సోను సూద్) వల్ల చిక్కుల్లో పడుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల బసవరాజు తో ఒక కాంట్రాక్ట్ సైన్ చేసిన సీత దాని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సీత తన చిన్ననాటి స్నేహితుడు రామ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ని కలవడానికి వెళుతుంది. చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న రామ్ సీత కి సహాయం చేయాలి అనుకుంటాడు. అసలు బసవరాజు తో సీత సైన్ చేసిన కాంట్రాక్ట్ ఏంటి? బసవరాజు బారినుండి సీతను రామ్ కాపాడతాడా లేదా? చివరికి ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటులు:
కథ ప్రకారం ఈ సినిమా మొత్తం కాజల్ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పైగా ఈ సినిమాలో తన పాత్రకు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. చాలెంజింగ్ రోల్ అయినప్పటికీ కాజల్ ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచింది. ప్రతి సినిమాకి ఎంతోకొంత ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వస్తున్న బెల్లంకొండ ఈ సినిమాలో కుడా తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచాడు. వారిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సోను సూద్ తన పాత్రకు పూర్తిస్తాయలో న్యాయం చేసి పాత్రకు ఊపిరి పోశారు. అభిమన్యు సింగ్ నటన ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అభినవ్ గోమాటం మంచి కామెడీ టైమింగ్ తో మెప్పిస్తాడు. మిగతా అందరు నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు తేజ ఈ సినిమా కోసం ఒక మంచి కథను తయారు చేశారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లో కామెడీ, రొమాన్స్, వంటి కమర్షియల్ ఎలెమెంట్స్ ఉన్నప్పటికీ, మిగతా కమర్షియల్ సినిమాలకంటే కథ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాక దర్శకుడు ఈ కథను చెప్పే విధానంకూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా సినిమాకు బాగా సెట్ అయ్యింది. పాటల కంటే అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమా లో ఉండే ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. శీర్షా రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాకు శీర్షా మంచి విజువల్స్ ను అందించడమే కాక కెమెరా యాంగిల్స్ కూడా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.
బలాలు:
నటీనటులు
ఫస్ట్ హాఫ్
బలహీనతలు:
సెకండ్ హాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు
ఎమోషనల్ డోసేజ్ ఎక్కువ అవ్వడం
ప్రీ క్లైమాక్స్
చివరి మాట:
ఈ సినిమాలో బలమైన కథ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగా మోదులయ్యే ఈ సినిమా మొదటి భాగం మొత్తం కొంచెం కామెడీతో నిండి వుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. మొదటి హాఫ్ బాగానే అనిపించినప్పటికీ రెండవ హఫ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ సాగతీత సన్నివేశాలను కట్ చేసి ఉంటే సినిమా కొంచెం బాగుండేది అనిపించింది. బలమైన క్యారెక్టర్లు ఉన్నప్పటికీ సినిమా కథ పరంగా అంతంతమాత్రంగానే ఉంది. చివరిగా 'సీత' సినిమా కాజల్ అభిమానులకు మాత్రమే కనుల విందు చేస్తుంది.
బాటమ్ లైన్:
అమాయక రాముడితో అల్లరి 'సీత' కథ.