రణరంగం మూవీ రివ్యూ: తెలుగు తెరపై మరో గాడ్ ఫాదర్ సినిమా

శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో రణరంగం సినిమా ఈరోజు విడుదలైంది. సినిమా కొంత సాగాదీతగా అనిపించడంతో అందర్నీ ఆకట్టుకునే అవకాశం లేదనిపిస్తోంది. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో తయారైన సినిమాల కనిపించే రణరంగం మూవీ రివ్యూ.

Update: 2019-08-15 10:13 GMT

మంచి సిన్మాలు చేయడం లోనూ.. మంచి నటనను కనపర్చడంలోనూ శర్వానంద్ శైలి భిన్నంగా ఉంటుంది. ఒక మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఒక శతమానం భవతి ఇలా విభిన్న కోణాల్లో సినిమాలు చేశాడు శర్వానంద్. ఇప్పుడు మరో కొత్త ప్రయత్నం చేశాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రెండు రకాల పాత్రల్లో రణరంగం సినిమా చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. శర్వానంద్ అనుకున్నట్టు ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అన్నది చూద్దాం.

కథ ఇదీ..

ఇదో గ్యాంగ్ స్టర్ కథ. గాడ్ ఫాదర్ సినిమాని పోలిన సినిమా. గాడ్ ఫాదర్ సినిమా స్ఫూర్తితో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇదీ అటువంటిదే. స్వర్గీయ ఎన్టీఅర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజుల కథ ఇది. అప్పట్లో సంపూర్ణ మధ్య నిషేధం మన రాష్ట్రంలో అమలు చేశారు. ఇదే సమయంలో విశాఖపట్నంలో దేవ (శర్వానంద్‌) బ్లాక్‌ టికెట్లు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. జీవితం అంతా హుషారుగా.. స్నేహితుల మధ్య ఏ బాధ్యతలు లేకుండా గడుపుతుంటాడు. గీత(కల్యాణి ప్రియదర్శన్) అనే అమ్మాయిని ప్రేమిస్తూ జాలీగా ఉంటాడు. ఈ సమయంలో డబ్బు సంపాదించాలానే ఆశతో మద్యనిషేధం ద్వారా ఓ మార్గం ఎంచుకుంటాడు. మద్యం బ్లాక్ లో అమ్మడం ప్రారంభిస్తాడు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చే క్రమంలో దేవా కి శత్రువులు పెరుగుతారు. వారిని ఎదుర్కుంటూ తన దొంగ దందా నడిపిస్తుంటాడు. ఇలా ఉండగా అతని స్నేహితులకు శత్రువులతో ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు దేవాకి డబ్బు సంపాదనే కాకుండా తనవారిని కాపాడుకోవడం కూడా ముఖ్యమైన బాధ్యతగా మారుతుంది. ఇక తన విరోధుల కంటే బలవంతుడుగా.. డబ్బున్న వాడిగా ఎదగడానికి దేవా చేసిన ప్రయత్నాలు. దాని మధ్యలో చెలరేగిన ఘర్షణలు.. ఎలా డబ్బున్న వాడిగా దేవా ఎదిగాడు? చివరికి ఈ బతుకు పోరాటంలో ఏం సాధించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే రణరంగం.

ఇలా ఉంది..

తెలుగు తెరపై గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు కొత్త కాదు. ఒక మామూలు వీధిలో తిరిగే వ్యక్తి డాన్ గా, మాఫియా లీడర్ ఎదగడమే ఈ సినిమాల్లో ముఖ్యమైన లైన్. ఇదే లైన్ తో సినిమాలు చాలా వచ్చాయి. సుధీర్ వర్మ మరో ప్రయత్నం చేశాడంతే. అయితే, ఈ ప్రయత్నంలో బాగా తడబడ్డాడు. చాలా నిదానంగా సినిమాని ప్రారంభించి.. అసలు కధలోకి రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. అటు తర్వాత కాస్త వేగం పెంచినా.. ద్వితీయార్థంలో మళ్లీ నిదానిస్తుంది. సినిమా అరగంట ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి ఆసక్తి కలిగించినా.. తరువాత దానిని చివరి వరకూ మెయింటైన్ చేయలేకపోయారు. అప్పటి కథని ఇప్పటి తరానికి చెప్పే క్రమంలో ఫ్లాష్ బ్యాక్ మీద ఆధారపడడం సహజం. కానీ, దానిని ముక్కలు ముక్కలుగా చేయడంతో.. కొంత ప్రేక్షకుడికి అయోమయం కలుగుతుంది. సినిమా ప్రధమార్థంలో బ్లాక్ లో హీరో టికెట్లు అమ్మడం.. ప్రేమలో పడటం.. ఇలా కొంత సేపు సందడిగా కనిపిస్తుంది. నిజానికి ఇది మాత్రమే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక మిగిలిన దంతా సాగదీతగా కనిపిస్తుంది.

ఇలా చేశారు..

శర్వానంద్ సినిమాని తన భుజాల మీద మోసే ప్రయత్నం చేశాడు. రెండు రకాలుగా సినిమాలో కనిపిస్తాడు శర్వా. యువకుడిగా.. మధ్యవయస్కుడిగా.. రెండిటిలోనూ పరిణితి చెందిన నటన కనబర్చాడు. కల్యాణి ప్రియదర్శన్ గ్లామరస్ గా కనిపించింది. కాజల్ పాత్ర సినిమాలో సరిగా ఎలివేట్ అవ్వలేదు. ఇక మురళీ శర్మ కొంత విభిన్నంగా కనిపించారు. శర్వాకి స్నేహితులుగా నటించిన వారూ ఫర్వాలేదనిపించారు.

అప్పటి నేపధ్యాన్ని తెరపై చూపించడంలో ప్రొడక్షన్ డిజైనర్ రవీంద్ర సక్సెస్ అయ్యారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఇక కెమెరా పనితనం చాలా బావుంది. సుధీర్ వర్మ అందించిన మాటలు బావున్నాయి.

మొత్తమ్మీద కథ, కథనాల్లోని లోపాలతో సినిమా కొంత సాగాదీతలా ఉంటుంది. శర్వానంద్ నటనను ఇష్టపదేవారికి సినిమా కొంతలో కొంత నచ్చుతుంది.

గమనిక: ఇది సమీక్షకుడి ఆలోచనలతో ఇచ్చిన విశ్లేషణ. వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్పబడింది.


Tags:    

Similar News