Aranya Movie Review: "అరణ్య" మూవీ రివ్యూ
Aranya movie Review: విలక్షణమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా దగ్గుబాటి.
Aranya Movie Review: విలక్షణమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తూ.. తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక బాలీవుడ్‌లో తన సొంత మార్గెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు మన టాలీవుడ్ హీరో. తాజాగా 'అరణ్య' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చాడు రానా. టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలు పెంచేసిన 'అరణ్య' సినిమా.. తెలుగు, తమిళం భాషల్లో మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దక్షణాది రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా హిందీ లో మాత్రం ప్రస్తుతానికి విడుదల వాయిదా వేశారు. ప్రకృతి ప్రేమికుడు గా రానా అరణ్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా రివ్యూ లో చూద్దాం..
కథ
నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య(రానా దగ్గుబాటి) పర్యావరణ ప్రేమికుడు. అడవులు, వన్యప్రాణులు అంటే ఆయనకు చాలా ఇష్టం. నరేంద్ర భూపతి తాతలు 500 ఎకరాల అడవిని ప్రభుత్వానికి రాసిస్తారు. దీంతో ఆయన ఆ అడవికి, అక్కడి వన్యప్రాణులకు సంరక్షకుడిగా ఉంటాడు. అలాగే అడవులను పెంచే ఉద్దేశ్యంతో నరేంద్ర భూపతి లక్షకు పైగా మొక్కలు నాటుతాడు. దీంతో రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మాన్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకుంటాడు మన హీరో. అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్ మహేదేవన్) ఆ అడవిని కబ్జా చేసి, ఓ టౌన్‌షిప్‌ని నిర్మించాలని భావిస్తాడు. అడవి ఆక్రమణను ప్రకృతి ప్రేమికుడు అరణ్య ఏ విధంగా ఆపాడు? తన ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న అరణ్యను మంత్రి ఏవిధంగా కష్టాలు పెట్టాడు? చివరకు అడవిని, ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ.
ఎవరెలా చేశారంటే..
విలక్షణ పాత్రల్లో నటించే కొద్ది మంది నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచే డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పిస్తున్నాడు. ఎలాంటి పాత్రల్లోనైనా రాణించగల అద్భుతమైన నటుడు రానా. అరణ్య పాత్రలో రానా ఒదిగిపోయిన తీరు చూస్తే.. ఇట్టే అర్థమైపోతోంది. ఆయన నటనే ఈ సినిమాకు మెయిన్ హైలెట్. ఈ పాత్ర కోసం రానా పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. అడవి మషినిలా ఉండే అరణ్య పాత్రలో మన హీరో జీవించేశాడు... కాదు ప్రాణం పోశాడు. సింగ పాత్రకు విష్ణు విశాల్ తగిన న్యయం చేశాడు. జర్ణలిస్టుగా శ్రీయా పింగోల్కర్, నక్సలైట్‌గా జోయా హుస్సేన్ పర్వాలేదనిపించారు. వీరి పాత్రలు సినిమాలో చాలా తక్కువ సేపే కనిపిస్తాయి. విలన్ పాత్రలో మహదేవన్ ఒదిగిపోయాడు. కమెడియన్ రఘుబాబు తెరపై ఉన్నంతసేపు నవ్వించేలా చేస్తాడు. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
ఎలా ఉంది..
మనుషుల స్వార్థం కోసం అడవి భూమిని ఆక్రమించడంతో.. ఆ ఆడవిలో జంతువుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రేమఖైదీ, గజరాజు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్. ట్రైలర్, టీజర్ లతో ఆకట్టుకున్న డైరెక్టర్... సినిమాపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. కథ పరంగా బాగున్నా.. తెరపై సరిగా ప్రజెంట్ చేయలేకపోయాడు. బలమైన కథను ఆసక్తికరంగా మలచడంలో ప్రభూ సాల్మన్ విఫలమయ్యాడు. క్యారెక్టర్ల పరిచయం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథనాన్ని ఎటు తీసుకెళ్లాడో తెలియక ప్రేక్షకులు తికమక పడతారు. ఇంతలో నక్సలైట్లను ఎందుకు ఈ కథలోకి తీసుకువచ్చాడో తెలియదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా సింపుల్‌గా కథనం సాగిపోతుందనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఏనుగులకు రానాకు మధ్య వచ్చిన ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. అరణ్య పాత్రని మరింత బలంగా చూపిస్తే బాగుండేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజువల్ ఎఫెక్ట్స్.
సినిమా అంతా అడవి చుట్టే తిరుగుతుంది. ఎక్కువ శాతం షూటింగ్‌ని అక్కడే జరిపారు. అడవి అందాలని తెరపై చక్కగా బందించారు. అడవిలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఏఆర్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అలాగే శాంతను మొయిత్రా సంగీతం కూడా అరణ్యకు ప్రధాన బలం. ఎడిటర్ భువన్ శ్రీనివాసన్ తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మొత్తంగా అరణ్య అంచనాలకు అందుకోలేక పోయింది. ఊహకందేలా సాగే కథనం, సాగదీత సీన్లతో కథను పక్కదారి పట్టించారనిపిస్తుంది.
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే!