Playback Review:'ప్లే బ్యాక్' మూవీ రివ్యూ
కరోనాతో షూటింగ్‌లు, థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి మాత్రం అయోమయంలో పడింది.
Playback Review: కరోనాతో షూటింగ్‌లు, థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే, రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి మాత్రం అయోమయంలో పడింది. ఈ టైంలో మాత్రం ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు అలరించగా.. మరికొన్ని విడుదలకు సిధ్దమవుతున్నాయి. తాజాగా నేడు (మార్చి 5) 'ప్లే బ్యాక్' సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రయోగాల సీజన్ నడుస్తోంది. మూస ధోరణిని పక్కన పెట్టి మరీ సినిమాలు చేసేందుకు నిర్మాతలు, హీరోలు ముందుకు వస్తున్నారు. కారణం, ప్రేక్షకులు కూడా కొత్తదనానికి పట్టం కడుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే 'ప్లే బ్యాక్'. గతాన్ని, వర్తమానాన్ని కలుపుతూ ఓ ప్రయోగం చేసిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ...
జర్నలిస్ట్ కావాలనే కోరికతో కార్తి (దినేష్ తేజ) ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే ఓ మీడియా సంస్థలో జాయిన్ అవుతాడు. అలాగే కొన్ని కారణాలతో ఓ పాత ఇంటికి షిప్ట్ అవుతాడు కార్తి. అయితే, ఈ ఇంట్లో ఓ పురాతన ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది. కానీ, ఈ ఫోన్‌కు కనెక్షన్ ఉండదు. దీంతోనే అసలు కథ ప్రారంభమవుతుంది. ఆ ఫోన్‌కు సుజాత (అనన్య నాగళ్ల) అనే అమ్మాయి కాల్ చేస్తుంటుంది. 1993 లో ఉన్న సుజాత, వర్తమానంలో ఉన్న కార్తికి ఎలా ఫోన్ చేస్తుంది? వీరి మధ్య ఉన్న బంధం ఏమిటి? అసలు ఆమె ఎవరు? ఆమె సమస్యలను కార్తి ఎలా పరిష్కరించాడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాల మేళనమే ప్లేబ్యాక్ సినిమా.
ఎలా ఉంది...
ఎక్కడా ల్యాగ్ లేకుండా.. సినిమా మొదలైన కొద్ది సేపటికే కథలోకి తీసుకెళ్తాడు డెరెక్టర్ హరి ప్రసాద్ జక్కా. గత కాలానికి చెందిన సుజాతకు, వర్తమానంలోని కార్తికి మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి. అసలు కథలోకి మాత్రం ఇంటర్వెల్ తరువాతే అడుగులు పడతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌ను ఓ ట్విస్ట్ తో ఆకట్టుకుంటాడు దర్శకుడు. సెకాండాప్ పై మరింత ఆసక్తి పెంచుతాడు. క్రాస్ కనెక్షన్ వల్లే సుజాత తనకు ఫోన్ చేస్తుందని తెలుసుకుంటాడు కార్తి. గతం, వర్తమానం చుట్టూ తిరిగే కథను బాగా ఎంజాయ్ చేస్తారు. సెకాండాప్ లో స్క్రీన్ ప్లే ఆకట్టుకంటుంది.
ఎవరెలా చేశారు...
ఈ సినిమాలో ఐదారు పాత్రలే కనిపిస్తాయి. కానీ అందరి చూపు మాత్రం అనన్య నాగళ్ల, దినేష్ తేజ్ చుట్టూ తిరుగుతుంటాయి. దినేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక అనన్య మాత్రం గ్లామర్, నటనలో తనకు తానే సాటి అనేలా నటించింది. మల్లేశం సినిమా తరువాత మరలా సత్తా చాటింది. టీవీ 5 మూర్తి, టీఎన్ఆర్‌లు తమ పాత్ర పరిథి మేరకు నటించారు.
క్రాస్ కనెక్షన్ అనే లైన్‌తో సినిమా తీసి ఆకట్టుకోవడంలో డైరెక్టర్ హరి ప్రసాద్ జక్కా విజయవంతమయ్యాడు. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను మనకు అర్థమయ్యేలా తనవంతు ప్రయత్నం చేశాడు. సుకుమార్ ట్రూప్ నుంచి వచ్చిన జక్కా ప్రసాద్.. తనదైన ముద్ర వేశాడు. సెకండాఫ్ లో అదరగొట్టిన దర్శకుడు.. ఫస్టాప్ లో మాత్రం తడబడ్డాడు. కొన్ని సీన్లలో లాజిక్‌లు చాలా మిస్ చేశాడు.
ప్లే బ్యాక్ సినిమాకు కమ్రన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథలో లీనమయ్యేట్లు చేస్తుంది. బుజ్జి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ లో నాగేశ్వర్ రెడ్డి బొంతల తన ప్రతిభ చూపారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగానే ఉన్నాయి.
చివరగా ప్లే బ్యాక్ సినిమా కచ్చితంగా అందర్ని థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. అయితే ఓ వర్గానికి మాత్రమే ఈ సినిమా ఎక్కుతుంది.
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే!