'యన్.టి.ఆర్ కథానాయకుడు' మూవీ రివ్యూ: తెలుగు ప్రేక్షకులకు ఒక పాఠం
నందమూరి తారక రామ రావు.. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది. తెలుగు వారి ఆత్మ విశ్వాసానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారం అని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మహా నాయకుడు.
చిత్రం: ఎన్టీఆర్-కథానాయకుడు
నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్, సుమంత్, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్, పూనమ్ బాజ్వా, రానా, మంజిమా మోహన్, నరేష్, మురళీశర్మ, ప్రకాష్ రాజ్, క్రిష్, రవికిషన్, శుభలేఖ సుధాకర్, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వీఎస్
ఎడిటింగ్: అర్రం రామకృష్ణ
మాటలు: బుర్రా సాయిమాధవ్
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
బ్యానర్: ఎన్‌బీకే ఫిల్స్మ్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా
విడుదల తేదీ: 09/01/2019
నందమూరి తారక రామ రావు.. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది. తెలుగు వారి ఆత్మ విశ్వాసానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారం అని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మహా నాయకుడు. వెండితెరపై ఎలాంటి పాత్రయినా తనదైన నటనతో చెరగని ముద్రవేసిన గొప్ప నటుడు. ఆయన కృష్ణుడు పాత్ర వేస్తే నిజంగా ఆ దేవుడే దిగి వచ్చాడా అనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమా చరిత్ర ఒక గ్రంధం అయితే అందులో మొదటి పేజీ ఆయన గురించే ఉంటుంది. ఆయన సినీ ప్రస్థానంలో అందుకున్న ఉన్నత శిఖరాలు బోలెడు. అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై చూపించే చిన్న ప్రయత్నమే 'ఎన్టీఆర్ కథానాయకుడు'. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో క్రిష్ దర్శకత్వంలో నటించిన సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూసేద్దామా?
కథ:
ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం అని అందరికి తెలిసిందే. కానీ తెలుగు ప్రేక్షకులకు రామారావు హీరో అయ్యాక మాత్రమే తెలుసు కానీ అంతకుముందు ఆయన జీవితంలో ఏం జరిగింది అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నందమూరి తారక రామారావు మరియు ఆయన భార్య బసవతారకం మధ్య బంధం, ఎన్టీఆర్ గారు బసవతారకమ్మ ను ఎంత బాగా చూసుకున్నారు అనే విషయాలు ఎవరికి తెలియదు. ఆ విషయాలన్నీ ఇప్పుడు దర్శకుడు క్రిష్ మన ముందుకు తీసుకు వచ్చాడు. నిజానికి కథ మొత్తం బసవతారకమ్మ కోణంలోనే నడుస్తుంది. ఈ సినిమా మొదటి సీన్ లో బసవతారకం (విద్యాబాలన్) క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటారు. ఆవిడ పరిస్థితి విషమించటంతో హరికృష్ణ (కల్యాణ్ రామ్) ఆందోళనకు గురవుతారు. చికిత్స తీసుకుంటున్న బసవతారకం ఎన్టీఆర్ ఆల్బమ్ ను తిరగేస్తూ ఉండటంతో కథ మొదలవుతుంది. ఎన్టీఆర్ (బాలకృష్ణ) బాల్యం ఎలా సాగింది? ఆయనకు సినిమాలపై ఎందుకు ఇష్టం పెరిగింది? ఒక మామూలు రైతుబిడ్డగా, రిజిస్ట్రార్ గా పని చేస్తున్న ఎన్టీఆర్ హీరో గా ఎలా మారాడు?సినిమాలలో ఆయన ఎలా ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు? అనే అంశాలపై కథ నడుస్తుంది.
నటీనటులు:
ఒకరి జీవిత చరిత్రను తెరపైన చూపించటం అంత సులువైన విషయం కాదు. అందులోనూ ఎన్టీఆర్ లాంటి మహా గొప్ప నటుడు మరియు నాయకుడిలా నటించడం అందరికీ కుదిరే పని కాదు. కానీ బాలకృష్ణ ఆయన నటన తో నిజంగా ఎన్టీఆర్ నటించారా అనుకునేంత బాగా నటించారు. ఎన్టీఆర్ సినిమాల్లో వేసుకున్న చాలావరకు గెటప్పులు బాలకృష్ణ ఇందులో మనకు చూపించారు. ముఖ్యంగా కృష్ణుడు వెంకటేశ్వర స్వామి పాత్రల్లో బాలకృష్ణ జీవించారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో 20 ఏళ్ల ఎన్టీఆర్ గా బాలకృష్ణ అంతగా సూట్ అవ్వకపోయినా సెకండ్ హాఫ్ లో ఆయన నటన అద్భుతం గా చెప్పుకోవచ్చు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటన అమోఘం. నిజంగా బసవతారకమ్మ ఇలానే ప్రవర్తించే వారేమో, ఇలానే ఉండేవారేమో అన్నంత బాగా నటించింది. ఇక ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్ ఒదిగిపోయాడు. సెకండ్ హాఫ్ ముగిసి ముగిసిపోయే ముందు ఎంట్రీ ఇచ్చిన రానా కూడా తన హావభావాలతో ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తాడు. ఇక మిగతా చిన్న పాత్రల్లో నటించిన రకుల్ ప్రీత్, హన్సిక, పాయల్ రాజ్ పుత్, నరేష్, ప్రణీత, ప్రకాష్ రాజ్ తదితరులు బాగా నటించారు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు క్రిష్ ప్రతిభను కచ్చితంగా మెచ్చుకొని తీరాలి. సినిమాలో ఏది చూపిస్తే బాగుంటుంది ఏది చూపించాల్సిన అవసరం లేదు అనే విషయాలు బాగా తెలుసుకున్నాడు. అభిమానులకు నచ్చేలా, చరిత్రలో నిలిచిపోయేలా సినిమా తీయగలిగాడు. దివిసీమ ఉప్పెన నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. అభిమానులకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలను కూడా నాటకీయంగా కాకుండా చాలా సహజంగా దర్శకుడు తెరపైకి తీసుకొచ్చాడు. నటీనటుల నటన పక్కన పెడితే సినిమా క్రెడిట్ మొత్తం క్రిష్ కి ఇవ్వొచ్చు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం సినిమాకు చాలా బలాన్ని చేకూర్చింది. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రెమును చాలా అందంగా తీర్చిదిద్దారు. బుర్రా సాయి మాధవ్ రచించిన మాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలలో ఆయన రచించిన మాటలు అద్భుతం. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. ఇక మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించారు. దానికి కూడా మెచ్చుకుని తీరాలి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
బలాలు:
ఎన్టీఆర్ గెటప్పులలో బాలయ్య
సెకండ్ హాఫ్ లో భావోద్వేగ సన్నివేశాలు
ఎన్టీఆర్-బసవతారకం సన్నివేశాలు
ఎన్టీఆర్-ఏయన్నార్‌ల స్నేహం
విద్య బాలన్, బాలయ్య నటన
బలహీనతలు:
నిడివి ఎక్కువగా ఉండటం
మొదటి హాఫ్ స్లో గా నడవటం
చివరి మాట:
ఎన్టీఆర్ అభిమానులు మళ్ళీ ఆ మహానుభావుడిని గుర్తుతెచ్చుకోవడం కోసం ఈ సినిమా తప్పక చూడాలి. అలాగే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆయన ఖ్యాతి, సినిమాలలో ఆయన జీవిత చరిత్ర ఒక పాఠం గా మిగిలిపోతాయి.
బాటమ్ లైన్:
'ఎన్టీఆర్ కథానాయకుడు' అన్నగారికి నందమూరి కుటుంబం అందించిన అందమైన నివాళి.