Nani v movie review: యాక్షన్ సస్పెన్స్ ఇష్టపడేవారికి 'V' వినోదమే!

Nani V Movie Review: తెలిసిన కథకే కొత్త కథనం అద్దిన సినిమా!

Update: 2020-09-04 20:26 GMT

 Nani V Movie Review  |  కరోనా దెబ్బకి సరైన  వినోదమే ప్రేక్షకులకు కరువైంది. ఇంటిల్లిపాదీ బయటకు వెళ్లి సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. ఇంట్లోనే కూచుని టీవీ సీరియళ్ళూ..అపుడపుడు రిలీజైన చిన్న చితకా సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్న పరిస్థితి. మరోవైపు కరోనా మహమ్మారి వ్యాపించడానికి ముందు సెట్స్ మీదకు వెళ్లి పూర్తీ అయిన క్రేజీ సినిమాలు దియేటర్లలో విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు, రేపు అనుకుంటూ సినిమాలు ఎప్పుడు విడుదల చేద్దామా అని నిర్మాతలు.. హీరోలు.. నటీ నటులు అందరూ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపధ్యంలో పూర్తయిన సినిమాల్ని కొందరు చిన్న నిర్మాతలు ఓటీటీ లో విడుదల చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని సినిమాలు వచ్చాయి కూడా. అవేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే, తొలిసారిగా ఒక స్టార్ హీరో నటించిన సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది అనే వార్త తెలుగు సినిమా ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఆ సినిమా దిల్ రాజు నిర్మించిన సినిమా కావడం. నాచురల్ స్టార్ నానీ తొలిసారిగా విలన్ గా నటించిన చిత్రం కావడం.. అందులో మరో హీరో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండడం వంటి విశేషాలతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా V.  ఈ సినిమా 5 వతేదీన విడుదల కావాల్సి ఉంది..కానీ ముహూర్తం ముందుకు జరిపి 4 వ తేదీనే విడుదల చేసేశారు. మరి ఈ సినిమా ఎలా వుందో.. నానీ విలన్ గా ఏం చేశారో తెలుసుకుందాం..


మొదట్నుంచీ హీరో నానీ చిత్రబృందం చెబుతున్నాట్టు ఇందులో నానీ విలన్ కాదు. విలన్ షేడ్స్ ఉన్న హీరో. ఒకరకంగా ఈ సినిమా ఇలా ఉంటుంది అని ఎవరూ ఊహించరు. నానీ..సుధీర్ బాబు ఒక లెవెల్ లో ఈ సినిమాని నడిపించారు. కథలో కొత్తదనం ఏమీ లేదు. అవును.. ఇది మామూలు పగ..ప్రతీకారం కథ. హీరో.. హీరోయిన్.. ప్రేమ.. హీరోయిన్ మర్డర్.. హీరో ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరడం.. ఒక పోలీస్ ఆఫీసర్ దానిని ఆపాలని చూడటం ఇంతే.. చివరికి ఏమవుతుందో కూడా దాదాపుగా తెలిసిన విషయమే. కానీ, ఇక్కడే దర్శకుడు మాయాజాలం చేశాడు.. ఇంద్రకంటి నిజంగానే ఇంద్రజాలం చేశాడు. నానీతో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అష్టా చెమ్మా చేసిన ఈ దర్శకుడు ఈసారి అతని 25 వ సినిమాని దానికి పూర్తి భిన్నంగా నడిపించాడు. 


సినిమా ప్రారంభమే పెద్ద యాక్షన్ సినిమాలా అనిపిస్తుంది.. కానీ..సినిమా నడుస్తున్న కొద్దీ మెల్ల మెల్లగా నానీ, సుధీర్ బాబుల మాయలోకి ప్రేక్షకుడు వెళ్ళిపోతాడు. ముందే చెప్పినట్టు సినిమా కథ కంటె కధనమే బలంగా ఉంటుంది. అనగనగా ఓ పోలీసాఫీసర్.. నగరంలో జరిగిన అల్లర్లను అదుపు చేసి పోలీస్ మెడల్స్ సంపాదించేస్తాడు. దీంతో డిపార్ట్మెంట్ లో పేరు.. మీడియాలో గౌరవం..జనంలో అభినందనలు వెల్లువెత్తుతాయి. ఈ పోలీస్ ఆఫీసర్ కి ఒక అమ్మాయి పరిచయం కావడం ప్రేమ పుట్టడం జరుగుతుంది. ఈలోపు అనుకోని విధంగా వి ఎంటర్ అవుతాడు. కిరాతకంగా ఒక హత్య చేస్తాడు. అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ కి ఓ క్లూ వదిలి పెడతాడు. తరువాత ఫోన్ చేసి ఇంకో నలుగురిని చంపుతాననీ.. దమ్ముంటే ఆపమనీ చాలెంజ్ చేస్తాడు. ఓడిపోతే పోలీస్ ఉద్యోగం వదిలేయాలని షరతు పెడతాడు. దానికి సై అంటాడు పోలీస్ ఆఫీసర్. ఇక అక్కడ నుండి టామ్ అండ్ జెర్రీ ఆట మొదలవుతుంది. మరి వి ఛాలెంజ్ చేసినట్టు హత్యలన్నీ చేశాడా.. వాటిని పోలీస్ ఆఫీసర్ ఆపగలిగాడా.. అసలు వి ఎందుకు ఈ హత్యలు చేశాడు.. ఇలాంటి ప్రశ్నలన్నిటి సమాధానం కావాలంటే వి చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..

సినిమా మొత్తం నానీ, సుధీర్ బాబు చుట్టూనే తిరుగుతుంది. మిగిలిన పాత్రలన్నీ అలా అలా వస్తాయి వాటి పని అవి చూసుకుని వెళ్ళిపోతాయి. ఉన్నంతలో కాస్త ఎక్కువ సేపు కనిపించే పాత్ర నివేదా థామస్. తరువాత అదితీరావు.. అంతే. నానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నాచురల్ స్టార్ కదా.. విలనిజం కూడా అంతే నాచురల్ గా చూపించేశాడు. ఇక పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు పరిణితి చెందిన నటన చూపించాడు. సరిగ్గా ఆ పాత్రకి సరిపోయాడు. హీరోయిన్లు ఇద్దరికీ ఉన్న అవకాశం తక్కువ..ఉన్నంతలో బాగా చేశారు. మిగిలినవారు వారి పాత్రలకు తగ్గట్టుగా చేశారు. 


సాంకేతికంగా ఎలా ఉందంటే..

ఇది దర్శకుడి సినిమా.. ఇంద్రగంటి చిన్న కథను సినిమాగా చూపించే విషయంలో.. సినిమా అంతా ఒకే టెంపో మెయింటెయిన్ చేస్తూ నడిపించేశారు. దానిలో అయన సిద్ధహస్తుడు కదా. ఇక నేపధ్య సంగీతం బావుంది. పాటలు కొంతవరకూ ఫర్వాలేదు. అమిత్ త్రివేదీ సినిమా మూడ్ ను ఎలివేట్ చేసే సంగీతం అందించారు. ఇక మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చాలా బావుంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ఒక ప్లస్ అని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మాణ విలువలు అయన రేంజికి తగ్గట్టుగా ఉన్నాయి.

సినిమా ఎలా ఉందంటే..

చాలా కాలంగా స్టార్ ల కొత్త సినిమా చూడక మొహం వాచిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కిక్ ఇస్తుంది. అందులోనూ ఇంట్లో కూచుని చూడటానికి అనువైన సినిమాల ఇది. కొద్దిగా రక్తపాతం కనిపించినా మరీ అంత ఇబ్బంది పెట్టాడు. సినిమా మొత్తం ఎక్కడా అనవసరమైన రొమాన్స్.. రకరకాల గిమ్మిక్కులూ లేకుండా ఉంది. కామెడీకి ఇందులో అవకాశం లేదు. కానీ, నానీ తో రెండు మూడు చోట్ల అటువంటి సీన్లు చేసి కాస్త రిలీఫ్ ఇచ్చే ప్రయతామ్ చేశారు. మొత్తమ్మీద సినిమా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికీ బాగా నచ్చుతుంది. మహిళా ప్రేక్షకులు నానీ కి పెద్ద ఫాన్స్. మరి వారికి ఎంతవరకూ సినిమా నచ్చుతుందనేది చెప్పలేం. ఇంటిల్లిపాదీ డ్రాయింగ్ రూంలో కూచుని స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూసేయొచ్చు. 

చివరగా.. నానీ 25 వ సినిమా విభిన్నంగా ఉంటుంది అనుకునే ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చుతుంది. నానీ నటన కోసం సినిమా అనుకునే వారికి ఇంకా బాగా నచ్చుతుంది. నానీ సినిమాలో సాధారణంగా ఉండే అంశాలు కావాలనుకునే వారిని ఈ V ఎంత వరకూ ఆకట్టుకుంటాడో చెప్పడం కష్టమే!

Tags:    

Similar News