కొత్తదనంతో ప్రేక్షకుల మదికి మ్యాచ్ అయ్యే సినిమా..'మిస్ మ్యాచ్'

Update: 2019-12-06 09:33 GMT
Mismatch

'ఆటగదరా శివ' అనే విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన యువ హీరో ఉదయ్‌ శంకర్‌. మిస్ మ్యాచ్ అంటూ మరోసారి వెండితెర మీద మెరిసారు. 'కౌసల్యా కృష్ణమూర్తి' సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమన్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ తో జత కలిసి ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మిస్ మ్యాచ్ సినిమాతో ప్రేక్షకులకు ఎంత వరకు మ్యాచ్ అయ్యారో తెలుసుకుందాం. టిజర్, ట్రైలర్ లతో వీపరీతమైన అంచనాలను పెంచుకున్న మిస్ మ్యాచ్ ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ ఇది :

మొదటినుంచి చిత్ర యూనిట్‌ చెప్పినట్టే భిన్న ధృవాల్లాంటి ఓ జంట ప్రేమకథకు అందమైన దృశ్యరూపమే 'మిస్‌ మ్యాచ్‌'. ఏ కథలో చూసినా కులం, మతం, డబ్బు, పరువు వంటివి ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. కానీ ఈ కథలో ప్రేమకు, పెళ్లికి ఆట అడ్డుగా నిలిచింది. కుస్తీ ఆటనే ప్రాణంగా భావించే హీరోయిన్‌ కుటుంబం.. క్లాస్‌ అండ్‌ డీసెంట్‌గా ఉండే హీరో ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాల సంఘర్షణ మధ్య హీరోహీరోయిన్లు వారి ప్రేమను దక్కించుకున్నారా? దంగల్‌ బ్యాచ్‌కు పొంగల్‌ బ్యాచ్‌కు మ్యాచ్‌ ఓకే అయిందా? లేక మిస్‌ మ్యాచ్‌ అయిందా? అనేదే సినిమా కథ.

‌కుస్తీ (రెజ్లింగ్) అంటే విపరీతంగా అభిమానించే గోవింద్‌ రాజు(ప్రదీప్‌ రావత్‌) తనకు దేశానికి ఆడే అవకాశం తనకు రాకపోవడంతో తన కూతురు మహాలక్ష్మి(ఐశ్వర్యా రాజేశ్‌) ద్వారా తన కలను నెరవేర్చుకోవాలని భావిస్తాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యూయేట్‌ పట్టా అందుకొని సొంతంగా ఎమ్ఎన్‌సీ కంపెనీ ఏర్పాటు చేసుకున్న సిద్దార్థ్‌(ఉదయ్‌ శంకర్‌) అనుకోకుండా ఓ పోగ్రామ్‌లో భాగంగా మహాలక్ష్మి ని కలుసుకుంటాడు.

అలా అయిన పరిచయం వీరిద్దరి మధ్యా ప్రేమగా మారుతుంది. తమ కుటుంబాలు పెళ్లికి అంగీకరించేలా ఒప్పిస్తారు. అయితే, సిద్దార్థ్‌ తండ్రి పెళ్లి జరగాలంటే మహాలక్ష్మి కుటుంబానికి ఓ కండీషన్‌ పెడతాడు. దీనికి మహాలక్ష్మి కుటుంబం రియాక్షన్‌ ఏంటి? ఆ షరతుకు మహాలక్ష్మి ఫ్యామిలీ ఒప్పుకుందా? ఇంతకీ ఆ కండీషన్‌ ఏంటి? ఆ తర్వాత జరిగిందేంటి? సిద్దార్థ్‌ మహాలక్ష్మిల ప్రేమ గెలిచిందా? రెండు కుటుంబాలు చివరికి వీరి పెళ్లికి అంగీకరించాయా? అనేదే మిస్‌ మ్యాచ్‌ కథ.

ఎవరెలా చేశారంటే..

'ఆటగదరా శివ' తో నటుడిగా పూర్తీ మార్కులు కొట్టేసిన ఉదయ్‌ శంకర్‌ సిద్ధార్థ్‌గా మరో మెట్టు పైకెక్కేశాడు. అసలు తన పాత్రే నటించడానికి చాలా అవకాశం ఉన్న పాత్ర కావడంతో తన లుక్స్, హీరోయిజం తో విపరీతంగా అందర్నీ ఆకట్టుకున్నాడు. డ్యాన్స్‌, ఫైట్‌, ఎమోషన్‌తో నటుడిగా ఉదయ్‌ శంకర్‌ మరో స్థాయిలో కనిపించాడు. అతని నటనే సిన్మాకి పెద్ద బలం అయిందంటే అతిశయోక్తి కాదు. కథల ఎంపికలో చక్కని దారిలో ఉదయ శంకర్ నడుస్తున్నాడని చెప్పవచ్చు. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా.. కొత్తదనం ఉన్న కథనానికి పెద్ద పీట వేస్తూ రెండో సినిమాలోనే అన్ని కోణాల్లోనూ తనదైన మెరుపులు మెరిపించాడు. ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో మాదిరిగానే ఈ సినిమాల కూడా మన పక్కింటి అమ్మాయిగా కనిపిస్తుంది. క్రీడాకారిణిగా, తండ్రి ఆశయం కోసం కష్టపడే కూతురిగా, స్నేహితులతో కలిసి అల్లరి పిల్లగా, ప్రేమికురాలిగా, తన ప్రేమను దక్కించుకోవాడానికి తాపత్రయ పడే సగటు అమ్మాయిగా ఐశ్వర్యా, మహాలక్ష్మి పాత్రలో జీవించేసింది. విలన్ పాత్రల్లో కనిపించే ప్రదీప్ రావథ్ ఈ సినిమాలో విలన్‌ పాత్రలో కాకుండా హీరోయిన్‌ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. ఇక యధావిధిగా సంజయ్ స్వరూప్ హీరో తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక భద్రం, రేణుకతో పాటు హీరో ఫ్రెండ్స్‌గా నటించిన ఇద్దరు నటులు​ ఫస్టాఫ్‌లో తమ కామెడీతో అలరిస్తారు. మిగతా తారాగణం తమ తమ పాత్రల మేరకు చక్కగా ఒదిగిపోయారు.

సినిమా ఎలా ఉందంటే..

విజయ్‌ ఆంటోని హీరోగా తెరకెక్కిన 'సలీమ్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన నిర్మల్‌ కుమార్‌ 'మిస్‌ మ్యాచ్‌'తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఓ సున్నితమైన ప్రేమ కథా అంశాన్ని తీసుకొని అన్ని కమర్షియల్‌ అంశాలను జోడించి ప్రేక్షకులకు అందించడంలో డైరెక్టర్‌ తొలి ప్రయత్నంలోనే విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు. హీరోహీరోయిన్‌లతో పాటు వారి కుటుంబాల బ్యాగ్రౌండ్‌, సిద్ధార్థ్‌ మహాలక్ష్మిల ప్రేమ, ఆ తర్వాత గొడవలతో ఫస్టాఫ్‌ మొత్తం చకాచకా సాగిపోతుంది. అంతేకాకుండా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇక మొదటి భాగంలో నెక్ట్స్ ఏంటి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించేలా దర్శకుడు చాలా చక్కగా స్క్రీన్‌ ప్లేను ప్రజెంట్‌ చేశాడు. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి దర్శకుడు కాస్త తడబడినా, ఎక్కడా కూడా ప్రేమ, ఎమోషన్స్‌ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో సగటు ప్రేక్షకుడు క్లైమాక్స్‌ వరకు ఏం జరగబోతోందనే ఆసక్తిని కనబరుస్తాడు.

ఇక సెకండాఫ్‌లో వచ్చే తొలిప్రేమలోని 'ఈ మనసే..' సాంగ్‌ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లేలా ఉంది. అయితే ఈ పాటను ఏమాత్రం చెడగొట్టకుండా సంగీత దర్శకుడు గిఫ్టన్‌ ఇలియాస్ అద్భుతంగా రీమిక్స్‌ చేశాడు. ఇక మిగతా పాటలు కూడా సినిమాకు కరెక్ట్‌ యాప్ట్‌ అయ్యేలా ఉన్నాయి. సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్బ్‌గా పాటలు రాశారు రచయితలు.

మాటల రచయిత తమ ఫవర్‌ ఫుల్‌ డైలాగ్‌లతో పాటు, హార్ట్‌టచింగ్‌ మాటలను అందించి ప్రేక్షకులను కట్టిపడేశారు. 'రంగస్థలంలో చూసేవాడు, ఆడేవాడు, గెలిచేవాడు అనే ముగ్గురు మాత్రమే ఉంటారు. చివరికి గెలిచేవాడిదే సమస్తం'అంటూ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ఇక స్టంట్‌ మాస్టర్‌ శక్తి శరవణన్‌ హీరోతో చాలా స్టైలీష్‌గా ఫైట్‌ చేయించాడు. ఇక సినిమాటోగ్రఫీ ఎడిటింగ్‌ ఫర్వాలేదనిపించేస్తాయిలో ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా చక్కగా ఉన్నాయి.

చివరగా ఓ మాట.. మొత్తమ్మీద కథ..కథనాలను మ్యాచ్ చేసుకుంటూ ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్నిటినీ మ్యాచ్ చేసిన సినిమా 'మిస్ మ్యాచ్'

Tags:    

Similar News