చిత్రం: మజిలీ
నటీనటులు: నాగ చైతన్య, సమంత, దివ్యంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్ కులకర్ణి, సుహాస్, సుదర్శన్ తదితరులు
సంగీతం: గోపి సుందర్
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: హరీష్ పెద్ది, సాహు గారపటి
దర్శకత్వం: శివ నిర్వాణ
బ్యానర్: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ: 05/04/2019
ఇప్పటికే కే 'ఏం మాయ చేశావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' వంటి సినిమాలలో కలిసి నటించి తమ అద్భుతమైన కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన అక్కినేని దంపతులు నాగచైతన్య, సమంత ఇప్పుడు వెండి తెరపై కూడా భార్యాభర్తల లాగా 'మజిలీ' సినిమాలో కనిపించనున్నారు. 'నిన్ను కోరి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాని నిర్మించగా గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందాయి. అంతేకాక ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అందరికోసం ఈ సినిమా ఇవాళ అనగా ఏప్రిల్ 5 న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..
కథ:
స్కూలింగ్ పూర్తయిన తర్వాత పూర్ణ (నాగ చైతన్య) క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో ఒక సంవత్సరం పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తానని తండ్రి దగ్గర అనుమతి తీసుకుంటాడు. అప్పుడే అతనికి మీరా (దివ్యంశ కౌశిక్) పరిచయమౌతుంది. వారిద్దరి మధ్య ప్రేమ కూడా కలుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల వారు విడిపోవాల్సి వస్తుంది. పూర్ణ పెళ్లి శ్రావణి (సమంత)తో జరుగుతుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పూర్ణ కి శ్రావణి పై ప్రేమ ఉండదు. కానీ శ్రావణి కి పూర్ణ నే మాత్రం పంచప్రాణాలు. వారి వైవాహిక జీవితాన్ని ఎలాగైనా బలపరచుకోవాలని శ్రావణి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఈలోపే ఒక అనూహ్యమైన ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి? అ ట్విస్ట్ వలన పూర్ణ, శ్రావణి ల మధ్య ఏం జరుగుతుంది? చివరికి వారు తమ పెళ్లిని నిలబెట్టుకున్నారా లేదా? తెరపై చూడాల్సిందే.
నటీనటులు:
మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే నాగచైతన్య ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు అని చెప్పుకోవచ్చు. మొదటి హాఫ్ అంతా కుర్రాడిలాగా రెండవ హాఫ్ మొత్తం మరొక షేడ్ లో కనిపించిన నాగ చైతన్య తన నటనతో ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తాడు. సమంత ఈ సినిమాకి హైలైట్ గా చెప్పవచ్చు. శ్రావణి పాత్రలో చాలా చక్కగా ఒదిగి పోయింది సమంత. తన పాత్రకు ప్రాణం పోసి నటించినట్లు అర్థమవుతోంది. కొత్త అమ్మాయి అయినప్పటికీ దివ్యంశ కౌశిక్ అద్భుతమైన నటనను కనబరిచింది. నాగచైతన్యతో తన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. మొదటి హాఫ్ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. అయినప్పటికీ ఏ మాత్రం బోర్ కొట్టించకుండా చాలా చక్కగా నటించింది. ఎప్పటిలాగానే రావు రమేష్ మరియు పోసాని కృష్ణమురళి తమ పాత్రలకు న్యాయం చేశారు. సుబ్బరాజు పాత్ర చాలా బాగుంటుంది. సుహాస్, సుదర్శన్ అప్పుడప్పుడు వారి వన్ లైనర్స్ తో ప్రేక్షకులలో నవ్వుల పువ్వులు పూయిస్తారు. మిగతా నటీనటులు కూడా వారి పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను మలిచిన తీరు చాల అద్భుతంగా ఉంటుంది. ఎమోషనల్ ప్రేమ కథ అయినప్పటికీ మొదటి నుంచి ఎండింగ్ వరకూ అదే ఫ్లో తో నడిచే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బలమైన కథ ఉండటం ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ గా మారింది. ప్రతి పాత్రను శివ నిర్వాణ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో ఏమాత్రం ఎమోషన్ మిస్ అవ్వకుండా ఒక చక్కని ప్రేమ కథ తో మన ముందుకు వచ్చారు శివ నిర్వాణ. కేవలం పెళ్లి తర్వాత ప్రేమ కాన్సెప్ట్ మీద మాత్రమే కాక తండ్రి కొడుకుల సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు మరొక ఆకర్షణగా నిలుస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు బాగా సహాయపడుతుంది. మొదటి రెండు పాటలు సిట్యుయేషన్ కి తగ్గట్టుగా చాలా బాగా కుదిరాయి. తమన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టు గా చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ ను సినిమాటోగ్రాఫర్ విష్ణుశర్మ ఒక పెయింటింగ్ లాగా తీర్చిదిద్దారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సినిమాలో ఎటువంటి అక్కర్లేని సన్నివేశాలు, బలవంతంగా దూర్చిన కామెడీ ఉండకపోవడం మరొక విశేషం.
బలాలు:
నటీనటులు
బలమైన కథ
అద్భుతమైన ఎమోషన్
బలహీనతలు:
ఎమోషనల్ డోస్ ఎక్కువ అవ్వడం
చివరి మాట:
కథ బలంగా ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఒక ఆసక్తికరమైన పాయింట్తో ఈ సినిమా మొదలవుతుంది. ఫస్టాఫ్ మొత్తం నాగచైతన్య దివ్యంశ ల మధ్య ప్రేమ, రొమాన్స్ చాలా బాగా చూపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ పరవాలేదనిపించింది. ఇక సెకండాఫ్ మొత్తం సమంత తన పెర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ మొత్తం సమంత పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తన అద్భుతమైన నటన సినిమాకి హైలైట్ గా మారింది. పైగా సెకండ్ హాఫ్ లో సమంత నాగ చైతన్య ల మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. చివరిగా మజిలీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అద్భుతమైన సినిమా.
బాటమ్ లైన్:
తప్పకుండా అందరూ చేరవల్సిన 'మజిలీ'.