Narappa Movie Review: తమిళ "అసురన్" రీమేక్ గా వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప చిత్రం మంగళవారం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. విడుదలైన కాసేపటికి మంచి స్ట్రీమింగ్ తో రికార్డు సృష్టిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాత సురేష్ బాబు, తని కలై పులి సంయుక్తంగా నిర్మించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి, రావు రమేష్, నాజర్, రాజీవ్ కనకాల, కార్తీక్ రత్నం ప్రధానపాత్రల్లో నటించిగా మని శర్మ సంగీతం ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన "నారప్ప" చిత్రానికి సంబంధించిన కథ ఏంటో ఇపుడు చూద్దాం..
కథ:
రాయలసీమలోని అనంతపురంలోని ఒక గ్రామంలో నారప్ప (వెంకటేష్) తనకున్న మూడెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే అదే ఊర్లో పెద్ద కులానికి చెందిన పండుస్వామి (నరేన్) సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం కోసం నారప్ప పొలాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ నారప్ప కుటుంబం వారి పొలాన్ని పండు స్వామికి ఇవ్వడానికి ఒప్పుకోదు. ఐతే నారప్ప పొలం దగ్గర జరిగిన ఒక గొడవ వలన నారప్ప పెద్ద కొడుకు మునికన్న (కార్తీక్ రత్నం)ను పండుస్వామి కుటుంబీకులు చంపేస్తారు. నారప్ప చిన్న కొడుకు సినబ్బ (రాఖీ) తన సోదరుడి మరణం చూసి తీసుకునే పరిణామాలతో జరిగే సంఘటనలతో నారప్ప కుటుంబం గ్రామం నుండి పారిపోతారు. తన కుటుంబంను కాపాడుకునేందుకు నారప్ప చేసిన ప్రయత్నం ఏంటీ అసలు నారప్ప కుటుంబం గ్రామం నుండి పారిపోవడానికి కారణం ఏంటీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు మరియు సాంకేతిక విభాగం :
వెంకటేష్ నారప్ప పాత్రకు ప్రాణం పోశాడనే చెప్పాలి. తాను ఇదివరకు ఇటీవలే ప్రెస్ మీట్ లో చెప్పినట్టు తన పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని చేసింది ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. ఆయన కాస్ట్యూమ్స్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ నారప్ప పాత్రకు జీవం పోసినట్లుగా ఉన్నాయి. కుటుంబం కాపాడుకునే పాత్రలోని కొన్ని సన్నివేశాల్లో వెంకటేష్ అద్భుతం అనే చెప్పాలి. ఇక ప్రియమణి తన సహజ నటనతో ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా మొత్తానికి వెంకటేష్ నటన హైలైట్ అనే చెప్పాలి. నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం నటన బాగుంది. పాత్రకు తగ్గట్లుగా ఆవేశపూరిత పాత్రలో కార్తీక్ నటన బాగుంది. సినిమాలోని మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేసి సినిమా బాగా రావడానికి కష్టపడ్డరనే చెప్పాలి. ఇక సినిమా నిర్మాణ విషయంలో సురేష్ బాబు, కలై పులి ఎక్కడ వెనుకాడకుండా తమిళ అసురన్ కంటే కూడా నారప్ప సినిమాని చక్కగా నిర్మించారు. సినిమాటోగ్రఫీలో శ్యామ్ కే నాయుడు, ఎడిటింగ్ లో మార్తాండ్ వెంకటేష్ తమ పనిని అద్భుతంగా నిర్వర్తించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందు ఉంచారు. మణిశర్మ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోశాడు.
నారప్ప గురించి చివరగా :
ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చాలా కాలం తర్వాత వెంకటేష్ ని ఇలాంటి పాత్రలో చూసే ప్రేక్షకులకు "నారప్ప" సినిమా నచ్చుతుంది. ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు కలర్ ఎగేరేసుకునేలా ఈ సినిమా ఉంది. సినిమా థియేటర్స్ లో చూడలేకపోయమనే ఒక చిన్న వెలితి తప్ప సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎక్కడ నిరాశకి గురి చేయదు. నటీ నటులు అందరు సినిమా కోసం కష్టపడ్డ సినిమాకి ఆయువు పట్టు మాత్రం వెంకటేష్ అనే చెప్పాలి. వెంకటేష్ అభిమానులే కాకుండా సగటు తెలుగు ప్రేక్షకుడికి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది.