SIR Movie Review: 'సార్' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
SIR Movie Review: 'సార్' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: సార్
నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, సాయి కుమార్, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్, ఇళవరసు, రాజేంద్రన్, హరీష్ పెరాడి, ప్రవీణ తదితరులు
సంగీతం: జీ వీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: జే యువరాజ్
నిర్మాతలు: సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
విడుదల తేది: 17/02/2023
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. కొన్ని డబ్బింగ్ సినిమాల తో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ధనుష్ తాజాగా ఇప్పుడు తన కెరియర్ లోనే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తమిళ్ లో "వాతి" అనే టైటిల్ తో విడుదలైన సినిమా తెలుగులో "సార్" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఇవాళ అనగా ఫిబ్రవరి 17, 2023 న థియేటర్ల లో విడుదలైంది. ధనుష్ కూడా తెలుగులో ఈ సినిమా ని భారీగానే ప్రమోషన్లు చేశారు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరించిందో చూసేద్దామా..
కథ:
సినిమా కథ మొత్తం 1990లో బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. విద్య అనేది పెద్ద వ్యాపారంగా మారడంతో ప్రభుత్వ కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. బాలు అలియాస్ బాల గంగాధర్ తిలక్ (ధనుష్) ఒక జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సిరిపురంలో ప్రభుత్వ కళాశాల లో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగంలో చేరతాడు. పనికి వెళ్లే పిల్లలను కాలేజీకి వచ్చేలా చేసి పాటలు ఎందుకు చెప్పాడు? అసలు బాలు లక్ష్యం ఏమిటి? బాలు అనుకున్నది జరగకుండా త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడైన త్రిపాఠి సముద్ర ఖని ఏం చేశాడు? తన లక్ష్యాన్ని చేరుకోవడానికి బాలు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో తనకి బయాలజీ లెక్చరర్ మీనాక్షి (సంయుక్త) ఎలాంటి సహాయం చేసింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటులు:
ధనుష్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాలలో మాత్రమే కాక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తనదైన శైలి నటనతో ధనుష్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటారు. సంయుక్తా మీనన్ కి సినిమాలో పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ లేకపోయినాప్పటికీ తన నటనతో బాగానే అలరించింది. ధనుష్ తో సంయుక్త కెమిస్ట్రీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. సముద్ర ఖని నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తన పవర్ ఫుల్ నటనతో సముద్రఖని మంచి మార్కులు వేయించుకున్నారు. సాయికుమార్ నటన కూడా చాలా బాగుంది. మధ్య మధ్యలో వచ్చే హైపర్ ఆది కామెడీ సన్నివేశాలు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ప్రత్యేక పాత్రలో సుమంత్ కూడా బాగా నటించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
డైరెక్టర్ వెంకీ అట్లూరి సినిమా కోసం ఒక మంచి మెసేజ్ ఉన్న కథని ఎంచుకున్నారు. ఒకవైపు మంచి సందేశాని కి కమర్షియల్ ఎలిమెంట్లు కూడా జోడించి సినిమాని బాగానే తెరకెక్కించారు. ఫీస్ట్ హాఫ్ కొంచెం స్లోగా మొదలైనప్పటికీ ఇంటర్వెల్ సన్నివేశం ప్రేక్షకులకు కచ్చితంగా మంచి హై ఇస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మళ్ళీ కొంచెం స్లో అవుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కథ చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. మంచి నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. జీ వీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ జే యువరాజ్ సినిమాకి మంచి విజువల్స్ ను అందించారు. సినిమా రన్ టైం కూడా మరి ఎక్కువ కాకపోవడం బాగానే ప్లస్ అవుతుంది.
బలాలు:
సందేశం
ఇంటర్వెల్ సన్నివేశం
సంగీతం
ధనుష్ నటన
బలహీనతలు:
లవ్ ట్రాక్
స్లో నేరేషన్
ప్రెడిక్టబుల్ కథ
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు
చివరి మాట:
సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో మరియు హీరోయిన్ల మధ్య ప్రేమ కథ ఎక్కువగా ఉంటుంది. వారి మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నప్పటికీ లవ్ ట్రాక్ అంత అలరించలేదు అనే చెప్పాలి. ఇంటర్వెల్లో అసలైన కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగానే నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. అయితే చాలా వరకు కథ ప్రెడిక్టబుల్ గా అనిపించటం కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి త్రిల్లింగ్ ఎలిమెంట్లు లేకుండా కథ మొత్తం చాలా సాదాసీదా గా నడుస్తుంది. ఓవరాల్ గా "సార్" సినిమా మంచి మెసేజ్ తో పాటు కొన్ని మంచి డైలాగులు ఉన్న ప్రెడిక్టబుల్ కథ.
బాటమ్ లైన్:
ధనుష్ "సార్" కథ ప్రెడిక్టబుల్ గానే ఉన్నా, మంచి సందేశాన్ని ఇస్తుంది.