ఉపవాసం ముగిసిన వెంటనే ముస్లింలు ఖర్జూర ఎందుకు తింటారో తెలుసా.?
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నియమంగా ఉపవాసం చేస్తారనే విషయం తెలిసిందే. చంద్రోదయం అయిన తర్వాత, ఉపవాసాన్ని ముగించే సమయంలో ఖర్జూరం తినడం ఒక సంప్రదాయంగా పాటిస్తుంటారు.

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నియమంగా ఉపవాసం చేస్తారనే విషయం తెలిసిందే. చంద్రోదయం అయిన తర్వాత, ఉపవాసాన్ని ముగించే సమయంలో ఖర్జూరం తినడం ఒక సంప్రదాయంగా పాటిస్తుంటారు. ముఖ్యంగా మదీనా ప్రాంతంలో పండే అజ్వా డేట్స్‌ను ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. ఖర్జూరం తినడం వెనుక మతపరమైన విశిష్టత మాత్రమే కాదు, శరీరానికి ఉపయోగపడే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరంలో సహజమైన చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉండటంతో ఇవి త్వరగా శక్తినిస్తాయి. ఉపవాసం కారణంగా గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోకుండా వీటిని తినడం సహాయపడుతుంది. ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది జీర్ణశయాన్ని రక్షిస్తుంది. ఉపవాసం కారణంగా పొట్ట గడగడలాడకుండా సాఫీగా పనిచేసేలా చేస్తుంది. ముస్లింలు ఉపవాసం సమయంలో నీరు కూడా తాగరనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఖర్జూరాను తీసుకుంటారు. ఇందులో నీటి శాతం ఉండటంతో పాటు, దీని తర్వాత తాగే నీరు శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేస్తుంది.
ఖర్జూరాలో మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఖర్జూరంలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో పొట్టకు హాని కలిగించే అసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలను నివారిస్తుంది. ఎక్కువసేపు తినకుండా ఉండడం వల్ల అల్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక మత విశ్వాసాల్లో కూడా ఖర్జూరాకు ప్రాధాన్యత ఉంది. మహమ్మద్ ప్రవక్త కూడా ఉపవాసాన్ని ఖర్జూరంతోనే ముగించేవారని ముస్లింలు నమ్ముతారు. అందుకే ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. రంజాన్‌లో దీన్ని తినడం శరీరానికి ఆహ్లాదాన్ని అందించడమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది.