Health: నీరు తక్కువ తాగితే అనారోగ్యం.. మరి ఎక్కువ తాగితే ఏమవుతుంది.?
Health: నీరు ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో ఎన్నో జీవ క్రియలకు నీరు కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Health: నీరు తక్కువ తాగితే అనారోగ్యం.. మరి ఎక్కువ తాగితే ఏమవుతుంది.?
Health: నీరు ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో ఎన్నో జీవ క్రియలకు నీరు కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిపడ నీరు తాగకపోతే డీహైడ్రేష్ మొదలు మరెన్నో సమస్యలు వస్తాయి. అందుకే నిపుణులు రోజూ కచ్చితంగా 3 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని సూచిస్తుంటారు. అయితే నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పడంలో ఎంత నిజం ఉందో, అధికంగా తాగితే అన్నే నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నీటిని మోతాదుకు మించి తాగితే వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* నీటిని మోతాదుకు మించి తాగడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. నీరు అధికంగా తాగితే కిడ్నీలు దాన్ని ఫిల్టర్ చేయలేక, ఎక్కువ పనిని చేయాల్సి వస్తుంది. ఇది కాలక్రమంలో కిడ్నీ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
* నీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన లవణాల నిల్వలు తగ్గిపోతాయి. ఇది కండరాల నొప్పులు, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది.
* నీరు మోతాదుకు మించి తీసుకుంటే పదేపదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఈ కారనంగా శరీరంలో ఉండాల్సిన ముఖ్యమైన మినరల్స్ బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా నీరసం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.
* శరీరంలో ఎక్కువ నీరు చేరితే రక్తప్రసరణలో మార్పులు వచ్చి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఛాతిలో నొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు.
* అతిగా నీరు తాగడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యమైన పోషకాలు తేలికగా బయటికి వెళ్లిపోతాయి.
* నీరు మోతాదుకు మించి తీసుకుంటే సోడియం లెవెల్స్ తగ్గిపోవడం వల్ల శరీరంలో ముడతలు, కాళ్లకు వాపు, వికారం, వాంతులు వంటి ఇబ్బందులు రావచ్చు.
సాధారణంగా ఒక వ్యక్తి రోజు ఎంత నీరు తాగాలి.?
నీరు ఎంత తీసుకోవాలనేది ఆయా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పురుషులు రోజుకు 3 నుంచి 4 లీటర్లు, మహిళలు 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి. ఇక చెమట ఎక్కువగా వచ్చే వారు రోజు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తీసుకోవచ్చు. గర్భిణీలు, బాలింతలు రోజుకు 3.5 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలి.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక సూచనల కోసం వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.