International yoga day 2024: నేడే ఇంటర్నేషనల్ యోగా డే..ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా?
International yoga day 2024: ప్రతిఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ మనదేశంలో యోగాకు ప్రధాని మోదీ చాలా విశిష్ట స్థానాన్ని ఇచ్చారు. ఈక్రమంలోనే జూన్ 21న జమ్ముకశ్మీర్ లోనిశ్రీనగర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ పాల్గొంటారు.
International yoga day 2024: ఆరోగ్యకరమైన శరీరం,అందమైన మనస్సు కోసం, ప్రతిరోజూ యోగా సాధన చేయాలి. యోగా మనకు ప్రాణాయామం, ధ్యానం ఎలా చేయాలో నేర్పుతుంది. రోజూ యోగా చేయడం వల్ల శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే యోగాను మీ జీవితంలో భాగం చేసుకోండి. రోజూ యోగా చేయడం వల్ల శరీరం, మెదడు, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. యోగా కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు..శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్న ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ నుంచి బయటకు తీసుకువస్తుంది.
యోగా డే 2024 థీమ్ ఇదే:
ప్రతిఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడంలో భాగంగా ఒక నిర్దిష్టమైన థీమ్ ను తీసుకువస్తారు. 2024లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే థీమ్ ను తీసుకువచ్చారు. అంటే యోగా మన కోసం, మన సొసైటీ కోసం అన్న థీమ్ తో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.
యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
ఈ శతాబ్దంలో యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతిగా యోగాను ప్రతీ ఒక్కరూ సాధన చేయాలని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చని మోదీ చెప్పారు.
మోదీ కృషి ఫలితం.. అంతర్జాతీయ యోగా దినోత్సవం:
భారత ప్రధాని మోదీ నిర్విరామ కృషి కారణంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో యోగాకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. పెద్ద ఎత్తున యోగాపై అవగాహన కల్పిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం విప్లవ యుగాన్ని యోగా ప్రేరేపిస్తుందని యోగా నిపుణులు అంటున్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన చేయడం అస్సలు మరచిపోకూడదు.