రాత్రిపూట నిద్రపోకుండా రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా? ఐతే ఈ డేంజర్ తప్పదు!

Watching reels and shorts in night time: మామూలుగానే రీల్స్, షార్ట్స్ చూడటం అనేది మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుందనే అభిప్రాయం ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది.

Update: 2025-01-14 08:48 GMT

Watching reels and Shorts: రాత్రిపూట నిద్రపోకుండా రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా? ఐతే ఈ డేంజర్ తప్పదు!

Watching reels and shorts in night time: రాత్రి పూట రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా? నిద్రపోకుండా చీకట్లో గంటల తరబడి మొబైల్ చూస్తూ సమయం గడిపేస్తున్నారా? అయితే, మీ హెల్త్ డేంజర్‌లో పడినట్లే అని ఇప్పటికే ఎంతోమంది హెల్త్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా ఒక అధ్యయనం కూడా అదే నిజమని తేల్చింది. ఔను, రాత్రిపూట నిద్రపోకుండా జాగారం చేస్తూ లేట్ నైట్ వరకు రీల్స్, షార్ట్స్ చూసే వారు హైబీపీ బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఈ అధ్యయనం విషయానికొస్తే... 4,318 మంది యుక్త, నడి వయస్సు వారిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. రాత్రిపూట రీల్స్, షార్ట్స్ చూస్తూ గడిపే వారి బ్లడ్ ప్రెషర్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని పరిశీలించారు. వారంతా హైబీపీ బారినపడినట్లు తేలింది. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఇంకాస్త ఎక్కువే ఉన్నట్లు ఈ పరిశోధనలో బయటపడింది. చైనాలో జరిగిన ఈ అధ్యయనం ఫలితాన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజెన్స్ చెబుతున్నారు. ఒకసారి హైబీపీ వచ్చిందంటే ఇక జీవితాంతం బీపీని కంట్రోల్ చేసుకునేందుకు మెడిసిన్‌తో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోకతప్పదని వైద్యులు చెబుతున్నారు.

మామూలుగానే రీల్స్, షార్ట్స్ చూడటం అనేది మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుందనే అభిప్రాయం ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది. ఏ లక్ష్యం లేని వారే ఇలా ప్రతీరోజూ గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటుంటారు అని సోషల్ మీడియా వేదికగా చాలామంది మేధావులు తమ అభిప్రాయాలను వినిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

చాలా గంటలపాటు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు దెబ్బ తినడం, గుండె సంబంధిత జబ్బులకు దారితీస్తోందని ఆరోగ్య నిపుణులు ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఈ అలవాటు కొత్తగా హై బీపీని కూడా మోసుకొస్తోందంటే ఇక ఏం చేయాలో సోషల్ మీడియా యూజర్స్ ఆలోచించుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి నివేదికను బీఎంసీ పబ్లిక్ హెల్త్ అనే సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. బెంగుళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డా. దీపక్ కృష్ణమూర్తి ఆ డీటేయిల్స్‌ను నెటిజెన్స్‌తో పంచుకుంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి అలవాట్ల వల్ల టైమ్ వేస్ట్ చేసుకోవడం, లక్ష్యంపై ఏకాగ్రత కోల్పోవడంతో పాటు ఇలా హై బీపీ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఈ సర్వేలో తేలిందన్నారు. అందుకే ఇక ఆ సోషల్ మీడియా యాప్స్‌ను మీ మొబైల్స్‌లోంచి అన్‌ఇన్‌స్టాల్ చేసే సమయం వచ్చిందని డా దీపక్ కృష్ణమూర్తి సూచించారు.

రాత్రి పూట నిద్రపోకుండా రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలు చూస్తుండటం వల్ల అది క్రమక్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది. లేట్ నైట్ పడుకోవడం అలవాటుగా మారితే... ఆ తరువాత మీరు ఫోన్ పక్కనపెట్టి సమయానికి పడుకున్నా మీకు నిద్ర రాని దుస్థితి ఏర్పడుతుంది. ఈ నిద్రలేమి మీరు పగటి పూట చేసే పనుల్లో ఏకాగ్రత లేకుండా చేస్తుంది. అంతేకాకుండా గుండెపోటుకు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇకపై రాత్రిపూట టైమ్‌కు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. లేదంటే ఇలాంటి అనారోగ్య సమస్యలు తప్పవు అనేది నిపుణుల మాట. 

Tags:    

Similar News