Vaikuntha Ekadashi Fasting: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసా?
Vaikuntha Ekadashi Fasting: ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశికి ప్రత్యేక ఉపవాసం వల్లనే వస్తుంది. శాస్త్రం ప్రకారం ఏకాదశి రోజు భోజనం చేయడం నిషిద్ధం. ప్రతి ఒక్కరూ ఏకాదశి ఉపవాసం ఉండాలని కోరుకుంటారు. కానీ అసలు ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి? ఏకాదశి ఉపవాసం వెనుక ఏదైనా రహస్యం ఉందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య రీత్యా నెలకు రెండు సార్లు ఉపవాసం ఉండడం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే ఏకాదశి ఉపవాసం వెనక ఓ ఆసక్తికరమైన పౌరాణిక గాథ కూడా ఉంది.
భవిష్య పురాణం ప్రకారం సత్య యోగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. ముర బ్రహ్మ దేవుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దీంతో ఆయన అనేక శక్తులను పొందుతాడు. వర ప్రభావంతో అత్యంత శక్తివంతుడైన ముర.. అమాయక ప్రజలను, విష్ణుభక్తులను, ఋషులను, దేవతలను హింసించాడు.
ముర పెట్టే బాధలు భరించలేక ఋషులు, దేవతలు శ్రీహరిని ప్రార్థిస్తారు. శ్రీహరి మురతో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో శ్రీహరి తీవ్రంగా అలసిపోయి విశ్రాంతి తీసుకునేందుకు ఓ గుహలో విశ్రమిస్తాడు. విష్ణు విశ్రాంతి తీసుకునే సమయంలో అదే అదునుగా భావించిన ముర శ్రీహరిని సంహరించబోతాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు శరీరం నుంచి మహా తేజస్సుతో కూడిన యోగమయా అనే కన్య ఉద్భవించి మురా రాక్షసుడిని సంహరిస్తుంది.
శ్రీహరి శరీరం నుంచి ఉద్భవించిన కన్యపక్షంలో 11వ రోజు ఉద్భవించింది. కాబట్టి ఆమెకు శ్రీమహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేశాడు. ఆమెకు ఒక వరం కూడా ఇచ్చాడు. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు పాపాల వి నుంచి ముక్తి పొంది విష్ణు సాయుజ్యాన్ని పొందుతారని.. శ్రీమహావిష్ణువు వరం ఇచ్చాడు. అప్పటినుంచి ప్రజలు ఏకాదశి ఉపవాసం ద్వారా తమ పాపాలను తొలగించుకొని ముక్తులవుతున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఈ విధంగా మానవులు ఏకాదశి ఉపవాసం చేసి పాపాలను తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు ఆవేదనతో శ్రీహరిని ఆశ్రయిస్తాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు పాపపురుషునితో ఏకాదశి రాత్రి చంద్రోదయవేళ జరిగే మూడు గ్రహాల కలయిక సమయంలో ఎవరైతే భోజనం చేస్తారో నీవు వారిని ఆశ్రయించు అని చెప్తూ ఇంకా ఇలా చెబుతాడు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా చంద్రోదయానికి ముందు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకొని హరినామ స్మరణతో ఉపవాసానికి కొనస్తే వారికి ఏకాదశి వ్రత పుణ్యఫలం పూర్తిగా దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి ఉపవాసం వెనక ఉన్న పౌరాణిక గాథ ఇదే. ఏకాదశి వ్రతం చేసేవారు ఈకథను తెలుసుకుంటే మంచిది.
గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, పలు శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే అందించినవి. వీటిలో అన్నింటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చునే విషయాన్ని గమనించాలి. మీరు పాటించాలా లేదా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అంశం మాత్రమే