HMPV Virus Outbreak: మాస్క్ పెట్టుకోండి, చేతులు కడుక్కోండి, షేక్ హ్యాండ్స్ మానేయండి
Human Metapneumovirus (HMPV) వైరస్ చైనాలో వేగంగా విస్తరిస్తోంది. మరో కరోనా మహమ్మారిలా విజృంభిస్తున్న ఈ వైరస్‌ను చూసి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, దీని ప్రభావం భారత్‌లో ఉంటుందా అన్నది ఇప్పటివరకైతే తెలియదు. ఏది ఏమైనా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ (NCDC), తెలంగాణ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేశాయి.
ఇది శ్వాస సమస్యలకు సంబంధించిన వైరస్ అని, ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపించే ఈ వైరస్ ముఖ్యంగా చలికాలం దాడి చేసే ప్రమాదం ఉందని ఈ సంస్థలు వివరించాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించాయి. అయితే, తెలంగాణలో HMPV వైరస్ కేసులు ఏవీ లేవని తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది ఇదే సీజన్‌లో రిపోర్ట్ అయిన శ్వాసకోశ వ్యాధులతో పోల్చితే, ఈ ఏడాది కేసుల సంఖ్య పెద్దగా ఏమీ పెరగలేదని కూడా అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కూడా చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను కోరింది. ఈ వైరస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, వ్యాధి నివారణకు జాగ్రత్తలుపాటించాలని అధికారులు సూచించారు.
ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
వైరస్ నివారణకు ఏం చేయాలి?
- దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కును కర్చీఫ్‌తో కవర్ చేసుకోవాలి.
- చేతులను తరచూ సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
- జనం ఎక్కువగా ఉన్న చోట ఉండవద్దు. ఫ్లూ సోకిన వారికి రెండు మూడు అడుగుల దూరంలో ఉండాలి.
- జ్వరం వస్తే బయటకు రావద్దు. దగ్గు, తుమ్ములు అదే పనిగా వస్తున్నా ఇంటిపట్టునే ఉండాలి.
- మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి, పోషకాలు ఉన్న ఆహారం తినాలి.
- గాలి, వెలుతురు ధారాళంగా ఉన్న గదిలో ఉండాలి.
ఏం చేయకూడదు?
- షేక్ హ్యాండ్స్ మానేయాలి.
- టిష్యూ పేపర్స్, కర్చీఫ్‌లను రెండోసారి ఉపయోగించకూడదు.
- జబ్బు చేసిన వారికి దూరంగా ఉండాలి.
- కళ్ళు, ముక్కు, నోరును తరచూ చేతులతో తాకకూడదు.
- పబ్లిక్ ప్లేసెస్‌లో ఉమ్మి వేయకూడదు.
- అనారోగ్యంగా అనిపించినప్పుడు డాక్టర్‌ను కలవాలి. సొంత వైద్యం చేసుకోవద్దు.