Lifestyle: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? లివర్ ప్రమాదంలో పడుతున్నట్లే!!
Early symptoms of Liver damage: శరీరంలో కీలక పాత్ర పోషించే అవయవాల్లో లివర్ ఒకటి.
Early symptoms of Liver damage: శరీరంలో కీలక పాత్ర పోషించే అవయవాల్లో లివర్ ఒకటి. శరీరంలో అన్ని చర్యలు సక్రమంగా జరగాలంటే లివర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీసుకున్న ఆహారం జీర్ణంకావాలన్నా, శరీంలో వ్యర్థాలు బయటకు పోవాలన్నా లివర్ పనితీరు మెరుగ్గా ఉండాలి. అలాంటి లివర్ పనితీరులో ఏమైనా తేడా వస్తే శరీరంపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.
అందుకే లివర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. ముందుగానే లివర్ ఆరోగ్యాన్ని అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇటీవల ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు మొదలు, మారిన జీవన విధానం కారణంగా ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా లివర్ ఆరోగ్యాన్ని పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పడు తెలుసుకుందాం.
* లివర్ పనితీరులో ఏమైనా తేడా వస్తే కనిపించే మొదటి లక్షణాల్లో చర్మ రంగులో మార్పు రావడం. లివర్ డ్యామేజ్ అయినప్పుడు లివర్‌లో కొవ్వు పేరుకుపోయి చర్మం మెరిసినట్లు కనిపిస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లని కారణంగా చర్మం అలా కనిపిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నా. చర్మంపై దద్దురు కనిపిస్తున్నట్లయితే... ఒకసారి లివర్ పనితీరును పరిశీలించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
* శరీరంలో కాలేయ పనితీరు దెబ్బ తింటే నీరు చేరుతుంది. శరీరంలో అవయవాల్లో నీరు చేరడం వల్ల ఉబ్బినట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా కాళ్లలో, పాదాల్లో వాపులు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి లివర్ టెస్ట్ చేయించుకోవాలి.
* కళ్లు పసుపు రంగులోకి మారినా, చర్మం పసుపు రంగులోకి మారినా పచ్చ కామెర్లుగా భావించాలి. లివర్ డ్యామేజ్ అయిన వారిలో పచ్చ కామెర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* లివర్‌లో ఏదైనా ఇబ్బంది తలెత్తితే గోళ్ల మీద తెలుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. లేదా గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఏ పని చేయకపోయినా త్వరగా అలసిపోతున్నా లివర్ పనితీరులో ఏదో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.