Lifestyle: శరీరంలో ఈ లక్షణాలా? కొవ్వు పెరుగుతున్నట్లే

Update: 2025-01-06 15:45 GMT

Lifestyle: రోజురోజుకీ జీవన విధానం మారుతోంది. మారిన జీవన విధానంతో పాటు తీసుకుంటున్న ఆహారంలో మార్పులు వస్తున్నాయి. శారీరక శ్రమ పూర్తిగా తగ్గడంతో కొలెస్ట్రాల్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరగడం ఇటీవల యువతలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే సిరలలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే శరీరంలో కొవ్వు పెరిగితే కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? ఏ సమయంలో వైద్యులను సంప్రదించాలి? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే ప్రధాన లక్షణాల్లో పాదాలలో తిమ్మిరి ఒకటి. పాదాలు మొద్దు బారినట్లు అనిపిస్తుంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతంగా భావించాలి. కొలెస్ట్రాల్‌ పెరిగితే ధమనుల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడానికి కారణమవుతుంది. దీంతో పాదాల్లో నొప్పి, తిమ్మిరి, జలదరింపు వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్తపోటు సమస్య వస్తుంది. రక్తంలో కొవ్వు ఎంత పెరిగితే రక్తపోటు అంత ఎక్కువగా పెరుగుతుంది. రక్త నాళాల్లో రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడితే అది బీపికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు బీపీ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

* శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ స్థాయి పెరిగితే గోర్ల రంగులో మార్పు కనిపిస్తుంది. ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల చేతి వేళ్లు, కాలి వేళ్లకు సరిగ్గా రక్తం సరఫరా అందదు. దీంతో గోర్లు లేత గులాబీ నుంచి పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పేందుకు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.

Tags:    

Similar News