Resolutions for New Year 2025: ఈ ఏడాది లక్షల రూపాయలు సేవ్ చేసే రిజల్యూషన్స్
How to save money in 2025, Resolutions to save money in 2025: కొత్త ఏడాదిలో కొత్త రిజల్యూషన్స్ తీసుకోవడం చాలామందికి ఓ అలవాటు. అందులో సేవింగ్స్ కూడా ఒకటి. ఈ రిజల్యూషన్స్ తీసుకుని, వాటిని సరిగ్గా అమలు చేస్తే.. మీరు లక్షల రూపాయలు ఆదా చేసినట్లే
Best Resolutions to save money in New Year 2025: కొత్త ఏడాదిలో కొత్త రిజల్యూషన్స్ తీసుకోవడం చాలామందికి ఓ అలవాటు. అందులో సేవింగ్స్ కూడా ఒకటి. డబ్బును పొదుపు చేసుకునేందుకు ఏ పథకంలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని లెక్కలేస్తుంటారు. ఏం చేస్తే ఈ ఏడాది డబ్బు రెట్టింపవుతుందని తలలు పట్టుకుంటుంటారు. అందుకే లక్షల రూపాయలు సేవ్ చేసే సింపుల్ రిజల్యూషన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ కింది వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓ లుక్కేయాల్సిందే.
క్రమం తప్పకుండా వ్యాయామం
ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. ప్రతీ రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు. వ్యాయామంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరే షాక్ అవుతారు. ప్రతీ రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి. కొలెస్ట్రాల్ కరిగి అధిక బరువు తగ్గుతారు. బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి.
చాలామంది వ్యాయామం అనగానే జిమ్‌కు వెళ్లడం, ఎక్సర్‌సైజ్ మెటీరియల్ కొనడం, రన్నింగ్ కోసం గ్రౌండ్ కు వెళ్లడం... ఇలా చాలా లెక్కలేసుకుంటారు. అబ్బో ఇదంతా మన వల్ల కాని పనిలే అని ఏమీ చేయకుండానే లైట్ తీసుకుంటుంటారు. కానీ అవేమీ లేకుండా రోజుకు 30 నిమిషాలు వేగంగా నడిచినా చాలు... మీరు, మీ ఆరోగ్యం పర్‌ఫెక్ట్ అవుతుందంటున్నారు కార్డియాలజీ ఎక్స్‌పర్ట్స్.
నో జంక్ ఫుడ్ - ఓన్లీ హెల్తీ డైట్
ఎన్ని వ్యాయామాలు చేసినా... ఆ తరువాత జంక్ ఫుడ్ తింటే మీరు పడిన శ్రమ అంతా వృధానే అవుతుందనే విషయం మర్చిపోవద్దు. అందుకే ఆయిల్‌లో వేపిన ఫుడ్స్, తీపి వంటకాలు, ఉప్పు వినియోగం బాగా తగ్గించాలి. వీటికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. జంక్ ఫుడ్స్ నోటికి రుచిస్తాయి కానీ గుండెను గునపంలా గుచ్చుతుంటాయనే విషయం మర్చిపోవద్దు. జంక్ ఫుడ్ తినడం మానేసి మంచి పౌష్టికాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు తినే మంచి ఆహారం మీ నోటికి, పొట్టకు మాత్రమే కాదు... మీ గుండెకు, అంతకంటే విలువైన మీ ప్రాణానికి మేలు చేస్తాయి.
దురలవాట్లను దూరం పెట్టండి
సిగరెట్ అనే 3 అంగుళాల మెత్తటి పదార్థం 6 అడుగుల మనిషి ప్రాణాన్నయినా హరిస్తుంది. సిగరెట్, ఆల్కహాల్, గుట్కా లాంటివి స్లో పాయిజన్ లాంటివి. ఇవి తీసుకోవడం అంటే ఇంకొన్నాళ్ల తరువాత చనిపోయేందుకు ఇప్పటి నుండే సూసైడ్ ప్లాన్ చేసుకోడం అవుతుందన్నమాట. అదెలానో చెబుతా వినండి. సిగరెట్ తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ పెరుగుతుంది. గుండెకు దారితీసే నాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఊపిరితిత్తులు బొగ్గుబావుల్లా తయారవుతాయి. క్రమక్రమంగా హార్ట్ ఎటాక్ లేదా లంగ్స్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది.
మితిమీరిన ఆల్కహాల్ లివర్ పనితీరును దెబ్బతీస్తుంది. సిగరెట్, గుట్కా లాంటివి క్యాన్సర్ కారకాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ప్యాకెట్లపైనే పెద్దపెద్ద అక్షరాలతో బొమ్మలేసి మరీ హెచ్చరిస్తున్నారు. అందుకే ఆరడుగుల ఆజానుబాహుడైనా వీటి ముందు హరీమనాల్సిందే. మరో బాధాకరమైన విషయం ఏంటంటే... బతికినంత కాలం వీటికోసం ఖర్చుపెడతారు. పోయే ముందు ఆస్పత్రులకు లక్షలు తగలేస్తారు. ఈ దురలవాట్లను ఎంత దూరం పెడితే మీ లైఫ్ స్టైల్ అంత గొప్పగా ఉంటుంది.
పైసా ఖర్చు లేని 'ఎమోషనల్ హెల్త్' చాలా ముఖ్యం
ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తయితే... ఇప్పుడు చెప్పుకోబోయేది ఒక ఎత్తు. మనిషికి శారీరక ఆరోగ్యం, హెల్తీ డైట్ ఎంత ముఖ్యమూ మానసికంగా ఏ ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఒత్తిళ్ల వల్ల బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్... ఇలా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఒత్తిళ్లకు దూరంగా ప్రతీరోజూ మీ కుటుంబంతో, బందుమిత్రులతో వీలైనంత సరదాగా సమయం గడపడం అలవాటు చేసుకోండి. అది మిమ్మల్ని హార్ట్ ఎటాక్‌కు దూరం పెడుతుంది. ఇది నిపుణులు చెబుతున్న మాట మాత్రమే కాదు... సర్వేలు కూడా అదే నిజమంటున్నాయి.
ఇదే విషయమై వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మీ ఆఫీస్ వర్క్ మీ జీవిత అవసరాలను తీరుస్తుంది. కానీ మీ పర్సనల్ లైఫ్ మీ జీవితాన్నే నిలబెడుతుంది. ఈ రెండింటి బ్యాలెన్స్ చేసుకుంటేనే అసలైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అనే విషయం మర్చిపోవద్దు.
కంటి నిండా నిద్ర
కంటి నిండా నిద్రపోతేనే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. కంటి నిండ నిద్రలేకపోతే అది అనేక అనారోగ్య సమస్యలను మోసుకొస్తుంది. క్రమక్రమంగా అది మానసిక ఒత్తిడిగా మారి గుండెపోటుకు దారితీస్తుంది.
హెల్త్ చెకప్
చాలామంది ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చాకే ఆస్పత్రులకు పరుగులు తీస్తుంటారు. కానీ కొన్నిసార్లు అప్పటికే కొన్ని జబ్బులు ముదిరిపోతాయి. వాటిని నయం చేసుకునేందుకు ఆ తరువాత భారీగానే చిలుం వదిలించుకోవాల్సి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటే అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
ఈపాటికే మీకు విషయం అర్థమైపోయుంటుంది. ... ఆరోగ్యమే మహా భాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకుంటే లక్షలు, కోట్ల రూపాయలు కాపాడుకున్నట్లే. డబ్బు సంపాదించడమంటే కేవలం చేతిలోకి డబ్బులు రావడమే కాదు... చేతిలోంచి అనవసరంగా డబ్బు వెళ్లకుండా చూసుకోవడం కూడా ఆదా కిందకే వస్తుందనేది ఆర్థిక నిపుణులు ఇచ్చే సలహా. లేదంటే ఒక్కోసారి ఒక్కసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా... జీవితాంతం కష్టపడినదానికంటే ఎక్కువే ఆస్పత్రిలో బిల్లు కట్టాల్సి వస్తుంది. ఈ రిజల్యూషన్స్ తీసుకుని, వాటిని సరిగ్గా అమలు చేస్తే.. మీరు లక్షల రూపాయలు ఆదా చేసినట్లే కదా!! మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.