Lifestyle: వాయుకాలుష్యంతో రక్తం గడ్డలు కట్టే ముప్పు.. పరిశోధనల్లో షాకింగ్ న్యూస్

Update: 2024-12-30 13:15 GMT

Air Pollution may leads to blood clotting in skin : ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోన్న అంశాల్లో వాయు కాలుష్యం ఒకటి. ప్రపంచీకరణ నేపథ్యంలో రోజురోజుకీ వాయు కాలుష్యం పెరుగుతోంది. పట్టణీకరణ వేగంగా అభివృద్ధి చెందడం, వాహనాలు, పరిశ్రమల ఏర్పాటుతో నిత్యం కోట్లాది మంది ప్రజలు వాయుకాలుష్యంతో సావాసం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా భారత్‌లో వాయు కాలుష్యం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారంటేనే పరిస్థితులు ఎంతలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే వాయు కాలుష్యం కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా తెలిసిందే. వాయు కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు మొదలు, చర్మ సమస్యల వరకు వస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనల్లో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురైన వారిలో చర్మం కింద లోతుల్లో ఉండే సిర (డీప్‌ వీన్స్‌)ల్లో రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు 39% నుంచి 100% పెరుగుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. అమెరికాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా పరిశోధకులు ఆరు ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాల్లో నివసించే 6,650కి పైగా మందిని 17 ఏళ్ల పాటు నిశితంగా గమనించి ఈ వివరాలను వెల్లడించారు.

వీరిలో 3.7% మందికి లోపలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడినట్లు వెల్లడైంది. వాయుకాలుష్యం కారణంగా నుసి పదార్థం (పీఎం2.5) ప్రభావంతో రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు 39% ఎక్కువవుతుండగా.. నైట్రోజన్‌ ఆక్సైడ్లు, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ ప్రభావంతో 120 నుంచి 174% ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఈ గడ్డలకు త్వరగా చికిత్స తీసుకోకపోతే రక్త ప్రసరణకు ఆంటకం ఏర్పడుతుందని అంటున్నారు.

వాయుకాలుష్యానికి ఎక్కువ రోజులు గురైన వారి శరీరంలో వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతున్నట్టు, ఇది రక్తం గడ్డలకు దారితీస్తున్నట్టు ఇప్పటికే నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. ఇది కాలక్రమేణ గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు దారితీస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. వాయు కాలుష్యంతో సిరల్లో రక్తం గడ్డ కడుతున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News