Women gets more stress compared to men: ఒత్తిడి.. ఓ రెండు, మూడు దశాబ్దాల క్రితం ఇలాంటి ఆరోగ్య సమస్య వస్తుందని చాలా మంది ఊహించి కూడా ఉండరు. అయితే ఇప్పుడు ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. రోజురోజుకీ ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, శారీరక శ్రమ పెరగడం ఒత్తిడితో కూడుకున్న జీవితం... ఇలా కారణం ఏదైనా మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అయితే ఈ విషయంలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా బాధితులుగా మారుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పురుషులతో పోల్చితే మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం వంటి పనులతో పురుషుల్లోనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి మాత్రం ఇది మహిళల్లోనే అధికమని అధ్యయనంలో తేలింది. ఎమోషనల్ వెల్నెస్ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
పనితో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో మగవారి కంటే మహిళలే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని ఈ సర్వేలో తేలింది. అధ్యయనంలో భాగంగా సుమారు 5000 మందిని పరిగణలోకి తీసుకున్న పరిశోధకులు వారిని నిశితంగా గమనించారు. వీరిలో దాదాపు 72.2శాతం మహిళలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించారు. పురుషులలో 53 పాయింట్ 64శాతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పరిశోధనల్లో తేలింది.
ఇక ఇంతకీ ఒత్తిడికి కారణం ఏంటన్న విషయం గురించి లోతుగా విశ్లేషిస్తే.. ఉద్యోగం చేస్తున్న స్త్రీ పురుషులను పోల్చినప్పుడు పురుషులు కేవలం ఉద్యోగపరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటి పనులు కుటుంబ బాధ్యతల విషయంలో తక్కువ ఫోకస్ చేస్తున్నారని తేలింది. అదే మహిళలు అటు వృత్తితో పాటు ఇటు కుటుంబ బాధ్యతలను సమానంగా పూర్తి చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ కారణంగానే మహిళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పనికి తగిన గుర్తింపు లేకపోవడం వర్క్ ప్లేస్ లో అభద్రతా భావం వంటివి కూడా 20 శాతం మంది మహిళల్లో మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయని నిపుణులు తెలిపారు.