Eating curd in night times during winter season: కచ్చితంగా ప్రతీ ఒక్కరి ఇంట్లో పెరుగు ఉంటుంది. తోడు వేసుకోవడం లేదా పెరుగు ప్యాకెట్స్ కొనుక్కోవడం ఏదైనా భోజనం మొత్తం చేసిన తర్వాత చివరిలో ఒక ముద్ద పెరుగుతో తింటేనే భోజనం సంపూర్ణమైందన్న భావన ఉంటుంది. పెరుగుతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు అజీర్తి, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తాయి. అయితే చలికాలంలో పెరుగు తీసుకోవాలా వద్దా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇంతకీ చలికాలం పెరుగు తినొచ్చా? తింటే ఏ సమయంలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అజీర్తి సమస్యలున్న వారు రాత్రి పూట పెరుగు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెరుగులో కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట పెరుగు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే తరచూ జలుబు, దగ్గుతో బాధపడేవారు కూడా రాత్రి పూట పెరుగు తినకూడదని నిపుణులు (Whom to avoid curd in nights) సూచిస్తున్నారు.
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా పెరుగుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అందుకే రాత్రితో పోల్చితే ఉదయమే పెరుగు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు గడ్డ పెరుగు తినకూడదు. అయితే బక్కగా ఉన్న వారు, బరువు పెరగాలనుకునే (Weight gain) వారు మాత్రం రాత్రి పెరుగు తీసుకుంటే మంచిదని అంటున్నారు. ఇక కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగును తింటే ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు.
పెరుగు తింటే జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు పెరుగును మధ్యాహ్నం తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు (What is the right time to eat curd in winter season) సూచిస్తున్నారు.