BP Tablets: బీపీ మందులు ఎక్కువగా వేసుకుంటున్నారా.? ఏమవుతుందంటే..
BP Tablets: ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో బీపీ ఒకటి. అధిక రక్తపోటు కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
BP Tablets: ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో బీపీ ఒకటి. అధిక రక్తపోటు కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా రక్తపోటు సాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తోంది.
ఒక్కసారి హైబీపీ బారిన పడ్డారంటే అంతే సంగతులు కచ్చితంగా ప్రతీ రోజూ బీపీ ట్యాబ్లెట్ వేయాల్సిందే. ఎప్పుడూ జేబులో ట్యాబ్లెట్స్ పెట్టుకుని ఉండే వారు ఎంతో మంది ఉన్నారు. అయితే బీపీ ట్యాబ్లెట్స్‌ను అధికంగా వాడే వారికి ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా బీపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే జరిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీ మందులను ఎక్కువగా ఉపయోగిస్తే.. మూత్రపిండాలు, కాలేయం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ (IPC) తెలిపింది. బీపీ ట్యాబ్లెట్స్‌ను అధికంగా వాడే వారిలో తక్కువ పొటాషియం స్థాయిలను కలిగిస్తాయని చెబుతున్నారు. దీనిని హైపోకలేమియాగా నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా హైపోకలేమియా సమస్య.. క్రమరహిత గుండె స్పందన, ఆకస్మిక దడ, ఇతర ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీటా-బ్లాకర్స్ మందులు తీసుకునేటప్పుడు వృద్ధులు, మూత్ర సంబంధిత సమస్యలు ఉన్న రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బీటా బ్లాకర్స్ మందులను బీపీకి తొలి ప్రాధాన్యతగా ఉపయోగించకూడదని సూచిస్తున్నారు.
ఐపీసీ అధ్యయనంపై వైద్యులు ఈ విషయమై మాట్లాడుతూ.. రక్తపోటుతో బాధపడేవారు భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. బీటా బ్లాకర్స్ తీసుకునే వ్యక్తుల్లో పొటాషియం లెవల్స్ తగ్గడం చాలా అరుదుగా కనిపించే అంశమని చెబుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.