Breast Infection : డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందని భయమా..అయితే ఈ టిప్స్ మీ కోసం..!

Breast Infection : డెలివరీ తర్వాత కొంతమంది మహిళల్లో బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రసవం తర్వాత బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Update: 2024-06-22 02:30 GMT

Breast Infection : డెలివరీ తర్వాత మహిళల్లో చాలా మార్పులు కనిపిస్తాయి. ప్రసవం తర్వాత మహిళలు తమ ఆరోగ్యంతోపాటు, నవజాత శిశువు ఆరోగ్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ సమయంలో వారికి బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనిని మాస్టిటిస్ అంటారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇందులో బ్యాక్టీరియా రొమ్ము కణజాలంలోకి ప్రవేశిస్తుంది. దీంతో రొమ్ములో వాపు, చికాకు, నొప్పి లేదా చీము వస్తుంది. పాలిచ్చే చాలా మంది తల్లులకు ఈ మాస్టిటిస్ వచ్చే ప్రమాదం ఉంది. దాని లక్షణాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటే డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ బారినుంచి బయటపడవచ్చు. ప్రసవం తర్వాత బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

తల్లిపాలు ఇచ్చే సమయంలో పరిశుభ్రత ముఖ్యం:

డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే, తల్లి పాలివ్వడంలో పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. శిశువుకు పాలిచ్చే ముందు చేతులు కడుక్కోవాలి. ఇది చనుమొనలో బ్యాక్టీరియా సంక్రమణకు గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. రొమ్ములను ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచండి. బిడ్డకు పాలిచ్చిన వెంటనే రొమ్మును కప్పివేయకూడదు. కొంత సమయం పాటు గాలిలో ఆరనివ్వాలి. ఎందుకంటే తేమ బ్యాక్టీరియా సంభావ్యతను పెంచుతుంది. తేమను నివారించడానికి మీరు బ్రెస్ట్ ప్యాడ్లను ఉపయోగించవచ్చు.

ఒక రొమ్ము పాలు పూర్తిగా ఇవ్వాలి:

రొమ్ము ఇన్ఫెక్షన్ తగ్గించడానికి..బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు ఒక రొమ్ము పాలు పూర్తిగా ఇవ్వాలి. ఇలా చేస్తే రొమ్ములో ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఇన్ఫెక్షన్, ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రసాయనాల ఉత్పత్తులకు దూరంగా:

చాలా మంది తల్లులు..బిడ్డకు పాలిచ్చే ముందు రొమ్ములను సబ్బు లేదా ఇతర రసాయన ఆధారిత ఉత్పత్తులతో శుభ్రం చేస్తారు. ఇలా చేయకూడదని చెబుతున్నారు గైనకాలజిస్టులు. రసాయనాలు చనుమొన ఇన్ఫెక్షన్ ను పెంచుతుంది. ఎందుకంటే డెలివరీ తర్వాత రొమ్ములు సున్నితంగా మారుతాయి.

వాపును నివారిస్తాయి :

మీ బిడ్డ సరైన సమయంలో పాలు తాగకపోతే..పాలు రొమ్ములో నిల్వ అవుతాయి. ఇది రొమ్ముపై ఒత్తిడి కలగడంతో వాపునకు దారితీస్తుంది. దీన్ని నివారించాలంటే ప్రతి అరగంటకోసారి బిడ్డకు పాలివ్వాలి. తల్లిపాలు ఇచ్చే ముందు మీ రొమ్ములను తేలికగా మసాజ్ చేయాలి.

హైడ్రేటెడ్ గా ఉండంటం:

తల్లి పాలివ్వడంలో మహిళలకు అదనపు జాగ్రత్తలు అవసరం. శరీరంలో నీటి కొరత కారణంగా వారి ఛాతీలో గడ్డలు, వాపు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే తగిన మొత్తంలో నీరు లేదా ద్రవాలు తీసుకోవాలి.

Tags:    

Similar News