
ఫిల్టర్ వాటర్ తాగిన మహిళ లివర్ డ్యామేజ్... పొరపాటు ఎక్కడ జరిగిందంటే..
Drinking water from purifier: ఐదేళ్లుగా ఫిల్టర్ నీళ్లు తాగుతున్న ఒక మహిళ అనారోగ్య సమస్యల బారినపడ్డారు. 6 నెలలుగా సమయానికి పీరియడ్స్ రాకపోవడం, లివర్ దెబ్బతినడం, తరచుగా వాంతులు, విరేచనాలు అవడం వంటి సమస్యలు ఎదుర్కున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన వార్తా కథనం ప్రకారం షాంఘాయ్‌కు చెందిన లి అనే మహిళకు ఎదురైన ఈ చేదు అనుభవానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2020 సెప్టెంబర్‌లో ఆమె షావోమి నుండి వాటర్ ప్యూరిఫయర్ కొన్నారు. కంపెనీ టెక్నీషియన్ వచ్చి ప్యూరిఫయర్ ఇన్‌స్టాల్ చేసి వెళ్లారు. గత ఐదేళ్లుగా ఆ ప్యూరిఫయర్ నీళ్లు తాగుతున్న ఆమె తరచుగా అనారోగ్యం బారిన పడుతూ వస్తున్నారు. ఇటీవల ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆమె కాలేయం దెబ్బతిన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
ఇటీవలే ఆమె తను తాగే నీరు ఏ మేరకు శుద్ధి అవుతున్నాయో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం వాటర్ క్వాలిటీ పెన్ ( Water quality pen to test TDS ) కొన్నారు. ప్యూరిఫయర్ మెషిన్‌ను విక్రయించిన షావోమి కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం ప్యూరిఫయర్ నుండి వచ్చే నీటిలో టీడీఎస్ (Total dissolved solids) 24 mg/L మోతాదులో ఉండాలి. వాటర్ క్వాలిటీ పెన్‌తో ఆ నీటిని పరీక్షించగా, అందులో 607 mg/L టీడీఎస్ ఉన్నట్లు తేలింది. అంటే కంపెనీ చెప్పినదానికన్నా 25 రెట్లు టీడీఎస్ అధికంగా ఉంది. ఆ ప్రాంతంలోని నల్లా నీటిలో 321 mg/L టీడీఎస్ ఉంది. అంటే, నల్లా నీటి కంటే కూడా ప్యూరిఫయర్ నీరు రెండు రెట్లు డేంజర్‌గా ఉన్నాయన్న మాట.
ఇదే విషయమై మరింత లోతుగా పరిశీలించగా అప్పుడు అసలు విషయం బయటపడింది. సాధారణంగా ప్యూరిఫయర్ ఇన్ స్టాల్ చేసేటప్పుడు ఫిల్టర్ చేసిన వాటర్ ట్యాంకులోకి వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. ఫిల్టర్ చేయగా మిగిలిని వృధా నీటిని సింకులోకి వెళ్లేలా పైపులు బిగిస్తారు. కానీ కంపెనీ పంపించిన టెక్నీషియన్ ఫిల్టర్‌ని ఇన్ స్టాల్ చేయడంలో తప్పు చేశారు. శుద్ధి చేసిన నీటిని డ్రైనేజ్‌లోకి వెళ్లేలా, శుద్ధి చేయగా మిగిలిన కెమికల్ వేస్ట్ వాటర్‌ను ప్యూరిఫయర్ ట్యాంకు లోకి వెళ్లేలా పైపులు తప్పుగా బిగించారు. పాపం ఆ విషయం తెలియని మహిళ గత ఐదేళ్లుగా ఆ వేస్ట్ వాటర్ నే ఫిల్టర్ వాటర్ అనుకుని తాగుతున్నారు. అందుకే ఆమె అనారోగ్యం బారినపడుతూ వచ్చారు.
కంపెనీపై దావాకు సిద్ధం అవుతోన్న మహిళ
అసలు విషయం తెలుసుకున్న మహిళ షావోమి కంపెనీని సంప్రదించారు. టెక్నీషియన్ చేసిన పొరపాటుకు తాను ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో నష్టపోయానన్నారు. అయితే, ఆ కంపెనీ మాత్రం మెషిన్ కొనడానికి పెట్టిన ఖర్చును మాత్రమే వెనక్కి తిరిగిస్తాం అని చెప్పింది. షావోమి ప్రతిపాదనకు ఒప్పుకోని మహిళ, కన్సూమర్ ఫోరం కింద న్యాయపోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతకంటే ముందుగా, తన ఆరోగ్యం చెడిపోవడానికి షావోమి ఫిల్టర్ ద్వారా వచ్చిన వేస్ట్ వాటర్ కారణం అయ్యాయని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు.
మీ ఇంట్లో కూడా వాటర్ ప్యూరిఫయర్ ఉందా?
కేవలం ప్యూరిఫయర్ వాటర్ తాగుతున్నామని సరిపెట్టుకోవద్దు, ఆ ప్యూరిఫయర్ మెషిన్ సరిగ్గా ఇన్‌స్టాల్ చేశారా? నీరు సరిగ్గా ఫిల్టర్ అవుతుందా లేదా? ఫిల్టర్ అయిన నీటిలో టీడీఎస్ ఎంత ఉందనే వివరాలు కూడా చెక్ చేసుకోవాలి అని ఈ ఘటన నిరూపించింది. ఫిల్టర్‌ను సరిగ్గానే ఫిట్ చేసినప్పటికీ, అది సరిగ్గా పనిచేయకపోతే అందులోని నీరు శుద్ధి అయ్యే అవకాశం ఉండదు. అందుకే మీ ఇంట్లో కూడా ఫిల్టర్ ఉన్నట్లయితే, ఆ నీటిలో ఎంత క్వాలిటీ ఉందో చెక్ చేసుకోండి. లేదంటే దీర్ఘకాలంలో జబ్బుల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. అందుకు ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్.