Secret Cameras in Hotel Rooms: హోటల్ గదిలో సీక్రెట్ కెమెరాలు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్
Secret Cameras in Hotel Rooms: హోటల్ గదిలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి హోటల్‌కి వచ్చి వెళ్లిన జంటలను బ్లాక్ మెయిల్ చేస్తోన్న ఉదంతం శంషాబాద్‌లో వెలుగుచూసింది. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్ నిర్వాహకులు తమని బ్లాక్ మెయిల్ చేసి వేధిస్తున్నారని ఒక జంట శంషాబాద్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. హోటల్ గదిలో సీక్రెట్‌గా కెమెరాలు ఏర్పాటు చేసి కస్టమర్స్‌కి సంంబధించిన దృశ్యాలు రికార్డ్ చేస్తున్నారని.. ఆ తరువాత కస్టమర్లకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు లీక్ చేస్తామని బెదిరిస్తున్నట్లుగా శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ దర్యాప్తులో భాగంగా శంషాబాద్ పోలీసులు హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం హోటల్ యజమానిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇలా చాలామంది జంటల వద్ద నుండి ఈ హోటల్ నిర్వాహకులు డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ హోటల్ నిర్వాకం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదే కాదు.. గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడి అరెస్ట్ అయిన హోటల్ యజమానులు ఉన్నారు. దూర ప్రయాణాలు చేస్తూ అవసరాల నిమిత్తం హోటల్స్‌లో బస చేసే వాళ్లు లేదా అప్పుడప్పుడు అత్యవసర పరిస్థితులపై హోటల్స్‌లో ఉండాల్సి వచ్చే వాళ్లు ఇలాంటి నేరాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలా అయితే పౌరులకు ఇక స్వేచ్ఛగా జీవించే హక్కు ఎలా ఉంటుంది అని మండిపడుతున్నారు.