Top 6 News @ 6PM: కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసుల నోటీసులు, మరో 5 ముఖ్యాంశాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.
1. సుప్రీంలో పిటిషన్ ను వెనక్కి తీసుకున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులను కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 8న సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సీజేఐను కేటీఆర్ న్యాయవాది కోరారు.
అయితే ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు. జనవరి 15న ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని సీజేఐ తెలిపారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది. ఫార్మూలా ఈ కారు రేసులో ప్రభుత్వ ధనం ఎక్కడా దుర్వినియోగం కాలేదని, అవినీతి జరగలేదని కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ విబేధించారు.ఫార్మూలా ఈ రేసుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని ఆయన ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.ఈ కేసు నిర్వహణతో ఎవరికి లాభం అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాజకీయ కారణాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. దీంతో ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే అదే సమయంలో తమకు హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కేటీఆర్ తరపు న్యాయవాది అభ్యర్ధించారు.తాము దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు.
2. మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత: మంచు మనోజ్ ను అడ్డుకున్న పోలీసులు
మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం హైడ్రామా నెలకొంది. మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు యూనివర్సిటీ లోపల ఉండగా మంచు మనోజ్ దంపతులు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్‌ను సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసులు అడ్డుకున్నారు.
మంచు కుటుంబం మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో మంచు మనోజ్ యూనివర్సిటీలోకి వస్తే సమస్యలు తలెత్తవచ్చన్న ఉద్దేశంతో సెక్యూరిటీ సిబ్బంది మనోజ్‌ను అనుమతించలేదు. తాను గొడవ కోసం రాలేదని.. యూనివర్సిటీ ఆవరణలో తన తాత నారాయణ స్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధుల వద్ద నివాళులర్పించేందుకు మాత్రమే వచ్చానని మనోజ్ చెప్పినప్పటికీ సెక్యరిటీ సిబ్బంది అనుమతించలేదు.దీంతో మనోజ్ గేటు వద్ద ఆందోళనకు దిగారు.
3. తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన
తెలంగాణలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 29 నుంచి ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఏప్రీల్ 29, 30 తేదీల్లో ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తారు. మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. మే 12 న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్, జూన్ 6న లాసెట్, జూన్ 8,9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
డిప్లొమా విద్యార్ధులు ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ ను మే 12న నిర్వహిస్తారు. ఈ సెట్ ను ఓయూ నిర్వహించనుంది.
4. ఉక్రెయిన్ పై రష్యా దాడి
పోలాండ్ సరిహద్దుల్లో ఉక్రెయిన్ పై రష్యా బుధవారం పెద్ద ఎత్తున దాడికి దిగింది. గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. రష్యా క్షిపణుల దాడులతో నాటో దళాలు అప్రమత్తమయ్యాయి. మొత్తం 40 క్షిపణుల్లో 30 క్షిపణుల్లో నేల కూల్చామని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీ ప్రకటించారు.
5. చంద్రబాబుకు స్కిల్ కేసులో సుప్రీంలో ఊరట
చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు జనవరి 15న కొట్టివేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి జైలులో ఉన్నారు. 2023 నవంబర్ 20న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంతో ఈ కేసుపై ప్రభావం ఉంటుందని అప్పట్లో ప్రభుత్వం వాదించింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. చార్జీషీట్ దాఖలైనందున ప్రస్తుతం ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
6. కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసుల నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే అదే రోజున కరీంనగర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నందున విచారణకు ఈ నెల 17న హాజరు కానున్నట్టు కౌశిక్ రెడ్డి చెప్పారు. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదైంది.