TOP 6 NEWS @ 6PM: పాడి కౌశిక్ రెడ్డి దాడి వెనుక ఎవరున్నారు? ఎమ్మెల్యే సంజయ్ అనుమానం
1) కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే నేనూ చేస్తా - సంజయ్ కుమార్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కరీంనగర్ ఒకటో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడిలా తనపై దాడి చేశారని సంజయ్ అన్నారు. "ఈ దాడి కౌశిక్ స్వయంగా చేశారా లేక ఆయన వెనుక ఎవరైనా ఉండి రెచ్చగొట్టి ఈ దాడి చేయించారా" అని అనుమానం వ్యక్తంచేశారు. కౌశిక్ రెడ్డి దాడిపై తెలంగాణ స్పీకర్ కు ఫిర్యాదు చేశానన్నారు.
ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్పించుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ప్రోత్సహించారు. ఇవాళ వారు తనను ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. ముందుగా కేటీఆర్, కేసీఆర్ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తే తాను కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని సంజయ్ అభిప్రాయపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలువు అని నిన్న సంజయ్ కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే.
2) ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై 300 కేసులు
సంక్రాంతి పండగకు ఊరెళ్లే ప్రయాణికులతో భారీ సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు రోడ్డెక్కాయి. ఇందులో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలంగాణ రవాణ శాఖ వెల్లడించింది. దీంతో గత 4 రోజులు హైదరాబాద్ లో ఎల్బీ నగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రైవేట్ వాహానాల తనిఖీ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహానాల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 300 కు పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో అధికారులు ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు.
3) Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. వేర్వేరు ఘటనల్లో మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అతడి పీఏ ఫిర్యాదు మేరకు కౌశిక్‌పై కేసు నమోదు చేశారు వన్‌టౌన్ పోలీసులు. అలాగే నిన్న జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో గందరగోళం సృష్టించి, మీటింగ్‌ను పక్కదారి పట్టించారంటూ ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఫిర్యాదుతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడో కేసు నమోదు చేశారు పోలీసులు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ముదిరి ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా తోసుకోవడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది.
4) What happens after death - చనిపోయిన తరువాత మనిషికి ఏం జరుగుతుంది?
ఒక మనిషి చనిపోయిన తరువాత వారికి ఏం జరుగుతుంది? ఇది చాన్నాళ్లుగా చాలామందిని వేధిస్తోన్న ప్రశ్న. శనివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఒక 17 ఏళ్ల యువకుడు సూసైడ్ చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఆ యువకుడికి చనిపోయే ముందు ఇదే డౌట్ వచ్చింది. చనిపోయిన తరువాత మనిషికి ఏం జరుగుతుంది అని ఆ యువకుడు గూగుల్‌లో సెర్చ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఆ యువకుడి ఆత్మహత్యకు కారణం ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని మాత్రం కాదు. 9వ తరగతి చదువుతున్న ఆ టీనేజ్ కుర్రాడి ఆత్మహత్య వెనుక వేరే కారణం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
ఆ టీనేజ్ కుర్రాడి తల్లి మీరట్ మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తున్నారు. తండ్రి గతేడాది చనిపోయారు. సోదరుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే, ఈ కుర్రాడు మాత్రం చదువు మీద దృష్టి సారించకుండా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ వేసుకుని స్నేహితులతో తిరుగుతున్నాడని ఇంట్లో తల్లి, సోదరుడు మందలించారు. అయినప్పటికీ తమ అబ్బాయి తీరులో మార్పు రాలేదని, దీంతో ఆ బైక్ అమ్మేస్తే కానీ మారడనే ఉద్దేశంతో బైక్ అమ్మేశామని చెప్పారు. అయితే, ఆ బైక్ అమ్మేశామనే కోపంలోనే తన కొడుకు సూసైడ్ చేసుకున్నాకరని ఆ టీనేజ్ కుర్రాడి తల్లి చెప్పారు.
5) ఒక్క మహా కుంభమేళాతో యూపీ సర్కార్‌కు అన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుందా?
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 40-45 కోట్లకు పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఇది అమెరికా, కెనడా జనాభా కంటే ఎక్కువ.
ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్‌లో ఇవాళ తొలి పుణ్య స్నానాలతో ప్రారంభమైంది. తొలి రోజు జరిగే పుణ్య స్నానాల్లో సుమారు 50 లక్షల మంది భక్తులు పాల్గొంటారని యూపీ సర్కారు అంచనాలు చెబుతున్నాయి. గంగ, యుమన, సరస్వతి నదులు కలిసే ప్రయాగ్ రాజ్‌నే మహా కుంభమేళాకు వేదికగా ఎంచుకోవడం మొదటి నుండి ఒక ఆనవాయితీగా వస్తోంది. మహా కుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కారు రూ, 7 వేల కోట్లు వెచ్చిస్తోంది. అయితే, పెట్టిన ఖర్చు కంటే భారీగా యూపీ సర్కారు ఖజానాకు ఆదాయం రానుందని తెలుస్తోంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) బంగ్లాదేశ్ దౌత్యవేత్తను పిలిచి మాట్లాడిన భారత్
ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 5 ప్రదేశాల్లో ఫెన్సింగ్ నిర్మించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఆరోపించింది. ఇదే విషయమై ఆదివారం బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశ రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ హై కమిషనర్ ప్రణయ్ వర్మను పిలిచి మాట్లాడింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి జషీముద్దీన్, ప్రణయ్ వర్మ మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు ఇది విరుద్ధమని యూనస్ సర్కార్ ఆరోపించింది.
అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ నురల్ ఇస్లాంను భారత విదేశీ వ్యవహారాల శాఖ పిలిపించి మాట్లాడింది. అంతకంటే ముందే ప్రణయ్ వర్మ సైతం భారత్ వైఖరిని బంగ్లాదేశ్ కు స్పష్టంగా చెప్పారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నేరాల నియంత్రణకు కలిసి పనిచేయాల్సిందిగా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సరిహద్దుల్లో గస్తీ కాసే ఇండియన్ బార్డర్ సెక్యురిటీ ఫోర్స్, బంగ్లాదేశ్‌కు చెందిన బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు.